జన్వాడ ఫాంహౌస్ నేనే కూలగొట్టిస్తా -కేటీఆర్
x

జన్వాడ ఫాంహౌస్ నేనే కూలగొట్టిస్తా -కేటీఆర్

కేటీఆర్ జన్వాడలో అక్రమంగా ఫాంహౌస్ నిర్మించుకున్నారని, హైడ్రా కూల్చివేయబోతోందని సోషల్ మీడియా హోరెత్తిస్తోంది. అయితే దీనిపై మొదటిసారి కేటీఆర్ స్పందించారు.


భాగ్యనగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో జన్వాడ ఫార్మ్ హౌస్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కేటీఆర్ జన్వాడలో ఎఫ్టీఎల్, ఉస్మాన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా ఫార్మ్ హౌస్ నిర్మించుకున్నారని, త్వరలో హైడ్రా కూల్చివేయబోతోందని కాంగ్రెస్ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది. అయితే దీనిపై మొదటి సారి కేటీఆర్ స్పందించారు. బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... తనకి ఎలాంటి ఫార్మ్ హౌస్ లేదని తెలిపారు.

"నేను రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నా. నాకేదో ఫార్మ్ హౌస్ ఉందని, అక్రమంగా కట్టానని, హైడ్రా కూల్చేస్తోందని ప్రచారం చేస్తున్నారు. కానీ నాకెలాంటి ఫార్మ్ హౌస్ లు లేవు. ఆ ఫార్మ్ హౌస్ నా స్నేహితుడిది. కొన్నేళ్లు అందులో నేను లీజుకి ఉన్నమాట వాస్తవం. అయితే, అది కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఎఫ్టీఎల్, ఉస్మాన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో లేదు. హైడ్రా సర్వే చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేసుకోవచ్చు. తప్పుంటే దగ్గరుండి నేనే కూలగొట్టిస్తా. ఆ తర్వాత నేరుగా అక్కడి నుంచి వెళ్లి సీఎం, ఆయన సహచర మంత్రులు, కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలని కూడా కూల్చేయాలి" అంటూ సవాల్ చేశారు.

హై కోర్టులో పిటిషన్...

జన్వాడ ఫార్మ్ హౌస్ కూల్చొద్దంటూ హైదరాబాద్ జూబిలీహిల్స్ కి చెందిన బిల్డర్ ప్రదీప్ రెడ్డి బుధవారం హై కోర్టులో పిటిషన్ వేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలోని పాత సర్వే నంబరు 311 పార్ట్ లోని 1210 చదరపు అడుగుల భూమిని తాను డీ అండ్ యూ రియాల్టీ వెంచర్ నుంచి 2019 సెప్టెంబరు 11వతేదీన కొనుగోలు చేశానని తెలిపారు. డాక్యుమెంట్ నంబరు 10389 తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని బిల్డర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

జన్వాడ గ్రామ పంచాయతీ నుంచి 2014 సెప్టెంబరు 12వతేదీన బిల్డర్ అనుమతి తీసుకొని ఫార్మ్ హౌస్ నిర్మించానని ప్రదీప్ రెడ్డి వివరించారు. అక్కడే తాను నివాసముంటున్నానని, కరెంటు బిల్లులు కూడా చెల్లిస్తున్నానని చెప్పారు. ప్రతి ఏటా ఆస్తి పన్నును కూడా మీర్జాగూడ పంచాయతీకి అసెస్ మెంట్ నంబరు 297 నంబరుతో చెల్లిస్తున్నానని తెలిపారు. తమ ఫార్మ్ హౌస్ ను హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో రేపటివరకు జన్వాడ ఫార్మ్ హౌస్ ను కూల్చివేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.

Read More
Next Story