కేటీఆర్ పాదయాత్రపై బండి సంజయ్ చురకలు
x

కేటీఆర్ పాదయాత్రపై బండి సంజయ్ చురకలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. పాదయాత్ర అంశంపై కేటీఆర్‌ను విమర్శించడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా మండిపడ్డారు కేంద్రమంత్రి. పాదయాత్ర చేస్తా అంటూ కేటీఆర్ చిలకపలుకులు పలుకుతున్నారని, పాదయాత్ర చేస్తానడానికి సిగ్గు ఉండాలంటూ చురకలంటించారు బండి సంజయ్. ఏం ఉద్దరించారని పాదయాత్ర చేస్తారని ప్రశ్నించారు. పదేళ్లు పదవిలో ఉండి మీరు తెచ్చిన కష్టాలకు ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన కష్టాలను జోడించి అవి ఎంత బాగున్నాయి అని ప్రజలకు అడగడానికి పాదయాత్ర చేస్తావా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్‌ను ఉద్దేశించి కూడా బండి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కేవలం కేటీఆర్‌పైనే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా బండి సంజయ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులకు తలా తోక ఉండటం లేదని, పది నెలల్లోనేర తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత కాంగ్రెస్ సర్కార్‌కు దక్కుతుందని చురకలు కూడా అంటించారు.

సిగ్గుండాలి కేటీఆర్..

‘‘మేం పాదయాత్ర చేస్తే దాడులు చేశారు. ముందు కేసీఆర్‌‌ను ఫామ్‌హౌస్ వీడి బయటకు రమ్మను కేటీఆర్. అధికారం పోయినప్పటి నుంచి ఆ ఫామ్‌హౌస్‌లోనే ఉంటూ.. తాగి, తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుడు లేని పడవలా మారింది. కేటీఆర్‌ను ప్రజలను ఛీ కొడుతున్నారు’’ అని బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓ ఛాలెంజ్ కూడా చేశారు. ‘‘కేటీఆర్ ప్రజలకు న్యాయం చేయడం కోసం పాదయాత్ర చేస్తా అంటున్నారు. అదే విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేశామని పాదయాత్ర చేసే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా. రైతు భరోసా ఉందో లేదో తెలియదు’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

చెప్పింది చేయకపోతే ఊరుకునేది లేదు..

‘‘జీవో 29ని రద్దు చేయకపోతే ఊరుకునేది లేదు. అధికారంలోకి వచ్చే ఏడాది కావొస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదు. కర్ణాటకలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తున్నారు. దీపావళికి ఏవో బాంబులు పేలతాయని పొంగులేటి కబుర్లు చెప్పారు. ఇప్పుడు అవన్నీ తుస్సుమన్నాయా..! కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. మీరు చేసిన స్కాములన్నీ ఏమయ్యాయో చెప్పండి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. జిల్లాల పునఃవ్యవస్థీకరణపై కూడా బండి సంజయ్ ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తోందని విమర్శించారు.

చెప్పిందేంటి చేస్తుందేంటి..

జిల్లాల పునఃవ్యవస్థీకరణపై సమీక్షిస్తామని హీమీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోందని ప్రశ్నించారు. ‘‘ఇదే విషయాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఉంచారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోవడం కాంగ్రెస్‌కు అలవాటైపోయింది. జిల్లాలు, మండలాల పునఃవ్యవస్థీకరణపై సమీక్షిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు వాటి సంఖ్యను తగ్గించడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది. మ్యానిఫెస్టోలో చెప్పినదాన్ని ఎందుకు అమలు చేయట్లేదు. అలా చేయడానికి కాంగ్రెస్ భయపడుతోందా. ఒక్కసారిగా జిల్లాల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఏమొచ్చింది’’ అని బండి సంజయ్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న 10 జిల్లాలను బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించింది. వీటిలో కొన్ని జిల్లాలను కేవలం రాజకీయ లబ్ది కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేసిందని గతంలోనే రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో జిల్లాల పునఃవ్యవస్థీకరణ, అవసరమైతే జిల్లాల సంఖ్య తగ్గించాలా వద్దా అనేవి సూచించడం కోసం ప్రత్యేక న్యాయ కమిషన్‌ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోందని గతంలో రేవంత్ రెడ్డి వెల్లడించారు.

పాదయాత్రపై కేటీఆర్ ఏమన్నారంటే..

దీపావళిరోజు నెటిజన్లతో జరిగిన సామాజిక మాద్యమం ఎక్స్ సంభాషణ ఆస్క్ కెటిఅర్ లో ఈ మేరకు కెటిఅర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే పార్టీలను బలోపేతం చేయడం కోసం ఆయా పార్టీల అధ్యక్షులు, ఆ పార్టీలోని కీలక నేతలు పాదయాత్రలు చేస్తున్నారు.. మరి పాదయాత్రలపై మీ ఆలోచన ఏంటి? మీరు పాద యాత్ర ఎప్పుడు చేస్తారు? అన్న ప్రశ్నలకు సమాధానంగా అతి త్వరలోనే తన పాదయాత్ర కచ్ఛితంగా ఉంటుందని కేటీఆర్ తేల్చి చెప్పారు. ‘‘పార్టీ కార్యకర్తలు, నేతలు అందరూ కోరుతున్నట్లుగానే అతి త్వరలో పాద యాత్ర చేస్తాను. రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకుంటా. వారి సమస్య పరిష్కారం కోసం గళమెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుంది. అధికారం ఉన్నా లేకున్నా మా స్టాన్స్ అనేది మారదని స్పష్టం చేస్తా’’ అని వెల్లడించారు కేటీఆర్.

Read More
Next Story