కేసీయార్లో కొత్త కోణం..గమనించారా ?
x

కేసీయార్లో కొత్త కోణం..గమనించారా ?

గడచిన మూడురోజులుగా కేసీయార్ పార్టీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఎందుకంటే...


పాత కేసీయార్ గురించి తెలిసినవాళ్ళంతా ఇప్పటి కేసీయార్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. పాత కేసీయార్..కొత్త కేసీయార్ ఏమిటని అనుకుంటున్నారా ? అవును ఇప్పటి కేసీయార్ వ్యవహారశైలిని చూసిన వాళ్ళంతా ఒకపుడు కేసీయార్ ఎలాగుండేవారు అనే విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఎందుకంటే గడచిన మూడురోజులుగా కేసీయార్ పార్టీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఎందుకంటే...

ఫామ్ హౌస్ కు వచ్చిన వాళ్ళందరితో చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరిని పేరు పేరునా పిలిచి ముచ్చట్లు చెబుతున్నారు. నేనున్నాను అని ధైర్యం చెబుతున్నారు. భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు. ఏ కష్టమొచ్చినా వెంటనే తనకు ఫోన్ చేయమని, వచ్చి కలవమని చెబుతున్నారు. ఎవరూ భయపడద్దని గట్టిగా ఒకటికి పదిసార్లు చెబుతున్నారు. నిజానికి భయపడుతున్నది ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కాదు కేసీయారే. ఎందుకంటే తమను తాము కాపాడుకోవటానికి ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్, బీజేపీల రూపంలో ఆప్షన్ ఉంది. కాని కేసీయార్కే ఆప్షన్ లేదు. పార్టీలోకి లాక్కోవటానికి కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేస్తుందని, బెదిరిస్తుందని, ప్రలోభాలకు గురిచేస్తుందని అయినా దేనికీ లొంగవద్దని కేసీయార్ పదేపదే చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు లొంగని వాళ్ళు ఎంతమందుంటారో కేసీయార్ కు తెలీదా ?

ఒకపుడు రాజకీయ నేతలంటే అచ్చంగా రాజకీయాల్లో మాత్రమే ఉండేవారు. కాని ఇప్పటి నేతల్లో అత్యదికులు పారిశ్రామికవేత్తలు, వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారే. వ్యాపారాలన్నాక ఏవో లొసుగులు తప్పవు. ఆ లొసుగులను పట్టుకుని ఆర్ధికమూలాలను దెబ్బతీస్తారని అనుకున్నపుడు ఎంతటి గట్టి నేతైనా తన రక్షణకోసం లొంగిపోవాల్సిందే తప్ప వేరేదారిలేదు. ఈ పద్దతిలోనే అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీలకు చెందిన నలుగురు ఎంపీలు, 25 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలను కేసీయార్ లొంగదీసుకుని పార్టీలోకి లాక్కున్నది. ప్రజాప్రతినిధులను దారికి తెచ్చుకోవటం ఎలాగో కేసీయార్కు మించి తెలిసిన వారు ఇంకెవరుంటారు ? తానెంత బుజ్జగించినా, ధైర్యంచెప్పినా, భరోసా ఇచ్చినా అవసరమైతే చాలామంది పార్టీ ఫిరాయించేయటం తథ్యమని కేసీయార్కు అంతమాత్రం తెలీకుండానే ఉంటుందా ?

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తాను అధికారంలో ఉన్నపుడు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, సీనియర్ నేతలను కలవటానికి ఇష్టపడేవారు కాదు. అత్యవసరమైన పనులున్నాయని చెప్పినా సరే కేసీయార్ దర్శనం దొరికేదికాదనే ప్రచారం అందరికీ తెలిసిందే. కేసీయార్ను కలవటానికి ఫామ్ హౌస్ కు వెళ్ళి సాధ్యంకాక మంత్రులు, ప్రజాప్రతినిదుల్లో చాలామంది వెనక్కు వచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నట్లు పార్టీలోనే ప్రచారం జరిగింది. తాను ఎవరితో అయినా మాట్లాడాలని అనుకున్నపుడు మాత్రమే సదరు నేతకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ దొరికేది. మిగిలిన వాళ్ళు ఎంత ప్రయత్నించినా నో ఎంట్రీయే. ఫోన్లో మాట్లాడాలన్నా కుదరదు, నేరుగా కలిసేందుకు అవకాశం లేదు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలీక చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, సీనియర్ నేతలు అవస్తలు పడేవారు. పోనీ ప్రగతిభవన్లోకి అన్నా రానిస్తారా అంటే అదీలేదు. ఫామ్ హౌస్ లోకి నో ఎంట్రీ, ప్రగతిభవన్లోకి అనుమతి లేదు. వారాల తరబడి అసలు సెక్రటేరియట్ మొహంకూడా చూసేవారు కాదు. పార్టీ ఆఫీసుకు రావటం కూడా చాలా అరుదే. ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో వారాల తరబడి సెక్రటేరియట్ కు రాని వ్యక్తి కేసీయార్ మాత్రమే. మంత్రులు, ఎంఎల్ఏలు, ఉన్నతాధికారులు కేసీయార్ను కలవటమే సాధ్యం కానపుడు ఇక మామూలు జనాల ఘోషను పట్టించుకున్నదెప్పుడు ?

రాష్ట్రంలో ఎంతపెద్ద సమస్య వచ్చినా సరే ప్రభుత్వం తరపున కేసీయార్ వివరణ ఇచ్చేవారు కాదు. ఉదాహరణకు ఒక ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో లక్షలమంది ఫెయిలయ్యారు. చాలామంది మాథ్స్ సబ్జెక్టులో తప్పారు. మొదటి సంవత్సరంలో నూటికి నూరుశాతం మార్కులు తెచ్చుకున్నవాళ్ళు కూడా సెకండ్ ఇటర్మీడియట్ పరీక్షల్లో తప్పారు. ఫెయిలయ్యామన్న మనస్తాపంతో దాదాపు 25 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పట్లో ఆ ఘటన సంలచనమైంది. అయినా కేసీయార్ ఉలకలేదు, పలకలేదు.

అలాగే టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల పేపర్లు లీకవ్వటంతో పెద్ద గందరగోళం జరిగింది. కొందరు అభ్యర్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా కేసీయార్ దానిపై వివరణ ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఇలాంటి ఘటనలు అనేకమున్నాయి. తానేంచేసినా సరే, ఎలాగ వ్యవహరించినా సరే అందరు భరించాల్సిందే అన్నట్లుగా కేసీయార్ వ్యవహరించారు. దాదాపు పదేళ్ళు ఇదే పద్దతిలో వ్యవహరించిన కేసీయార్ అంటే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, నేతలతో పాటు జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా కారణమే.

అలాంటి కేసీయార్ను ఇపుడు ఈ పద్దతిలో చూస్తున్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. పూర్తిగా మారినమనిషి అన్న తరహాలో కనబడుతుంటే నమ్మలేకపోతున్నారు. ఎంతటి బలవంతులని అనుకున్న వాళ్ళు కూడా కాలంముందు తలొంచాల్సిందే. మారకపోతే కాలమే మార్చేస్తుంది. కేసీయార్ విషయంలో జరిగిందిదే. తనకన్నా తెలంగాణాలో బలమైన నేత లేరని అనుకున్నారు. అలా అనుకునే ప్రతి విషయంలోను ఏకపక్ష వైఖరితో నిర్ణయాలు, ఒంటెత్తుపోకడలకు పోయారు. ఉపఎన్నికల్లో ఓటమిరూపంలో తన పద్దతిని మార్చుకునేందుకు అవకాశం వచ్చినా మారలేదు. దాంతో 2023 ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరపరాభవం, ఎంఎల్ఏలు, నేతలు పార్టీని వదిలేయటం. దాంతో చేసేదిలేక పార్టీలోని ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను పార్టీ మారద్దని ఇపుడు బతిమలాడుకుంటున్నారు. అంటే కాలం కేసీయార్ను పూర్తిగా మార్చేసిందని అర్ధమవుతోంది. అయితే ఈ మార్పు ఎంతకాలమన్నది వెయిట్ చేసి చూడాల్సిందే.

Read More
Next Story