కేసీఆర్ బస్సుయాత్రలో ఆసక్తికర సన్నివేశం
x

కేసీఆర్ బస్సుయాత్రలో ఆసక్తికర సన్నివేశం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర సోమవారం నిజామాబాద్ లో కొనసాగుతోంది. సోమవారం ఉదయం బస్సు యాత్ర ప్రారంభించేముందు జగిత్యాలలో ఓ ఆసక్తికర సన్నివేశం నెలకొంది.


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర సోమవారం నిజామాబాద్ లో కొనసాగుతోంది. ఆదివారం రాత్రి బస్సు యాత్ర ముగిసిన అనంతరం జగిత్యాలలో బస చేశారు. సోమవారం ఉదయం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించేముందు జగిత్యాలలో ఓ ఆసక్తికర సన్నివేశం నెలకొంది. దీనికి సంబంధించిన ఫోటోలను బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అసలు విషయం ఏంటంటే.. కేసీఆర్ స్థానికంగా నివాసం ఉంటున్న తన చిన్న నాటి గురువు ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కేసీఆర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సిద్దిపేట జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా తనకు చరిత్ర పాఠాలు నేర్పిన నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తన శిష్యుణ్ణి చూసిన గురువు రమణయ్య సంబురపడ్డారు. తెలంగాణ ప్రజల పట్ల ఆనాటి నుంచి కేసీఆర్ కి ఉన్న శ్రద్ధను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లా కావాలని 30 ఏండ్ల కిందనే కేసీఆర్ నాటి కేంద్ర మంత్రికి వినతిని అందించిన విషయాన్ని గురువు రమణయ్య గుర్తు చేశారు.

ప్రజలను చైతన్యం చేసి ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత నీదేనని తన శిష్యుడు కేసీఆర్ ను కొనియాడారు. స్థిత ప్రజ్ఞతను కొనసాగిస్తూ భవిష్యత్తులో విజయాలు సాధిస్తూ తెలంగాణ ప్రజల కన్నీళ్లు తూడ్చడంలో ముందుండాలని, తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఇంకా చాలా చేయాల్సి ఉన్నదని తన శిష్యునికి రమణయ్య ఉపదేశించారు. తనను పరామర్శించడానికి వచ్చిన శిష్యుడు కేసీఆర్ తో పావుగంట పాటు ఇష్టాగోష్టి కొనసాగించారు. అనంతరం గురువు వద్ద మరోసారి ఆశీర్వాదం వీడ్కోలు తీసుకుని తన పదమూడో రోజు బస్సు యాత్రను కొనసాగించేందుకు కేసీఆర్ ముందుకు కదిలారు. ప్రస్తుతం గురుశిష్యుల భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More
Next Story