"తెలంగాణకి అవమానం", కవిత కోసం అన్న భావోద్వేగం
తెలంగాణ భవన్ లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ మహిళా నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి రాఖీ కట్టి శుభాభినందనలు తెలిపారు.
తెలంగాణ భవన్ లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ మహిళా నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి రాఖీ కట్టి శుభాభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలోని సోదర, సోదరీమణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు. ఈ రాఖీ పండుగ సందర్భంగా మా సోదరీమణి కవిత గారు మాతో లేకపోవడం బాధాకరం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అయినా ఆమెకి న్యాయం లభిస్తుందని, సుప్రీంకోర్టుపైన నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకంటే ముందు ట్విట్టర్ లో ఒక ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు. "ఈ రోజు నువ్వు రాఖీ కట్టలేకపోవచ్చు, కానీ ఎల్లప్పుడూ నీ కష్టసుఖాల్లో తోడుంటాను" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి కవిత రాఖీ, కడుతున్న ఫోటో, ఈడీ అరెస్ట్ చేసిననాటి ఫోటో జత చేశారు.
సకల మర్యాదలతో విగ్రహం తొలగిస్తాం...
సచివాలయం ముందట తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో ఏర్పాటు చేస్తున్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపనపై కేటీఆర్ మరోసారి రెస్పాండ్ అయ్యారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతికైన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్టించాలన్న ఉద్దేశంతో ఒక ఐలాండ్ క్రియేట్ చేశామన్నారు. దశాబ్ది ఉత్సవాల్లోనే అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కుసంస్కార పార్టీ, అందుకే ఈరోజు తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతుందని విమర్శించారు.
రాజీవ్ గాంధీ అవమానించిన మాజీ సీఎం అంజయ్య పేరుతో ఉన్న పార్కు ఇప్పుడు లుంబిని పార్క్ అయింది... అదే అంజయ్య పార్కు ఎదురుగా ఆయనను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీకి, రాజీవ్ గాంధీ స్టేడియం, రాజీవ్ రహదారి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా ఎన్ని పేర్లు ఉన్నా.. గత పది సంవత్సరాలలో వాటిని మేము ఏనాడు మార్చడానికి ప్రయత్నం చేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు.
"కాంగ్రెస్ పార్టీ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారంలోకి రాగానే అక్కడి నుంచి తరలిస్తాం." తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత బాధతో ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని కేటీఆర్ అన్నారు. "రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలి అంటే గాంధీభవన్ లోనో, రేవంత్ రెడ్డి ఇంట్లోనో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవాలి. వందలాదిమంది తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీ.. మరోసారి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కకు పెట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతుంది. మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. మళ్లీ నాలుగేళ్లలో తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు పెడుతున్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి.. కాంగ్రెస్ పార్టీ కోరుకున్నచోటికి పంపిస్తాం. ఈరోజు తెలంగాణ తల్లికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానం తెలంగాణ మరిచిపోదు అని కేటీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.