KTR | ‘రేవంత్ నీది నోరా.. మూసీ నదా’.. కేటీఆర్ ఘాటు విమర్శలు
x

KTR | ‘రేవంత్ నీది నోరా.. మూసీ నదా’.. కేటీఆర్ ఘాటు విమర్శలు

కొడంగల్‌లో నిర్మించేది ఫార్మా సిటీ కాదన్న రేవంత్ ప్రకటనపై కేటీఆర్(KTR) మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ అంతా చెప్తోందన్నారు.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అది నోరైతే మాటలు వస్తాయని, అదే మూసీ నది అయితే మాయమాటలే వస్తాయంటూ రేవంత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. రేవంత్ తన పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో యావత్ తెలంగాణను ఆగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌ది నరం లేని నాలుక అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేసే ప్రజావ్యతిరేక చర్యలను తాము ఖండిస్తూనే ఉంటామని, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన తన ఎక్స్(ట్విట్టర్) పోస్ట్‌లో పేర్కొన్నారు. కొడంగల్‌లో నిర్మించేది ఫార్మా సిటీ(Pharma City) కాదని ఇండస్ట్రియల్ కారిడార్(Industrial Corridor) అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌ను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు.

గెజిట్‌లో స్పష్టంగా ఉంది రేవంత్: కేటీఆర్

‘‘కొడంగల్‌లో భూసేకరణ ఫార్మా విలేజ్‌ల కోసమే అని నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ స్పష్టంగా వెల్లడిస్తుంది. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేస్తివి. తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొడితివి. మీ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా? ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా? ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నావ్. చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నావు’’ అంటూ కేటీఆర్ పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే కొడంగల్‌లో ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ తెలంగాణ సీఎంఓ తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్‌లో పోస్ట్ పెట్టింది. దీనిపైనే కేటీఆర్ ఫైరయ్యారు.

సీఎం స్వయంగా చెప్పారు: సీఎంఓ

‘‘కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ కారిడార్‌ను ప్రతిపాదించినట్టు చెప్పారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఘటనపై సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యు), ఆర్ఎస్పీ, సీపీఐ (ఎంఎల్ – లిబరేషన్) తదితర పార్టీల నాయకుల ప్రతినిధి బృందం సీఎం గారిని సచివాలయంలో కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది’’ అని వివరించింది.

ఎవరికీ నష్టం చేయట్లేదు: రేవంత్

‘‘కొడంగల్ ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదు. ఇండస్ట్రియల్ కారిడార్. ఉపాధి అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తున్నాం. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత. సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నదే తన సంకల్పం. సొంత నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేయడమే తప్ప ఎవరికీ నష్టం కలిగించడం లేదు. ఉపాధికి అవకాశాలు పెంచే దిశగా ఇండస్ట్రియల్ కారిడార్‌లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. భూ సేకరణ విషయంలో పరిహారం పెంచాలన్న అంశాన్ని పరిశీలిస్తాం’’ అని వివరించారు.

Read More
Next Story