తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణలో కీలక పరిణామం
తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గీతంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.
తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి, రచయిత, గాయకుడు అందెశ్రీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ కార్యక్రమానికి సోనియాగాంధీని విశిష్ట అతిధిగా హాజరు పరచాలని భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. అదే రోజు ఆమె చేతులపైనే ఈ పాట విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.
కాగా, తెలంగాణ పాట "జయ జయహే తెలంగాణ"ను ప్రఖ్యాత కవి అందెశ్రీ రాశారు. అయితే, ఈ జనరేషన్ కి తగ్గట్టు పాటలో కొన్ని మార్పులు చేయాలని అందెశ్రీకి సర్కార్ సూచించింది. ఈ మేరకు ఆయన లిరిక్స్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. చేంజెస్ అనంతరం ప్రభుత్వం ఈ పాటకి ఆమోదం తెలిపింది. ఈ పాట రివైజ్డ్ వెర్షన్ సుమారు ఒకటిన్నర నిమిషాల నిడివితో ఉంది. సంగీత దర్శకుడు కీరవాణి తో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గీతాన్ని కంపోజింగ్ చేయించింది.
రాష్ట్రం ఏర్పడిన దశాబ్దానికి రాష్ట్ర గేయం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం కావస్తున్నా ఇప్పటి వరకు అధికారికంగా రాష్ట్ర గీతం లేదు. ప్రత్యేక రాష్ట్ర గీతం ఆవశ్యకతను గుర్తించిన నూతన ప్రభుత్వం ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ గీతం ఖరారుపై కీలక నిర్ణయం తీసుకుంది.
అందెశ్రీ రాసిన ఒరిజినల్ పాటను ముందుగా మంత్రివర్గం ఆమోదించింది, అయితే తెలంగాణ ఉద్యమానంతర విషయాలు ప్రతిబింబించేలా సవరణలు అవసరమని భావించారు. ప్రభుత్వం నుండి వచ్చిన సూచనలను అనుసరించి, అందెశ్రీ పాటలో అవసరమైన మార్పులు చేశారు. వాటిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 2న అత్యంత ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ గీతం విడుదల కార్యక్రమాన్ని సోనియా గాంధీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరపాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.