స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటున్న కాంగ్రెస్..
x

స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటున్న కాంగ్రెస్..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం తమనే వరించనుందని ధీమా వ్యక్తం చేశారు. వీటిని వీలైనంత త్వరగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన వివరించారు. నిజామాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. ఈ సందర్భంగానే మంత్రి వర్గ విస్తరణపై కూడా కీలక అప్‌డేట్ చెప్పారు. వీలైనంత త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగనుందని, ఇప్పటికే దానిపై కూడా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోందని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే ఎన్ని సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని వ్యాఖ్యానించారు. ఆఖరికి మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేసి ప్రజా రంజక పాలన అందిస్తున్నామని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందేని, కానీ కేసీఆర్ అధికారంలో ఏ ఒక్కటి కూడా మారలేదని విమర్శించారు.

అధికారంలోకి రాగానే ఉద్యోగాలు..

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే 50 వేల ఉద్యోగాలు కల్పించింది. అదే కేసీఆర్ పదేళ్ల పాలనలో మొత్తం 30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రుణమాఫీ విషక్ష్ంలో ప్రజలను అయోమయానికి గురి చేసి రాజకీయ మైలేజీ పెంచుకోవాలని చూస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఇలా ప్రశ్నించే ముందు.. పదేళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన రుణమాఫీ ఎంత? తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ చేసిన రుణమాఫీ ఎంత అనేది వారు ఒకసారి బేరీజు చేసుకోవాలి. పాలించిన పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్ఛినం చేశారు. అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి కూడా అన్నీ అమలు చేస్తున్నాం. సోషల్ మీడియాను కనీస సోషల్ సెన్స్ లేకుండా వాడుతూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా నోటికొచ్చినట్లు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు మహేష్ కుమార్.

పారిశ్రామిక అభివృద్ధిపై త్వరలోనే చర్చ

‘‘జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డితో అతి త్వరలోనే చర్చిస్తాం. ప్రాణహిత 20, 21వ ప్యాకేజీ పనులను వేగవంతం చేస్తాం. జిల్లాకు మెడికల్ కాలేజీ అవసరం చాలా ఉంది. దాని నిర్మాణంతో పాటు స్టేడియం నిర్మాణం కూడా అతి త్వరలోనే చేస్తాం. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఆర్‌ఓబీ విషక్ష్ంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’’ అని మండిపడ్డారు.

విజయం మాదే..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు పాలించి యువతకు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్‌ను ప్రజలు, యువత, నిరుద్యోగులు ఎవరూ నమ్మే పరిస్థితులు లేవన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారీ మొత్తంలో ఉద్యోగాలిచ్చిందని గుర్తు చేశారు. అతి త్వరలోనే మరిన్ని ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ఉక్కుపాదం మోపనున్నామని, కాంగ్రెస్ పాలనను ప్రజలకు వివరిస్తూనే ప్రణాళిక ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లనున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

Read More
Next Story