పింఛన్‌దారులను రేవంత్ నట్టేట ముంచారా..!
x

పింఛన్‌దారులను రేవంత్ నట్టేట ముంచారా..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వికలాంగుల హక్కుల పోరాట సమితి(VHPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మాదిగ మందకృష్ణ మరోసారి మండిపడ్డారు.


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వికలాంగుల హక్కుల పోరాట సమితి(VHPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మాదిగ మందకృష్ణ మరోసారి మండిపడ్డారు. రేవంత్ సర్కార్.. పింఛన్‌దారులను నట్టేట ముంచిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. చేయూత పింఛన్ దారులందరినీ ఏకం చేయడానికి తమ వీహెచ్‌పీఎస్ సంఘం ప్రయత్నం చేస్తోందని, వారితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు మందకృష్ణ. నమ్మి ఓటేసినందుకు చేయూత పింఛన్‌దారులందరినీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచేసిందని మండిపడ్డారాయన. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి పింఛన్ దారులు ఓట్లు వేస్తే ఇప్పుడు వారికే అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయూత పింఛన్‌ను పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన రేవంత్ రెడ్డి.. అధికారం వచ్చిన పది నెలలు అవుతున్నా ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి కన్నా చంద్రబాబు చాలా బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తానిచ్చిన పింఛన్ పెంపు హామీ అమలు విషయంలో చంద్రబాబు తన నిబద్దతను తెలుపుకున్నారంటూ పేర్కొన్నారు.

చంద్రబాబే బెస్ట్

‘‘దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఇవ్వాలంటూ ఏపీలో ఏప్రిల్ నెలలో సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చాం. అంతే జూన్‌లో అధికారంలోకి రాగానే ఏప్రిల్, మే, జూన్ మొత్తం మూడు నెలల పింఛన్‌ను ఒకేసారి అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో కండరాల బలహీనత ఉన్న వారికి రూ.15వేలు ఇస్తున్నారు. రేవంత్‌తో పోలిస్తే చంద్రబాబు వందరెట్లు నయం. తెలంగాణలో వచ్చే నెల 10వ తేదీ గడిచిందంటే.. ఈ ప్రభుత్వం తమకు పదినెలల బకాయిలతో పాటు నవంబర్ నెల పింఛన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మొత్తం ఇవ్వని పక్షంలో భారీ ఉద్యమం తప్పదు. నవంబర్ 1 నుంచి 16 వరకు ప్రతి రోజూ రెండు జిల్లాల్లో చేయూత పింఛన్ లబ్ధిదారులకు చైతన్య సభలు నిర్వహిస్తాం. అప్పటికీ ఇవ్వకుంటే నవంబర్ 26న చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తాం. 26వ తేదీని వికలాంగుల మహా గర్జన పేరుతో వేలాది మందితో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపడతాం. ఈ ధర్మాకు కాంగ్రెసేతర పార్టీలను ఆహ్వానిస్తాం. రేవంత్ ప్రభుత్వంతో తాడేపేడో తేల్చుకుంటాం’’ అని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడంపై ఎస్సీ వర్గీకరణ జరగకుండా రేవంత్ నియామక పత్రాలు ఎలా ఇస్తారని మందకృష్ణ మాదిక ప్రశ్నించారు. ఆ విషయంలో కూడా ప్రభుత్వానికి వార్నింగ్‌లిచ్చారు.

వర్గీకరణపై మందకృష్ణ వార్నింగ్ ఇదే..

ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారంటూ మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. తమ హక్కులను సాధించుకోవడం కోసం మాదిగలు, ఉపకులాల వారు మరో ఉద్యమానికి సిద్ధం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఎస్సీ వర్గీకరణ చేయకుండా నియామక పత్రాలు అందించడం కోసం కాంగ్రెస్, సీఎం సన్నాహాలు చేశారని, ఇది మాదిగలను, ఉపకులాల వారిని అణచివేతకు గురిచేయడమేనంటూ మందకృష్ణ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ ముందుంటుందని చెప్పిన సీఎం, అమలు విషయంలో చాలా వెనక ఉంటుందని చెప్పడం మరిచినట్లున్నారంటూ చురకలంటించారు. వర్గీకరణ చేపట్టడంలో ఇంతటి జాప్యానికి గల కారణాలేంటో చెప్పాలని సీఎంను కోరారు. ఇది మాదిగలకు అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రణాళిక ప్రకారం చేస్తున్న జాప్యమే తప్ప అనుకోకుండా జరుగుతున్నది కాదని అనుమానం వ్యక్తం చేశారు. అలాకాని పక్షంలో ఎందుకు జాప్యం జరిగిందో సీఎం రేవంత్ రెడ్డి వివరించాలని డిమాండ్ చేశారు.

‘‘ఎస్సీ వర్గీకరణ చేపడితే మాదిగ మాలలు అందరూ కలిసి మళ్లీ ఒకసారి తమ ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉద్యమిస్తారని భయం రేవంత్ రెడ్డి సర్కార్‌లో ఉంది. రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వడంలో ఎంత దిట్టో ఆ హామీలను అమలు చేయకుండా మోసం చేయడంలో కూడా అంతకన్నా అందవేసిన చేయి. కేంద్రంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్న డబ్బు గల కొంతమంది నాయకులు,టీవీ చానల్స్ తమ డబ్బు అధికారాన్ని ఉపయోగించి వర్గీకరణ జరిగితే తమ ఉనికిని అధికారాన్ని కోల్పోతామన్న భయంతో వర్గీకరణ అంశాన్ని అడ్డుకుంటున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా ఎస్సీ వర్గీకరణపై రేవంత్ నిర్ణయం ఇదే..

అయితే అప్పటికే ఎస్సీ వర్గీకరణ అంశంపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘‘న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఎస్సీ జనాభా లెక్కలకు సంబంధించి 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏకసభ్య కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాలు అందించాయి. ఈ విషయంలో సమాచారం ఇవ్వడంలో ఏ విభాగం కూడా జాప్యం చేయకూడదు. ఈ సమాచారం అందేలా చూసే బాధ్యత సీఎస్‌దే. ఈ ఏకసభ్య కమిషన్ పది జిల్లాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని సీఎం వివరించారు. ఎస్సీ వర్గీకరణ బాధ్యతల కోసం వన్ మ్యాన్ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ జరగాలని రేవంత్ చెప్పారు. కమిషన్ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా అవసరమైన ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. వర్గీకరణపై సవివరమైన రిపోర్టు వచ్చిన తర్వాతే ఉద్యోగాల నియామకాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ చెప్పారు. గడువులోగా కమిషన్ వర్గీకరణ రిపోర్టును ఇవ్వాలని సీఎం గట్టిగా చెప్పారు.

Read More
Next Story