KTR | ‘ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతరా?’
x

KTR | ‘ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతరా?’

తెలంగాణ తల్లి మార్పుపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తలరాత మారుస్తానని చెప్పి.. తల్లిని మార్చిందీ ప్రభుత్వమని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.


సచివాలయంలో సోమవారం అంగరంగవైభవంగా జరిగిన తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహావిష్కరణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఘాటుగా స్పందించారు. ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతారా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవసం కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేయడం కోసమే కాంగ్రెస్.. తెలంగాణ తల్లిని మర్చిందని ఆరోపించారు. ఆలిని మార్చే వారిని చూశాం కానీ తల్లి మార్చే వ్యక్తిని మాత్రం రేవంత్‌నే చూశానంటూ చురకలంటించారు. ఎవరైనా తన తల్లిని ధనికురాలిగా చూడాలనుకుంటారని, కానీ కాంగ్రెస్ మాత్రం తెలంగాణ తల్లిని బీదరాలిగా చూడాలని కాంగ్రెస్ కలలు కన్నదని ఎద్దేవా చేశారు. అనుకున్నట్లుగానే తెలంగాణ తల్లిని బీదరాలిని చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా కీలక పోస్ట్ ఒకటి పెట్టారు. అందులో కాంగ్రెస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

‘‘చరిత్రను మార్చాలనుకునేది మూర్ఖులే.

తలరాత మారుస్తానని.. తల్లిని మారుస్తవా?

ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతరా?

ఇది ఈ నేల ఆస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి.

రాజసం ఉట్టిపడే తల్లి రూపాన్ని మార్చేశారు.

దివాలాకు ప్రతిరూపంగా ‘కాంగ్రెస్‌ తల్లి’.

ఆ తల్లిని సగౌరవంగా గాంధీభవన్‌కు పంపుతం.

రాజసం ఉట్టిపడే తెలంగాణతల్లి రూపాన్ని మార్చిన కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాలరాసేలా అతిపెద్ద అపచారం చేసిందని, పరిహారంగా యావత్‌ తెలంగాణతల్లికి మంగళవారం నుంచి పాలతో అభిషేకాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బతుకమ్మను మాయం చేయడం తెలంగాణ ఆస్తిత్వంపై జరుగుతున్న దాడికి పరాకాష్ట. యావత్‌ జాతిని జాగృత పరిచిన తెలంగాణ తల్లి ఒక పార్టీకో, వ్యక్తికో సంబంధించినది కాదు. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఆస్తిత్వానికి చిహ్నాలైన బతుకమ్మను, బతుకమ్మ చీరలను, బతుకమ్మ ఆటపాటలను చెరిపి, రానున్న రోజుల్లో తెలంగాణను మాయం చేసే కుట్రలకు తెగబడుతున్నది.

ఆలిని మార్చిన దుర్మార్గులు ఉంటారు కానీ, తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఉద్యమ సమయంలో వేల కొద్ది తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరురా ఏర్పాటు చేశారు. ఎవరు అభ్యంతరం చెప్పారని తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారు? ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. తలరాతలు మారాలే తప్ప.. తల్లులను మార్చడం అతి పెద్ద తప్పు. ప్రభుత్వం మారితే తెలుగు తల్లి మారిందా? కాంగ్రెస్‌ నుంచి బీజేపీ వస్తే భరతమాత మారిందా?’’ అని ప్రశ్నించారు.

ఎక్కడైనా పాత పాలకులపై కోపం, ద్వేషం ఉంటే వాటిని మెరుగైన, ఉత్తమ పాలన అందించి చూపాలని, అలా కాకుండా తల్లిని మార్చడం సబబు కాదని హితవు పలికారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ద్వారా ఒరిగిందేముందని అన్నారు. అదే విధంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపంగా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లిని తొలగించి.. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించామని కాంగ్రెస్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటూ దుయ్యబట్టారు.

Read More
Next Story