కేసీఆర్‌ని కేటీఆరే ఏమైనా చేశారా? కొండా సురేఖ ఆరోపణల అర్థమేంటో..?
x

కేసీఆర్‌ని కేటీఆరే ఏమైనా చేశారా? కొండా సురేఖ ఆరోపణల అర్థమేంటో..?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సిట్టింగ్ మంత్రి కొండా సురేఖ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కేటీఆరే కారణమని వ్యాఖ్యానించారు.


మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సిట్టింగ్ మంత్రి కొండా సురేఖ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కేటీఆరే కారణమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రజలకు దూరం కావడంలో కూడా కేటీఆర్ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. కేటీఆర్‌పై ఆరోపణలు చేయడంలో భాగంగానే ఇప్పటికే ఆమె సమంత, అక్కినేని ఫ్యామిలీ ఉద్దేశించి మాట్లాడి చిక్కులు కొని తెచ్చుకున్నారు. అయినా వెనకడుగు వేయకుండా ఈరోజు గజ్వేల్‌లో పర్యటించిన సందర్భంగా మరోసారి కేటీఆర్‌నే టార్గెట్ చేశారామే. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తమపై కేటీఆరే ఇష్టారాజ్యంగా రాతలు రాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. గజ్వేల్‌లో కూడా కేసీఆర్ కనిపించడం లేదని, ఈ అంశంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కూడా ఆమె వ్యాఖ్యానించారు. గజ్వేల్ వేదికగా ఆమె చేసిన ఆరోపణలు మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేసీఆర్‌ను కేటీఆరే ఏదో చేశారని, అందుకే కేసీఆర్ బయటకు రాలేకున్నారని కూడా ఆమె అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్ఎస్ ఓటమికి కేటీఆరే కారణం

‘‘2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ ఓడిపోవడానికి కేటీఆరే ప్రధాన కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది హామీలు నెరవేరిస్తే.. పదో హామీని ఎందుకు వదిలేశారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. అన్నీ అమలు చేస్తాం. ప్రాధాన్యత ఆధారంగా ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. కేసీఆర్ ఆరోగ్యం గురించి, ఆయన గురించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. పదవీ ఆకాంక్షతో కేటీఆరే కేసీఆర్‌ను ఏదో చేశారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బడ్జెట్ సమావేశాలప్పుడు కనిపించిన కేటీఆర్.. మళ్ళీ ఇప్పటి వరకు కనిపంచలేదు. కేవలం ఒకే ఒక్కరోజు అసెంబ్లీలోకి వచ్చారాయన అప్పటి నుంచి ఆయన ప్రజల్లో కూడా తిరగడం లేదు. ఆ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు. అక్కడ ఆయన ఏం చేస్తున్నారో తెలియదు. దానిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఆఖరికి గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కేసీఆర్ కనుమరుగయ్యారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

అనుమానాలు బలపడుతున్నాయా..!

ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్‌హౌస్‌లో జారి పడి.. కేసీఆర్ తొంటికి గాయమైంది. అప్పుడు కూడా కేటీఆరే ఏదో చేశారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు అటువంటి మాటలే మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ నోటి నుంచి రావడం.. ఈ ప్రచారాలకు బలం చేకూరుస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారం కోసమే.. మరే ఇతర కారణాల వల్లనో కానీ కేసీఆర్, కేటీఆర్ మధ్య ఓ యుద్ధమే జరుగుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వాటి కారణంగా ఎమ్మెల్సీ కవిత అరెస్టయితే బెయిల్ కోసం ఆరు నెలలు శ్రమించాల్సిన పరిస్థితి వచ్చిందని, కేసీఆర్, కేటీఆర్ తమతమ గొడవల్లో బిజీగా ఉండటంతోనే కవితను నెగ్లెక్ట్ చేశారని ప్రచారం ఊపందుకుంది. మరి ఈరోజు కొండా సురేఖ చేసిన ఆరోపణలకు కేటీఆర్, కేసీఆర్ ఏమైనా కౌంటర్ ఇస్తారేమో చూడాలి.

చల్లారని మాటల యుద్ధం

అయితే కొండా సురేఖ, కేటీఆర్ మధ్య కొన్ని రోజులుగా సాగుతున్న మాటల యుద్ధం ఏమాత్రం చల్లారడం లేదు. రోజురోజుకు అధికం అవుతూనే ఉంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై అవమానకరంగా అనేక పోస్ట్‌లు వెలిశాయని, ఇవన్నీ కూడా కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని కూడా కొండా సురేఖ అనుమానం వ్యక్తం చేశారు. ఈ తప్పిదాలకు రానున్న రోజుల్లో కేటీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొండా సురేఖ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలన్నీ, మీడియా ముందుకు వచ్చి సింపతీ కోసమే ఆమె దొంగ ఏడుపులు ఏడుస్తున్నారంటూ కేటీఆర్.. ఆమె ఆరోపణలను తోసిపుచ్చారు. తనపై ఆరోపణలు, విమర్శలు చేసే ముందు గతంలో ఆమె మాట్లాడిన బూతులను ఆమె ఒకసారి స్మృతికి తెచ్చుకోవాలని సూచించారు. ఈ విధంగా కొన్ని రోజులుగా వీరి మధ్య తీవ్రమైన ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి.

Read More
Next Story