KCR And KTR
x

KTR | ‘2028లో ముఖ్యమంత్రి కేసీఆరే’

కాంగ్రెస్ పాలన, తీరుతో ప్రజలు ఇప్పటికే విసుగెత్తిపోయారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినా ప్రభుత్వం మారిపోవడం ఖాయమన్నారు కేటీఆర్.


తెలంగాణ సీఎంకే మరోసారి కేసీఆర్ బాధ్యతలు చేపట్టడం ఖాయమని, 2028లో జరిగే ఎన్నికల్లే బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కట్టనున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలన, తీరుతో ప్రజలు ఇప్పటికే విసుగెత్తిపోయారని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినా ప్రభుత్వం మారిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఆత్మీయ సత్కారంలో పాల్గొన్న సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. పదవీకాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు కేటీఆర్.. ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే విపరీతమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోవడం కాంగ్రెస్ స్పెషాలిటీ అంటూ చురకలంటించారు.

‘‘2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం తథ్యం. మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే బాధ్యతలు చేపడతారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్.. అభివృద్ధికి మారుపేరులా తెలంగాణను తీర్చిదిద్దింది. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ మున్సిపాలిటీలే ఎక్కువ అభివృద్ధి చెందాయి. బీఆర్ఎస్ హయాంలో 6లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు అందించాం. రూ.700 కోట్లతో నల్లగొండను అభివృద్ధి చేశాం. రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశానికే స్ఫూర్తిగా నిలిపారు కేసీఆర్. అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన సిఎంగా నిలిచారు’’ అని తెలిపారు.

‘‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అయింది. 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంతనియోజకవర్గంలో మున్సిపల్ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు అందడం లేదు. సూర్యాపేట మున్సిపల్ జనరల్ స్థానంలో దళిత బిడ్డకు అవకాశం కల్పించాం. రోజూ ఢిల్లీలో తెలంగాణ పైసలు కురుస్తున్నాయి తప్పా.. రాష్ట్ర రైతుల ఖాతాల్లో మాత్రం పైసా కూడా పడటం లేదు’’ అని విమర్శలు గుప్పించారు కేటీఆర్.

Read More
Next Story