తెలంగాణలో రేవంత్‌ను మాదిగలు నమ్మే పరిస్థితి లేదా?
x

తెలంగాణలో రేవంత్‌ను మాదిగలు నమ్మే పరిస్థితి లేదా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్ని ప్రకటనలు చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా మాదిగలు ఒక్కరు కూడా నమ్మరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మందకృష్ణ.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాదిగలకు రవ్వంత కూడా నమ్మకం లేదని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఆయన ఎన్ని ప్రకటనలు చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా వారిని ఒక్కరు కూడా నమ్మరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మందకృష్ణ. మాదిగలకు అన్యాయం చేయాలని చూసిన సీఎంను మళ్ళీ వాళ్లు ఎలా నమ్ముతారన్నారు. ఉద్యోగాల నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కి ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండానే నియామకాలు చేపట్టాలని ప్రణాళికలు రచించారని, కానీ అది బెడిసి కొట్టడంతో ఇప్పుడు దిగొచ్చి వర్గీకరణ తర్వాత నియామకాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిగలకు న్యాయం జరిగే వరకు సీఎం రేవంత్‌ను ఒక్క మాదిగ కూడా నమ్మే పరిస్థితులే లేవని, నమ్మి మోసపోయి అలసిపోయామంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఎస్సీ రిజవర్వేషన్లు చేయకుండానే 11 వేలకుపైగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేయాలని చూసిన సీఎంను ఎలా నమ్మాలని కూడా ప్రశ్నించారు. ఇప్పటికే నోటిఫికేషన్‌లు విడుదల చేసిన పోస్ట్‌లకు సైతం వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిన రేవంత్.. దానిని మరిచారని, వర్గీకరణ చేయకుండా ఉద్యోగాల భర్తీకి తెరలేపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన మాటలకే విలువలేనప్పుడు.. ఆయన ఏదో మీటింగ్‌లో చెప్పిన వాటిని ఎలా నమ్మాలని ప్రశ్నించారు.

ఈ ప్రభుత్వం కూడా అంతే..

గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన చేసిందని, మాదిగలను తొక్కేసిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా ఏమాత్రం మార్పు లేదని ఎద్దేవా చేశారు మందకృష్ణ. సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా నిర్బంధాలతోనే పాలన కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణ చేయకుండా నియామకాలకు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించడానికి కూడా ఈ ప్రభుత్వం అనుమతించలేదని, ఇదే వీరి మాదిగ వ్యతిరేక తీరుకు నిలువెత్తు నిదర్శనమని మండిపడ్డారాయన.

వాటికీ వర్గీకరణ కావాలి..

ఉద్యోగాల నియామకంతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు కూడా ఎస్సీ వర్గీకరణను వర్తింపజేయాలని ఆయన కోరారు. లేని పక్షంలో వర్గీకరణ పూర్తయ్యే వరకు పరీక్షలను ఆపాలని, వర్గీకరణ పూర్తయిన తర్వాతే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని, గ్రూప్ 3 పరీక్షలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 4 ఫలితాలు ఇప్పటికే 16 నెలలు ఆగాయని, వాటి విడుదలను వర్గీకరణ జరిగే వరకు అంటే మరో 2 నెలలు వాయిదా వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగానే అక్టోబర్ 16న వరంగల్‌లో భారీ సభ నిర్వహిస్తామని అందులో అన్ని కమిటీల సభ్యులు పాల్గొనాలని కోరారు. అదే విధంగా ఇన్నాళ్లూ మాదిగలు ఆవేదనతో నిరసన చేయడమే చేశారని, కానీ ఇప్పుడు ఆవేశంతో నిరసన చేయడం చూస్తారని, దాని పర్యవసానాలు ఎలా ఉన్నా వాటికి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

రేవంత్ ఏం ప్రకటన చేశారంటే..

ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సుప్రీం తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం కోసం హైకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను వెంటనే నియమించాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిషన్ 60 రోజుల్లోగా ఎస్సీ వర్గీకరణపై నివేదిక సర్పంచాలన, ఆ నివేదిక ప్రకారమే ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు చేస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్. దాంతో పాటుగానే బీసీ సామాజిక, కుల, ఆర్థిక కుల సర్వేను కూడా వెంటనే ప్రారంభించాలని వివరించారు. ‘‘న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఎస్సీ జనాభా లెక్కలకు సంబంధించి 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏకసభ్య కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాలు అందించాయి. ఈ విషయంలో సమాచారం ఇవ్వడంలో ఏ విభాగం కూడా జాప్యం చేయకూడదు. ఈ సమాచారం అందేలా చూసే బాధ్యత సీఎస్‌దే. ఈ ఏకసభ్య కమిషన్ పది జిల్లాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని సీఎం వివరించారు.

Read More
Next Story