ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం... 4 రోజులు సెలవులు
x

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం... 4 రోజులు సెలవులు

ముఖ్యంగా గణేష్ నవరాత్రుల్లో ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని, నిమజ్జన వేడుకలను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.


భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల హడావిడి మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ వచ్చింది. గణేష్ చతుర్థి అనగానే పల్లెటూళ్ళ నుంచి పట్టణాల వరకు సందడి వాతావరణం నెలకొంటుంది. ఊరూ వాడా గణపయ్య పాటలతో హోరెత్తుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఈ గణేశ్ ఉత్సవాల్లో ఆనందోత్సాహాలతో పాల్గొంటారు. 9 రోజుల పాటు గణేష్ మండపాలలో విశిష్టంగా అలంకరించిన వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

అయితే వినాయక ఉత్సవాల్లో కీలక ఘట్టం ఆఖరి రోజున నిర్వహించే నిమజ్జనం. అందులోనూ హైదరాబాద్ లో నిమజ్జనం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిమజ్జనం రోజు హైదరాబాద్ రోడ్లన్నీ జనసందోహంతో నిండిపోతాయి. ముఖ్యంగా గణేష్ నవరాత్రుల్లో ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని, నిమజ్జన వేడుకలను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దీంతో నగరమంతా సందడి వాతావరణం ఉంటుంది. వినాయక చవితి దగ్గరపడుతున్న తరుణంలో భాగ్యనగరం గణేశ్ ఉత్సవ సమితి ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం గురించి కీలక విషయం వెల్లడించింది.

సెప్టెంబర్ 17వ తేదీన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపింది. ఆ రోజు సెలవు కూడా ఉంటుంది. ప్రతి ఏడాది నిమజ్జనం రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ లో ప్రభుత్వ సెలవు ఉంటుంది. ఈ సారి కూడా అలానే ఉంటుంది. కాగా, ఈ సారి ఖైరతాబాద్ లో 70 అడుగుల సప్తముఖ మహాగణపతిని ప్రతిష్టిస్తున్నారు. గత ఏడాది మధ్యాహ్నం ఒంటి గంటలోపే ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తి చేశారు. ఈసారి కూడా అదే విధంగానే చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

సెప్టెంబర్ 17న నిమజ్జనం ఉండటంతో జంటనగరాల్లో విద్యార్థులకు వరుసగా 4 రోజులు సెలవులు వస్తున్నాయి. సెప్టెంబర్ 14న రెండో శనివారం కావడంతో ఆ రోజు పాఠశాలలకు యధావిధిగా సెలవు ఉంటుంది. మరుసటిరోజు ఆదివారం, సోమవారం అంటే సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పాఠశాలలకు సెలవు. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. 17వ తేదీన నిమజ్జనం కాబట్టి ఆ రోజు కూడా సెలవు ఉండే అవకాశం ఉంది. ఇలా వరుసగా 4 రోజులు సెలవులు వస్తున్నాయి.

Read More
Next Story