కేసీఆర్ ని ప్రశ్నించారు కానీ, టీడీపీ ఇప్పుడు డెసిషన్ మేకర్ -కేటీఆర్
మళ్ళీ నాలుగున్నర ఏండ్ల తర్వాత మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈ నిర్ణయాన్ని అడ్డుకట్ట వేస్తాం.
సింగరేణి మెడపై కేంద్రం కత్తి కట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గురువారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ సింగరేణిని తొమ్మిదిన్నరేళ్ళు కాపాడితే... ఇప్పుడు బీజేపీతో కలిసి రేవంత్ రెడ్డి బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గనుల వేలంపాటను కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరుతున్నామన్నారు.
సింగరేణి మెడపై కేంద్ర కత్తి పెడితే... ఆ కత్తికి కాంగ్రెస్ సానబెడుతోందని కేటీఆర్ అన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గు మంత్రిత్వ శాఖ ద్వారా ఏ టెండర్, వేలం లేకుండా.. ఒడిశాలో రెండు గనులను నైవేలి లిగ్నైట్ లిమిటెడ్‌కు అప్పగించారు. గుజరాత్‌లో గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, గుజరాత్ ఇండస్ట్రీ పవర్ లిమిటెడ్‌కు 2015 సంవత్సరంలో ఐదు కోల్ బ్లాక్ లను కేటాయించారు. గనుల వేలంపై గుజరాత్ కి లేని ఆంక్షలు తెలంగాణకి ఎందుకు అని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు తేవాల్సింది పోయి.. ఉన్నవాటినే అమ్ముతున్నారు. సింగరేణిని ఖతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయి అని కేటీఆర్ ఆరోపించారు.
"సింగరేణిని నిర్వీర్యం చేసి, బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టాలని చూసే ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. మళ్ళీ నాలుగున్నర ఏండ్ల తర్వాత మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈ నిర్ణయాన్ని అడ్డుకట్ట వేస్తాం. రేపు వేలంలో పాల్గొనే కార్పొరేట్ వాళ్లకి ముందే చెప్తున్నాం. రేపు వేలంలో పాల్గొనే ముందు ఆలోచించుకోండి" అంటూ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు.
టీడీపీ డెసిషన్ మేకర్...
16 స్థానాల్లో గెలిచిన టీడీపీ నేడు డెసిషన్ మేకర్ గా ఉందన్నారు కేటీఆర్. 16 ఎంపీలతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డితో సహా చాలా మంది చాలా మాట్లాడారు. కానీ ఇవాళ ఏపీలో 16 ఎంపీ సీట్లు గెలిచిన తెలుగు దేశం పార్టీ కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉందన్నారు. అందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది అన్నారు. కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెరో 8 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఇవాళ హైదరాబాద్‌లో బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. సింగరేణిని ఖతం చేసే కుట్రను బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. దీనిపై భవిష్యత్ కార్యాచరణనను కూడా రెండు, మూడో రోజుల్లో ప్రకటిస్తాం. గతంలో మేము పోరాటాలు చేసి సింగరేణిని కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా సింగరేణిని మళ్లీ కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.