అనంతగిరి కొండల అందాలు చూద్దాం రండి
x
అనంతగిరి కొండల అందాలు

అనంతగిరి కొండల అందాలు చూద్దాం రండి

హైదరాబాద్ నగర వాసులకు వీకెండ్స్‌లో అనంతగిరి హిల్స్ అటవీ అందాల పర్యటనను తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకుచ్చింది.


పచ్చని ఎతైన చెట్లు...కొండలు, గుట్టలు,జాలువారుతున్నజలపాతాలు, నీటి గలగలలతో కూడిన కోటిపల్లి సరస్సు, ప్రకృతి సోయగాల నడుమ ఉన్న అనంతగిరి హిల్స్ పర్యాటకుల పాలిట స్వర్గథామంగా నిలచింది.పచ్చని వివిధ రకాల చెట్లతో కూడన అనంతగిరి అటవీ ప్రాంతం...ఇందులో కొండ గొర్రెలు, చెంగుచెంగున దూకే జింకలు, రెక్కలు విప్పి నాట్యం చేసే నెమళ్లు, రంగురంగుల పక్షులు, వన్యప్రాణులకు నిలయంగా మారింది.




ప్రకృతి ఒడిలో విహారం

అటవీ ప్రాంతాన్ని దెబ్బతీయ కుండా ప్రకృతి సోయగాలను పర్యాటకులకు చూపించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దైనందిన బిజీ జీవితంతో సతమతమవుతున్న హైదరాబాద్ నగరవాసులు వారాంతాల్లో ఒకింత సేద తీరేందుకు అనంతగిరి హిల్స్ లోని ప్రకృతి ఒడిలో విహరించి సేదతీరుతుంటారు. పర్యాటకులు అనంతగిరి హిల్స్ కు మధ్యాహ్నం సమయానికి చేరుకుంటే వారికి భోజనం పెట్టి అడవిలో బర్డ్ వాక్, ట్రెక్కింగుకు తీసుకువెళతామని శ్రీనివాస్ చెప్పారు. హరిత రిసార్ట్సులో పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు రెండో రోజు ఉదయాన్నే6 గంటల నుంచి 9 గంటల వరకు సఫారీ యాత్రకు తీసుకువెళ్లి వన్యప్రాణులను చూపిస్తామని ఆయన వివరించారు.




అనంతగిరి హిల్స్‌కు ఎలాచేరాలంటే...

వారాంతాల్లో పచ్చని చెట్లు, చుట్టూ కొండలు, గుట్టలు, జాలువారుతున్న జలపాతాలు, నీటి గలగలలతో కూడిన కోటిపల్లి సరస్సుతో కూడిన అనంతగిరి కొండల అందాలను తిలకించాలంటే హైదరాబాద్ నగరం నుంచి బస్సు లేదా రైలు, లేదా కారు, బైక్ లపై వెళ్లవచ్చు.
- మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వికారాబాద్ కు టీఎస్ఆర్టీసీ బస్సులో 90 కిలోమీటర్ల దూరంలో రెండు, మూడు గంటల్లో వికారాబాద్‌కు చేరుకోవచ్చు. వికారాబాద్ బస్టాండు నుంచి టాక్సీ లేదా ఆటోలో అనంతగిరి హిల్స్ కు వెళ్లవచ్చు. కారు లేదా బైక్ లపై కడా అనంతగిరి కొండ ప్రాంతాల సందర్శనకు వెళ్లవచ్చు.
- సికింద్రాబాద్ లేదా నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి వికారాబాద్ రైల్వే స్టేషనుకు ప్యాసింజరు జైలులో ప్రయాణించవచ్చ. వికారాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఆటోల్లో6 కిలోమీటర్ల దూరంలోని అనంతగిరి కొండ ప్రాంతానికి వెళ్లవచ్చు.



వ్యూపాయింట్ నుంచి చూస్తే మధుర అనుభూతి

వ్యూపాయింట్ నుంచి అనంతగిరి కొండల అందాలను వీక్షించవచ్చు. సాహస ప్రియులు అనంతగిరి కొండలపై ట్రెక్కింగ్ చేయడం మర్చిపోలేని మధుర అనుభూతిని మిగిలిస్తోంది.పచ్చని చెట్ల మధ్య గుట్టలపై ట్రెక్కింగ్ చేయడం సాహసానికి గుర్తుగా నిలుస్తుంది. రాత్రి వేళ అనంతగిరి కొండలపై నక్షత్రాలు చూస్తూ టెంట్లలో నైట్ హాల్టు చేయవచ్చు.




అందమైన ప్రకృతి దశ్యాలు

స్వచ్ఛ మైన గల, అందమైన ప్రకృతి దశ్యాలను చూస్తూ జరిపే ప్రయాణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.గోడంగూడ వ్యూపాయింట్ నుంచి పనోరామిక్ కొండలు, లోయలు, పచ్చని అడవుల అందాలను వీక్షించవచ్చు. హిల్ స్టేషన్ కావడంతో అనంతగిరి ఎప్పుడూ చల్లదనాన్ని ఇస్తుండటంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.



మూసీ నదీ ప్రారంభం ఇక్కడే...

అనంతగిరి కొండలపై కురిసిన వర్షపు నీటితో కోటిపల్లి రిజర్వాయ్ జలకళను సంతరించుకుంది. అనంతగిరి కొండల ప్రాంతం నుంచి పుట్టిన మూసీనదీ వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ మీదుగా నల్గొండ జిల్లాలోకి ప్రవహిస్తోంది. కోటిపల్లి సరస్సు వద్ద జంటలు నైట్ క్యాంపింగ్ చేయవచ్చు. అనంతగిరి కొండలపై కురిసిన వర్షపునీరు జాలువారుతూ ఏర్పడిన మూసీ నదీ తీరంలో కూర్చొని పర్యాటకులు సేదతీరవచ్చు.

అనంతగిరి కొండల అందాలు

మంచినీటి గలగలల మధ్య పర్యాటకులు పరవశించి పోతుంటారు. అనంతగిరి కొండల అందాల అనుభవాలను పర్యాటకులకు అందించాలనే ఆశయంతో తాము అటవీ ప్రాంతాన్ని దెబ్బతీయ కుండా పరిమిత సంఖ్యలో పర్యాటకులను తీసుకువచ్చి వారికి ప్రకృతిపై అవగాహన కల్పిస్తున్నామని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు మేనేజర్ కళ్యాణం సుమన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



ప్రకృతి సోయగాల నడుమ...

అనంతగిరి ప్రకృతి సోయగాలను చూస్తూ పరవశించడమే కాకుండా పర్యాటకులు అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు.విష్ణు దేవుడికి భక్తులు పూజలు చేస్తుంటారు. అందమైన పురాతనమైన ఈ ఆలయం పర్యాటకులకు ఆథ్యాత్మిక ఆనందాన్ని అందిస్తోంది. సర్పనపల్లి సరస్సు ఒడ్డున కూర్చొని నీటి గలగలలను ఆస్వాదించవచ్చు.బుగ్గ రామ లింగేశ్వర స్వామి దేవాలం వద్ద జాలువారుతున్న జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది.



అనంతగిరి హిల్స్ పచ్చదనంతో కళకళ

జూన్ నెలలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో అనంతగిరి హిల్స్ పచ్చదనంతో కళకళలాడుతోంది.ప్రకృతి ఒడిలో సేద తీరుతూ నేచర్ వాక్ చేస్తూ రంగురంగుల పక్షులను వాటి కిలకిల రావాలను వింటూ పర్యాటకులు ఆనందానుభూతిని పొందుంతుంటారు. 300 కు పైగా విదేశీ వలస పక్షులే కాకుండా స్వదేశీ పక్షుల కిలకిల రావాలతో అనంతగిరి కొండలు మార్మోగుతుంటాయి.

కోటపల్లి రిజర్వాయర్
మంచినీటి గలగలలతో కూడిన కోటపల్లి రిజర్వాయర్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.కొండ నడుమ వెలసిన కోటపల్లి సరస్సులో పర్యాటకలు బోటింగ్ చేస్తుంటారు. కోటపల్లి చెరువుల ఫిషింగ్ చేయడం పర్యాటకులకు హాబీగా మారింది.దామగుండం రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని పర్యాటకులు భక్తి భావంతో పూజలు చేస్తుంటారు.పర్యావరణంపై పర్యాటకులకు అవగాహన కల్పించడంతోపాటు వారికి అటవీ ప్రాంతాల పర్యటన అనుభవాన్ని అందించేందుకు తాము రోజుక కేవలం 12 మంది పర్యాటకులకే అనంతగిరి హిల్స్ పై బర్డ్ వాచింగ్, సఫారీ యాత్ర, ట్రెక్కింగ్ కార్యక్రమాలు చేపట్టామని అటవీశాఖ పర్యావరణ వేత్త అఖిల్ ‘ఫెడరల్ తెలంగాణ’కు వివరించారు.




Read More
Next Story