
కర్ణాటక అసెంబ్లీలో తెలంగాణ చర్చ.. కాంగ్రెస్‌పై ప్రతిపక్షాల ధ్వజం
తెలంగాణలో పరిస్థితులను చూసైనా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని అక్కడి ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలపై కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది. ఆరు గ్యారెంటీలు ఇచ్చి ప్రజలు ఆకర్షించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతో.. కాంగ్రెస్‌పై పెరిగిన నమ్మకమో గానీ.. ఎన్నికల్లో ప్రజలు మాత్రం హస్తం గుర్తుకు పట్టం కట్టారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ గ్యారెంటీలను, హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఇక్కడి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా ఈరోజు కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రస్తావన వచ్చింది. అందుకు ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణం. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6గ్యారెంటీలపై కర్ణాటక అసెంబ్లీలో రసవత్తరమైన చర్చ జరిగింది. తెలంగాణలో పరిస్థితులను చూసైనా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని అక్కడి ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేశారు.
కర్ణాటక ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 గ్యాంరెటీల అమలు కోసం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీలకు కాంగ్రెస్ కార్యకర్తలను అధ్యక్షులుగా నియమించింది. వారికి క్యాబినెట్ స్థాయి హోదా కూడా కల్పించింది. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కర్ణాటకలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణకు స్థానిక ఎమ్మెల్యేలను నియమించకుండా పార్టీ సభ్యులను నియమించి, వారి కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తామనడం ఎంత వరకు సమంజసం అని బీజేపీ ఎంపీ కృష్ణప్ప ఆరోపించారు. ఈ సందర్భంగానే విపక్ష నేత ఆర్ అశోక్ కలుగజేసుకుని.. హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
‘‘గ్యారెంటీల అమలుకు నగదు సమకూర్చడం ఎంతటి సవాల్ అనేది సీఎం అయిన తర్వాతనే తెలిసొచ్చిందని మీ పార్టీ నేత, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించారు. ప్రతి ఏడాది రూ.18వేల కోట్ల పింఛన్లు, వేతనాలకు చెల్లిస్తూ గ్యారెంటీల వ్యవయాన్ని మోయడం భారమని అంగీకరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేవంత్.. ఈ గ్యారెంటీలపై జాతీయ స్థాయిలో చర్చ అవసరమని అన్నారు. గ్యారెంటీల అమలు కష్టమని పక్క రాష్ట్ర సీఎం చెప్తుంటే.. కర్ణాటక కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ గ్యారెంటీల అమలు పేరిట ఐదు సంవత్సరాల్లో రూ.50కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అయ్యారు’’ అని ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
ఇప్పటికయినా కాంగ్రెస్ తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు. ప్రజలకు సంక్షేమాన్ని అందించడం కోసం ఇచ్చిన గ్యారెంటీల అమలు వారి కష్టాలకు కారణం కాకూడదని అన్నారు విపక్ష నేతలు. గ్యారెంటీల అమలు కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం ఎంతవరకు సరైన పద్దతో కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితబోధ చేశారు. ఇప్పటికైనా ఈ నిర్ణయంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రజాధనం వృధా కాకుండా గ్యారెంటీల అమలుకు చర్చలు చేపట్టాలని సూచించారు.