Tiger | మహారాష్ట్ర పులులు తెలంగాణలోకి ఎందుకు వస్తున్నాయి?
తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో భయం
పూర్వ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీగ్రామాల ప్రజలను పులులు వణికిస్తున్నాయి.మహారాష్ట్రలోని(Maharashtra) రెండు పులుల అభయారణ్యాల్లో పులుల కోసం అటవీ గ్రామాల ప్రజలను మైదాన ప్రాంతాలకు తరలించారు.వన్యప్రాణుల వేటగాళ్లపై చర్యలు తీసుకొని పులుల వేటకు పుల్ స్టాప్ పెట్టారు.దీంతో మహారాష్ట్రలోని తాబోబా,అంధారి టైగర్ రిజర్వ్ లలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెరిగిన పులులు(Tigers) పొరుగున ఉన్న తెలంగాణలోని ఆదిలాబాద్ అడవుల్లోకి వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు సేద్యం వల్ల అటవీ ప్రాంతం గణనీయంగా తగ్గింది. దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చిన పులులు అటవీ గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.
రోడ్డు పక్కన పులి ప్రత్యక్షం
ఆసిఫాబాద్‌లో జాతీయ రహదారి 363 వంతెన వద్ద పులి ప్రత్యక్షమైంది.తెలంగాణ,మహారాష్ట్ర సరిహద్దుల్లోని వాంకిడి మండలం గోయగావ్ గ్రామ సమీపంలోని పర్యావరణ వంతెన వద్ద మంగళవారం సాయంత్రం పులి కనిపించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కొందరు వాహనదారులు పులిని వీడియో తీశారు.పులి వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది.
మహారాష్ట్ర అడవుల నుంచి...
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడవుల్లో నివసిస్తున్న పులి తెలంగాణ అడవుల్లోకి వచ్చినట్లు ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారులుచెప్పారు.భూభాగం వెతుక్కుంటూ ఆసిఫాబాద్ జిల్లాలోని అడవుల్లోకి పులి వచ్చిందని వారు పేర్కొన్నారు.పులికి ఎలాంటి ఆటంకం లేకుండా అడవుల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని అటవీశాఖ అధికారులు(forest department) తెలిపారు.
పులి సంచారంతో కలకలం
ఆసిఫాబాద్‌లో పులి సంచారం కలకలం సృష్టించింది.పొరుగున ఉన్న మహారాష్ట్రకు చెందిన ఓ పులి రెండ్రోజుల క్రితం వాంకిడి మండలం అడవుల్లోకి వచ్చిందని అటవీశాఖ అధికారులు తెలిపారు.వాంకిడి మండలం దాబా గ్రామంలో ఆది, సోమవారాల్లో పులి సంచరించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.పులి సంచారం నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు కోరారు.దాబా గ్రామ సమీపంలోని వాలీలో మేస్తున్న పశువుల మందపై పులి దాడి చేసేందుకు ప్రయత్నించిందని దాబా గ్రామ వాసులు తెలిపారు. గొర్రెల కాపరి పెద్దగా కేకలు వేసి పశువులను రక్షించగలిగాడు. దాబా,కోరే దోబ్రా,బండకాస,సవతి,అంతపూర్,గొండగావ్ అటవీగ్రామాల వాసులు పులి సంచారంతో తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
మహారాష్ట్ర సరిహద్దుల్లో...
జైనూరు,నార్నూర్ అడవుల్లో మహారాష్ట్రకు చెందిన పులి సంచరిస్తోంది.నాందేడ్,యావత్‌మాల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న పెనుగంగా వన్యప్రాణుల అభయారణ్యం నుంచి జైనూర్, నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామ సమీపంలోని అడవుల్లో మగపులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు.పులి నార్నూర్ అడవుల్లోకి వచ్చింది.
అడవుల్లో సీసీటీవీ కెమెరా ట్రాప్‌లు
పులుల సంచారం నేపథ్యంలో అడవుల్లో సీసీటీవీ కెమెరా ట్రాప్‌లను(CCTV camera traps) ఏర్పాటు చేశామని, పులుల కదలికలను గుర్తించేందుకు యానిమల్ ట్రాకర్ల ఐదు బృందాలను నియమించామని అటవీశాఖ మంచిర్యాల డీఎఫ్ఓ శివసింగ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.అడవులకు సమీపంలోని ప్రతి మండలంలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి గ్రామస్థులకు పులుల సంచారంపై అవగాహన కల్పిస్తున్నట్లు శివసింగ్ తెలిపారు.
ఆడపులి కోసం 350 కిలోమీటర్ల దూరం వచ్చిన జానీ
జానీగా పాపులర్ అయిన పెద్దపులి నిర్మల్ జిల్లా పెంబి మండలం నుంచి ఉట్నూర్ మండల అడవుల్లోకి ప్రవేశించింది. ఇది మొదట్లో దొడ్డిదారిన ఉట్నూర్ మండల అడవుల్లోకి వెళ్లి ఆడ పులి కోసం కుంటాల, సారంగాపూర్, మామడ మండలాల్లోని అడవుల్లో సంచరించిందని అటవీ శాఖ అధికారులు చెప్పారు.ఆడపులిని కలవడానికి మగపులి 350 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిందని అధికారులు తెలిపారు.మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్‌కు చెందిన రెండు పులులు సిర్పూర్ (టి) మండల అడవుల్లోకి వచ్చాయి. తిర్యాణి మండల అడవుల్లోకి మరో మగపులి ప్రవేశించింది. జైనూర్ మండలం పనపటార్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో పులి కనిపించడంతో స్థానికులు భయకంపితులయ్యారు.పప్పటార్ గ్రామం ఒడ్డున ఉన్న కుమ్రం భగవంతరావు పొలంలో నిద్రిస్తున్న పులిని గుర్తించినట్లు రైతు కుమ్రం వసంతరావు తెలిపారు.పనపటార్ గ్రామస్థులను అప్రమత్తం చేశారు.చుట్టుపక్కల 20 మంది గ్రామస్థులు పొలాల్లో పులిని చూసి పరుగులు తీశారు.
రైతుల భయాందోళనలు
నార్నూర్ మండలం తాడిహత్నూర్ అడవుల్లోకి పులి ప్రవేశించినట్లు గ్రామస్థులు తెలిపారు.పొలాల్లో పులి సంచారంతో పత్తి పంట కోసేందుకు పొలాల్లోకి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నామన్నారు.గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. పులితో అకస్మాత్తుగా ఘర్షణ జరగకుండా చూడాలని, విద్యుత్ కంచెలు వేయవద్దని అటవీశాఖ అధికారులు గ్రామస్థులకు సూచించారు. పులిని తిరిగి అడవిలోకి మళ్లించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, మహారాష్ట్రకు చెందిన మగపులి నార్నూర్‌లో సంచరిస్తుందని అధికారులు తెలిపారు.
భయం...భయం
ఆదిలాబాద్‌లోని లాల్ టెక్డీ సమీపంలో పులి కనిపించడంతో ప్రజలు భయాందోళనలు చెందారు.ఉట్నూర్ మండలం లాల్ టెక్డీ గ్రామ సమీపంలో రాత్రి రోడ్డు దాటుతుండగా పులి ప్రత్యక్షమై వాహనదారులను భయాందోళనకు గురి చేసింది.ఉట్నూర్, జైనూర్ మండలాల్లోని కొన్ని గ్రామాల వ్యవసాయ పొలాల్లో సోమవారం పులి సంచారం చేయడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.తమ నివాసాలకు ఆనుకుని ఉన్న పొలాలు, అడవుల్లో పులి సంచారంతో ఉట్నూర్, జైనూర్ గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. పులి దాడి చేస్తుందనే భయంతో తాము పత్తి పంట వేయలేదని రైతులు చెప్పారు.
Next Story