కేసీయార్ చిన్న లాజిక్ మిస్సయ్యారా ?  ఏమి జరగబోతోంది ?
x

కేసీయార్ చిన్న లాజిక్ మిస్సయ్యారా ? ఏమి జరగబోతోంది ?

పిటీషన్ను కోర్టు కొట్టేస్తుంది అందరు అనుకున్నదే. ఎందుకంటే పిటీషన్ వేయటంలో కేసీయార్ చిన్న లాజిక్ మిస్సయ్యారు


జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ, ఏర్పాటుపైన కేసీయార్ దాఖలుచేసిన పిటీషన్ను హైకోర్టు కొట్టేసింది. పిటీషన్ను కోర్టు కొట్టేస్తుంది అందరు అనుకున్నదే. ఎందుకంటే పిటీషన్ వేయటంలో కేసీయార్ చిన్న లాజిక్ మిస్సయ్యారు. విచారణకు హాజరవ్వాలని కమిషన్ తనకు నోటీసులు జారీచేయటం ఏమిటనే అహంకారమే కేసీయార్లో కనబదుతోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో కేసీయార్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందనే ఆరోపణలపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే అసలు కేసీయార్ వేసిన పిటీషన్లో లాజిక్ ఎంతుందో ఆలోచిద్దాము. కమిషన్ వేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉంది. కమిషన్ కు ఛైర్మన్ గా ఎవరిని నియమించాలనే విషయం కూడా పూర్తిగా ప్రభుత్వ ఇష్టమే అనటంలో ఎలాంటి సందేహాలు అవసరంలేదు. కమిషన్ విచారణ పరిధి, కాలపరమితి, విచారించాల్సిన అంశాలను డిసైడ్ చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఏ కోణంలో చూసినా కమిషన్ ఏర్పాటులో ప్రభుత్వం తన అధికార పరిధిని దాటలేదు. పైగా కమిషన్ ఏర్పాటుచేసింది జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో. రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఇంకెవరైనా ఉన్నతాదికారిని ఛైర్మన్ గా నియమించి కమిషన్ ఏర్పాటుచేసుంటే కోర్టు స్పందన ఎలాగుండేదో. బీహార్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటుచేసింది.

రిటైర్డ్ జస్టిస్ నాయకత్వంలో కమిషన్ ఏర్పాటుచేసేటప్పుడే ప్రభుత్వం అన్నీ కోణాల్లోను జాగ్రత్తలు తీసుకున్నది. జస్టిస్ నరసింహారెడ్డి ట్రాక్ రికార్డును పరిశీలించినా చాలామంది లాయర్లు పాజిటివ్ గానే చెబుతారు. కాబట్టి కమిషన్ ఛైర్మన్ గా నరసింహారెడ్డిని నియమించటంలో ప్రభుత్వం అన్నీ జాగ్రత్తలు తీసుకున్నదన్న విషయం అర్ధమవుతోంది. ఇలాంటి జస్టిస్ నరసింహారెడ్డి వ్యక్తిగతంమీద కేసీయార్ తీవ్రమైన ఆరోపణలతో బురద చల్లేశారు. కేసీయార్ చేసిన తప్పులు ఏమిటంటే జస్టిస్ నరసింహారెడ్డి పై నిరాధార ఆరోపణలు చేయటం. అలాగే కమిషన్ ఛైర్మన్ గా నరసింహారెడ్డి పనికిరారని తేల్చేయటం. కమిషన్ ఛైర్మన్ గా ఉండేందుకు నరసింహారెడ్డికి అర్హత లేదని తేల్చేసి వెంటనే పదవినుండి తప్పుకోమని డిమాండ్ చేయటం కూడా తప్పే. ఈ మూడుతప్పులను కేసీయార్ చేయకుండా ఉండుంటే బాగుండేది. అన్నిటికీ మించి నేరుగా జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖను మీడియాకు లీక్ చేయటం ఇంకా పెద్ద తప్పు.

చేయాల్సింది ఏమిటి ?

కేసీయార్ చేయాల్సిన పనులు రెండున్నాయి. అవేమిటంటే విచారణకు హాజరుకావాలని కమిషన్ నోటీసు జారీచేసినపుడు విచారణకు హాజరవ్వటం. ఒకవేళ హాజరుకాలేకపోతే ఆరోపణలకు సంబంధించి పాయింట్ బై పాయింట్ రాతమూలకంగా సమాధానాలను పంపాలి. విచారణకు హాజరుకాకపోవటానికి కారణాలను వివరించాలి. అనారోగ్యం పేరుతో విచారణకు హాజరుకాలేకపోతే అందుకు తగ్గట్లుగా మెడికల్ సర్టిఫికేట్ ను జతచేయాలి. కమిషన్ ఏర్పాటు, ప్రభుత్వ అధికారాలు, కమిషన్ ఛైర్మన్ గురించి అసలు ప్రస్తావించ కూడదు. తనపైన వినిపిస్తున్న ఆరోపణలపై కమిషన్ ఏమి నిర్ణయిస్తుందన్నది వేరే విషయం. ముందైతే కమిషన్ కు తన వాదన వినిపించాలి. తన వాదన వినిపించి, కమిషన్ సిఫారసులు ఏమిటో చూసి, ప్రభుత్వ నిర్ణయం తెలిసిన తర్వాత అప్పుడు కేసీయార్ కోర్టులో కేసు వేసినా సమర్ధించుకునే అవకాశం ఉంటుంది.

ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఫాలో అవ్వకుండానే తనపైన అసలు కమిషన్ విచారణే చేయకూడదని, కమిషన్ కు అధికారాలు లేవని, పైగా నరసింహారెడ్డి కమిషన్ ఛైర్మన్ గా పనికిరారన్న కేసీయార్ వాదనను హైకోర్టు కొట్టేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు సరైనదే అని, కమిషన్ ఎవరికైనా నోటీసులుజారీచేసి పిలిపించి విచారణ చేయవచ్చని, ప్రభుత్వం నిర్ణయంలో ఎలాంటి తప్పులేదని స్పష్టంగా చెప్పేసింది. కాబట్టి కేసీయార్ వాదనలోని డొల్లతనమంతా బయటపడింది.

కేసీయార్ ముందున్న ఆప్షన్ ఏమిటి ?

హైకోర్టు తీర్పు నేపధ్యంలో కేసీయార్ ముందున్న ఆప్షన్లు ఏమిటనే చర్చ పెరిగిపోతోంది. మొదటి ఆప్షన్ : జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణకు హాజరవ్వటం. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం. కమిషన్ ముందు తన వాదనను వినిపించటం. రెండో ఆప్షన్ : హైకోర్టు తీర్పును చాలెంజ్ చేస్తు రివ్యు పిటీషన్ వేయటం లేదా సుప్రింకోర్టులో చాలెంజ్ చేయటం. రివ్యూ పిటీషన్ వేసినా, సుప్రింకోర్టులో చాలెంజ్ చేసినా పెద్దగా ఫలితం ఉంటుందని అనుకునేందుకు లేదు. కాబట్టి కమిషన్ ముందు విచారణకు హాజరవ్వటమే కేసీయార్ కు గౌరవప్రదంగా ఉంటుంది.

కమిషన్ అధికారాలు ఏమిటి ?

హైకోర్టు తీర్పు నేపధ్యంలో కమిషన్ ఏమి చేయబోతోందనే విషయంలో రాజకీయంగా ఉత్కంఠ మొదలైంది. ఇప్పటికే రెండుసార్లు కమిషన్ ఇచ్చిన నోటీసును కేసీయార్ లెక్కచేయలేదు. మొదటిసారి నోటీసు అందిన తర్వాతే కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ఉద్దేశించి కేసీయార్ లేఖ రాసింది. రెండోసారి కమిషన్ నోటీసు జారీచేసినా కేసీయార్ పట్టించుకోలేదు. కాబట్టి కమిషన్ మూడోసారి విచారణకు హాజరుకావాలని కేసీయార్ కు నోటీసు జారీచేయవచ్చు. మరి నోటీసు ఇస్తుందా లేదా అన్నది చూడాలి. కమిషన్ ముందు మరో ఆప్షన్ కూడా ఉంది. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ లాయర్ కృష్ణయ్య చెప్పేదేమిటంటే విచారణకు హాజరుకావటానికి నిరాకరించిన వారిని అరెస్టు చేసే అధికారం కమిషన్ కు ఉందని. బెయిలబుల్ లేదా నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసే అధికారం కమిషన్ కు ఉందని చెప్పారు. కోర్టుకు ఎన్ని అధికారాలు ఉంటాయో కమిషన్ కు కూడా అన్ని అధికారాలు ఉంటాయన్నారు. ఈ నేపధ్యంలోనే కమిషన్ తన అధికారాలను ఉపయోగిస్తుందా లేకపోతే విచారణకు హాజరు కావాలని కేసీయార్ కు మూడోసారి నోటీసులు జారీచేస్తుందా అన్న విషయంలోనే ఉత్కంఠ పెరిగిపోతోంది.

Read More
Next Story