'పస లేని, దిశ లేని'.. కేటీఆర్ యాస.. ప్రాస..!!
తెలంగాణ అసెంబ్లీ లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ పై బీఆర్ఎస్ విమర్శల వర్షం కురిపిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ పై బీఆర్ఎస్ విమర్శల వర్షం కురిపిస్తోంది. పేదలకు అన్యాయం చేశారని ఆరోపిస్తోంది. ఇది ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్. వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్. డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన...దోకేబాజ్ బడ్జెట్..విధానం లేదు...విషయం లేదు...విజన్ లేదు..పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ అంటూ విరుచుకుపడ్డారు. ఈ మేరకు యాస, ప్రాసలు జోడించి ట్విట్టర్ లో బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని ఘాటుగా వ్యక్తీకరించారు.
"రైతులకు కత్తిరింపులు. అన్నదాతలకు సున్నం. ఆడబిడ్డలకు అన్యాయం..మహాలక్ష్ములకు మహామోసం. అవ్వాతాతలకు.. దివ్యాంగులకు.. నిరుపేదలకు... నిస్సహాయులకు మొండిచేయి. పెన్షన్ల పెంపు మాటెత్తలేదు. దళితులకు దగా..గిరిజనులకు మోసం అంబేద్కర్ అభయహస్తం ఊసులేదు..శూన్యహస్తమే మిగిలింది. బడుగు..బలహీన వర్గాలకు భరోసాలేదు.. వృత్తి కులాలపై కత్తికట్టారు.. మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ..నీటి మూటలైనయ్" అని కేటీఆర్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
అంతటితో ఆగలేదు ఆయన... "నిరుద్యోగుల ఆశలపై నీళ్లు.. 4 వేల భృతి జాడా పత్తా లేదు. విద్యార్థులపై కూడా వివక్షే.. 5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదు. హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదు.. మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవ్. నేతన్నకు చేయూత లేదు..ఆటో అన్నలను అండదండ లేదు.. ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమేలేదు. మొత్తంగా.. పసలేని.. దిశలేని.. దండగమారి బడ్జెట్" అంటూ కేటీఆర్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
బీఆర్ఎస్ కాళేశ్వరం టూర్...
కేటీఆర్ కొద్దిసేపటి క్రితం పార్టీ ఇతర నేతలతో కలిసి కాళేశ్వరం బయలుదేరారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు కరీంనగర్ లోని లోయరు మానేరు డ్యామ్‌ను సందర్శించనున్నారు. రాత్రికి రామగుండంలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌజ్, 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వీరి పర్యటన రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రాజెక్టు పగుళ్లు, ఇసుకలో కూరుకుపోతుందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తప్పు అని రుజువు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం టూర్ ప్రారంభించారు.