Telangana Thalli | తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ఆరని మాటల మంటలు..
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సచివాలయంలో అట్టహాసంగా జరిగింది. తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సచివాలయంలో అట్టహాసంగా జరిగింది. తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సహా పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఎన్నో ఏళ్లు అవహేళకు గురైందని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరం ‘టీజీ’ అని రాసుకున్నామని, ఆ అక్షరాలకు గత ప్రభుత్వం ఎటువంటి గౌరవం ఇవ్వకుండా టీఎస్ అని వాహనాలు, కార్యాలయాలపై రాసి ప్రజల మనభావాలు దెబ్బతీసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ తమ ప్రభుత్వం అలా కాకుండా ప్రజల మనోభావాలకు పెద్దపీట వేస్తూ.. ‘టీఎస్’ను ‘టీజీ’గా మార్చామని, ఉద్యమ రోజుల్లో ప్రతి చోటు ప్రతిధ్వనించిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా ప్రకటించామని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి వివక్షకు గురైందని, అటువంట తెలంగాణ తల్లికి తమ ప్రభుత్వం అధికారిక గుర్తింపును అందించిందని వివరించారు. ఎందరో కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారని, అందుకే అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎక్కా యాదగిరిని సన్మానిస్తున్నామని చెప్పారు. ఆయనకు 300 గజాల స్థలం, కోటి రూపాయల నగదు బహూకరించనున్నట్లు ప్రకటించారు.
‘‘మీ అందరినీ చూస్తోంటే కృష్ణా, గోదావరి నదులు ఇక్కడ ప్రవహిస్తున్నట్లు ఉంది. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భూలోకంలో ఏ ప్రాంతానికైనా, ఎవరికైనా గుర్తింపు తల్లితోనే. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి చేయడమే కాదు... అవమానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచించి... తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టారు. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని మా సహచర మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని తెలిపారు.
‘‘తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత పాలకులు వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని నిర్ణయించారు. అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీని అధికారికంగా వాహనాలకు ఏర్పాటు చేసేలా అమలులోకి తీసుకొచ్ఛాం. ఉద్యమ సమయంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని పదేళ్లుగా రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు. ప్రజా ప్రభుత్వంలో ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో కవి అందెశ్రీ గారిని సంన్మానించుకోవడం నాకు జీవితకాలం గుర్తుండే సందర్భం. ఉద్యమ కాలంలో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణా తల్లికి వివిధ రూపాలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అందుకే ప్రజా ప్రభుత్వం బహుజనుల తల్లి రూపమే తెలంగాణ తల్లి రూపంగా అధికారికంగా ప్రకటించింది’’ అని వెల్లడించారు.
‘‘తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి ప్రతిరూపంగా స్పురిస్తోంది. డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు.. ఒక పండుగ రోజు.. ఈ రోజు మన ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే ఉండాలని ఒక పండుగలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, తెలంగాణను పునర్నిర్మాణం వైపు తీసుకెళుతున్నాం. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులను గుర్తించాలని, గౌరవించాలని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావులను ప్రభుత్వం గుర్తిస్తోంది. వారికి 300 గజాల ఇంటి స్థలంతో రూ.కోటి నగదు, తామర పత్రం అందించనున్నాం. కొంతమందికి బాధ, ఆవేదన, దుఃఖం ఉండొచ్చు. వాళ్ల రాజకీయ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరమని వాళ్లు అనుకోవచ్చు.. కానీ ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో మనం తెలంగాణ సాధించుకోలేదు.. ఉమ్మడి రాష్ట్రంలో అవమానాలు ఎదుర్కొన్నాం.. తెలంగాణలో పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాం.. ఇక అలాంటి అవమానాలు, నిర్లక్ష్యాలు ఉండకూడదని ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తాం’’ అని తెలిపారు. కాగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై కేటీఆర్ మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికే కాంగ్రెస్ పూనుకుందని విమర్శలు గుప్పించారు.
తల్లి మార్చే సన్నాసి రేవంత్: కేటీఆర్
‘‘దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కేసీఆర్ తన దీక్షతో తెలంగాణ ప్రకటనకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉన్నంత వరకు రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని గుర్తిస్తారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని తెలంగాణపై దాడి చేస్తున్నారు. కేసీఆర్ ను చిన్నగ చేసి చూపెట్టె ప్రయత్నంలో అస్తిత్వం మీద దాడి జరుగుతోంది. ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయం అయింది. తెలంగాణ తల్లిలో బతుకమ్మ మాయం అయింది. సెక్రటేరియట్ లో లంకె బిందెలు లేవని రేవంత్ రెడ్డికి అర్ధం అయింది. తెలంగాణ ఇస్తే మీకు పరిపాలన రాదని అన్నారు. పదేళ్ళలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. తెలంగాణ భాషను, యాసను వెక్కిరించారు. ఇందిరాగాంధీ భారతమాతను హరిద్వార్‌లో ఏర్పాటు చేశారు. సమైక్య పాలకులు పగబడితే 2007 లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం’’ అని తెలిపారు.
‘‘హంతకులే సంతాపం తెలిపినట్లు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్న వాళ్ళు తెలంగాణ తల్లి బీదగా ఉండాలని రూపాన్ని మార్చారు. ప్రపంచంలో ఆలిని మార్చిన వాళ్ళు ఉన్నారు తల్లిని మార్చిన మూర్ఖులు ఎవరూ లేరు. తెలంగాణ తల్లి ఆకృతిని ఎవరు మార్చమన్నారు. ప్రభుత్వం మారితే తెలంగాణ తల్లి విగ్రహం మారాలా. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం చేస్తారా. తెలంగాణను మాయం చేయాలనే కుట్ర కనబడుతోంది. తెలంగాణ అస్తిత్వం దెబ్బతీస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగిన వంద సీట్లతో బీఆర్ఎస్ గెలుపు పక్కా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపుతాం. సెక్రటేరియట్ లో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపడం పక్కా తెలంగాణలో సాంస్కృతిక విప్లవం రావాలి’’ అని పిలుపునిచ్చారు.
‘‘నేడు జరిగిన అపచారానికి ప్రజలు ఏకం కావాలి. ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి ఫోటోను సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకుందాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేద్దాము. రుణమాఫీ అయిందని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారు. ఘట్ కేసర్ రైతు కోఆపరేటివ్ సోసైటిలో 1190 మంది రైతులు ఉంటే ఒక్కరికి రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి అదానీ కోసం అల్లుని కోసం,అన్నదమ్ముళ్ల కోసం,బామ్మర్ధికి అమృత్ కోసం పని చేస్తున్నారు. వచ్చే సంవత్సరం అనుముల బ్రదర్స్ అదానీ ఆస్తులను మించిపోతారు. వచ్చే సంవత్సరం పార్టీని పునర్నిర్మాణం చేసుకుందాము. పార్టీ మెంబర్ షిప్ ప్రారంభం చేసుకుందాము’’ అని అన్నారు కేటీఆర్.