Deccan’s Diamonds | తెలంగాణ పర్యాటక కేంద్రాల అందాలు చూద్దాం రండి
కొత్త సంవత్సరం తెలంగాణలోని అందాల పర్యాటక కేంద్రాలు రా రమ్మని పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.దక్కన్ డైమండ్స్ కేంద్రాల సందర్శనకు జరూర్ ఆనా అంటూ ఆకట్టుకుంటోంది.
జోడేఘాట్ లోయ అందాలు
జల్, జంగల్, జమీన్ కోసం నాడు పోరాడిన కొమురం భీం గుర్తుగా జోడేఘాట్ లో నిర్మించిన కొమురం భీం మెమోరియల్, మ్యూజియం, జోడేఘాట్ లోయ అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పచ్చని చెట్లు, లోతైన లోయ అందాలు, జాలు వారే జలపాతం, ప్రకృతి సోయగాల పచ్చదనం మధ్య జోడేఘాట్ లోయ అందాలు పర్యాటకులను అలరిస్తున్నాయి. జోడేఘాట్ లోయ అందాలు తిలకిస్తూ పోచమ్మ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత అడవిలో వెలసిన కొమురం భీం ప్రాజెక్టు రిజర్వాయరులో బోటింగ్ అనుభవం పర్యాటకులకు మధుర అనుభూతిని మిగిలిస్తోంది. దీంతోపాటు 14 గిరిజన గూడాలను కూడా సందర్శించవచ్చు.
కవ్వాల పులుల అభయారణ్యం
గలగల పారుతున్న గోదావరి, కడెం నదులు...ఎతైన సహ్యాద్రి పర్వతాలు...కొండులు, గుట్టలు, వాగులు...దట్టమైన అడవుల మధ్య ఉన్న కవ్వాల పులుల అభయారణ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చెంగుచెంగున పరుగులు తీస్తున్న జింకలు, గాండ్రించే పులులు, వివిధ రకాల వన్యప్రాణులతో 1015.35 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన కవ్వాల అభయారణ్యం పర్యాటకులు ప్రకృతి సోయగాలను చూసి పరవశిస్తున్నారు.
అమ్రాబాద్ అడవి అందాలు
కృష్ణానదీ పరవళ్లు...ఎతైన కొండలు, గుట్టలు, దట్టమైన నల్లమల అడవుల్లో పులులకు నిలయమైన అమ్రాబాద్ పులుల అభయారణ్యం అందాలు పర్యాటకులకు కొత్త అనుభూతిని మిగిలిస్తున్నాయి. పులులను ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా పర్హాబాద్ థ్రిల్లింగ్ సఫారీ రైడ్,అడవుల మధ్య సేదతీరేందుకు మన్ననూర్ జంగిల్ రిసార్ట్, ఫారెస్ట్ ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్ టూర్స్, ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వీలుగా మడ్ హౌస్, ట్రీ హౌస్, ఏరోకాన్ కాటేజీలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
చెంగుచెంగున దూకే జింకలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో చెంగుచెంగున దూకుతూ పరుగులు తీస్తున్న జింకలు సందడి చేస్తున్నాయి.గోదావరి నది వద్దకు జింకల గుంపు వచ్చి దాహం తీర్చుకుని అక్కడే ఉన్న పచ్చికను మేస్తున్నాయి. పర్యాటకుల మనసుకు జింకల సమూహం చూస్తే చాలు పట్టరాని ఆనందం కలుగుతోంది. గోదావరి జలాల్లో మునిగిన నందిపేట మండలం ఉమ్మెడ శివాలయం శిఖరం భక్తులను ఆకట్టుకుంటోంది.శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా ఉండడంతో ఆలయం శిఖరం వరకు మునగడంతో వివిధ గ్రామాల ప్రజలు గంగాస్థానానికి వెళ్లి స్నానమాచరించారు. నీటిలో తేలిన ఆలయ శిఖరాలను దర్శించుకుంటున్నారు.
రామప్ప దేవాలయం
1213 మధ్య యుగంలో కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయం వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి నిలయంగా మారింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు తాలూకా పాలంపేట్ గ్రామంలో ఉన్న పురాతన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. విశాలమైన , ఆలయ స్తంభాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నంది మండపం కనిపిస్తుంది. గంభీరమైన నంది విగ్రహం దానిపై ఉంది.
దక్కన్ డైమండ్స్ పేరిట పర్యాటక శాఖ వీడియో విడుదల
తెలంగాణ పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ కొత్త సంవత్సరం వేళ దక్కన్ డైమండ్స్ పేరిట ఓ వీడియోను ఎక్స్ పోస్టులో పెట్టారు. ఈ వీడియోలొ కొత్త సంవత్సరం ప్రకృతి అందాలను మీకు చూపించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ సంసిద్ధంగా ఉందంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. కొత్త సంవత్సరం తెలంగాణ పర్యాటక కేంద్రాలను సందర్శించడం ద్వారా మీకు కొత్త అనుభూతులను మిగులుస్తుందని వీడియోలో పేర్కొన్నారు. పర్యాటక శాఖ విడుదల చేసిన ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలు,ఆధ్యాత్మిక కేంద్రాలు, జాలువారుతున్న జలసిరులు పర్యాటకుల కోసం ఎదురు చూస్తున్నాయని, మీరు తప్పకుండా పర్యాటక కేంద్రాలను సందర్శించండి అంటూ వీడియోలో పర్యాటక శాఖ కోరింది.
తెలంగాణ మీ కోసం వేచి చూస్తోంది...
పచ్చని చెట్లతో కూడిన జోడేఘాట్ లోయ...గలగల నీరు పారుతున్న కొమురం భీం ప్రాజెక్టు...ఎత్తైన చెట్లు, వన్యప్రాణులతో కూడిన కవ్వాల, నల్లమల అమ్రాబాద్ పులుల అభయారణ్యం, కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం... శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నందిపేట బ్యాక్ వాటర్...యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప పురాతన ఆలయం...ఉత్తమ పర్యాటక గ్రామాలు భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట ఆలయం, పాండవుల గుట్ట, ఘనపురం కోటగుళ్లు, నాగార్జున సాగర్, ఘనపురం చెరువులతో కూడి అందాల వీడియోను పర్యాటక శాఖ విడుదల చేసింది. 58 సెకన్ల ఈ వీడియోలో తెలంగాణ ప్రకృతి అందాలు, పురాతన వారసత్వ కట్టడాలను ప్రదర్శించారు.తెలంగాణలో ఆహ్లాదాన్ని అందించే అందాల పర్యాటక కేంద్రాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి అంటూ వీడియోలో కోరారు.
Next Story