‘కేసీఆర్ కనబడుటలేదు’.. పోలీసులను ఆశ్రయించిన కాంగ్రెస్ నేత
x

‘కేసీఆర్ కనబడుటలేదు’.. పోలీసులను ఆశ్రయించిన కాంగ్రెస్ నేత

కేసీఆర్ కనిపించడం లేదంటూ కాంగ్రెస్ నేత శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనక కారణం ఏంటో..


గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలియాస్ కేసీఆర్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంతరావు. తమ నియోజకవర్గానికి మేలు చేస్తారని గెలిపించామని, కానీ ఇప్పుడు ఆయన కనిపించడం లేదని, దయచేసి ఆయన జాడ కనుగోనాలంటూ ఆయన తన ఫిర్యాదులో కోరారు.

ఆయన చర్యలు ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి చర్యల వెనక అసలు ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు కీలకంగా మారింది. కేసీఆర్‌ను కేటీఆరే ఏదో చేసి ఉంటారంటూ ఇటీవల మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించిన తర్వాత ఈ ఫిర్యాదు నమోదు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేసీఆర్‌ను బయటకు తీసుకురావాలనే కాంగ్రెస్ నేతలు ఇలా చేస్తున్నారా? లేదంటే నిజంగానే కేసీఆర్‌కు ఏమైనా అయిందా? అన్న అనుమానాలు అధికమవుతున్నాయి. ఇన్నాళ్లూ లేనిదికి కాంగ్రెస్‌కు ఒక్కసారిగా కేసీఆర్‌పై ఇంత వల్లమాలిన ప్రేమ ఎందుకు వచ్చింది? అన్న చర్యలు కూడా జోరుగానే సాగుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ పెద్దగా బయటక కనిపించకపోవడమే ఇందుకు కారణం అని కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సిరిసిల్లలో కూడా ఫిర్యాదు

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీకాంత రావు.. గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే విధంగా సిరిసిల్లలోని మరో పోలీస్ స్టేషన్‌లో కూడా మరో ఫిర్యాదు నమోదైంది. ‘‘అయ్యా.. మా ఎమ్మెల్యే కనిపించడం లేదు. తమ నియోజకవర్గానికి మేలు చేస్తారని గెలిపిస్తే ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఎలాగైనా ఆయన జాడ వెతికి మాకు తెలియజేయండి. అదే విధంగా ఆయనను కనిపెట్టి మా సమస్యలు పరిస్కారమయ్యేలా చర్యలు తీసుకోండి’’ అని శ్రీకాంత్ తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. గెలిచినప్పటి నుంచి ఒకటి రెండు సార్లు మాత్రమే ఆయన ప్రజల ముందుకు వచ్చారని, ఆయన కనుమరుగవడంతో ప్రజల సమస్యలు పరిష్కారం లేకుండా గుట్టలుగా తయారయ్యాయని, వాటి పరిష్కారం.. ప్రజల మేలు కోసమైనా వీలైనంత త్వరగా గజ్వేల్ ఎమ్మెల్యేను కనిపెట్టగలరు అని కూడా కోరారు.

ప్రజలను కేసీఆర్ మరిచారు: శ్రీకాంత్

‘‘గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌ను ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారు. కానీ ఆయన మాత్రం కనుచూపుమేరలో కడా ప్రజలకు కనిపించడంలేదు. అందుబాటులో కూడా లేరు. అధికారం పోయినా.. ఆయనకు ప్రతిపక్ష హోదా ద్వారా అసెంబ్లీలో తమ గొంతుకను వినిపించే అవకాశాన్ని ప్రజలు కల్పించారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రజలను, వారి అందించిన ప్రతిపక్ష హోదాను కూడా మర్చిపోయారు. నియోజవర్గంలోని సమస్యలను పరిష్కరించాల్సిన బాద్యత ఎమ్మెల్యేగా కేసీఆర్‌పైనే ఉంది. వెంటనే ఆయనను వెతికిపెట్టి సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలని పోలీసులను కోరుతున్నా’’ అని ఆయన తన ఫిర్యాదులో కోరారు.

‘‘కేసీఆర్ ఆరోగ్యం గురించి, ఆయన గురించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. పదవీ ఆకాంక్షతో కేటీఆరే కేసీఆర్‌ను ఏదో చేశారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బడ్జెట్ సమావేశాలప్పుడు కనిపించిన కేటీఆర్.. మళ్ళీ ఇప్పటి వరకు కనిపంచలేదు. కేవలం ఒకే ఒక్కరోజు అసెంబ్లీలోకి వచ్చారాయన అప్పటి నుంచి ఆయన ప్రజల్లో కూడా తిరగడం లేదు. ఆ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు. అక్కడ ఆయన ఏం చేస్తున్నారో తెలియదు. దానిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఆఖరికి గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కేసీఆర్ కనుమరుగయ్యారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం’’ అని కొండా సురేఖ వ్యాఖ్యానించిన రోజుల వ్యవధిలోనే శ్రీకాంత్ రావు.. పోలీసులకు ఫిర్యాదు చేయడం కీలకంగా మారింది.

కేసీఆర్ గెలుపు ఇలా..

ఇదిలా ఉంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ఘన విజయం సాధించారు. 30వేల మెజారిటీతో ఆయన బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ను చిత్తు చేశారు. దీంతో ఆయన విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈటెల రాజేందర్ కూడా తొలుత బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతే అయినప్పటికీ.. పార్టీ, నేతలతో వచ్చిన విభేదాల నడుమ ఆయన బీజేపీకండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో కీలక నేతగా చెలామణి అవుతున్నారు. మరోవైపు కేసీఆర్.. గత ఎన్నికల్లో అధికారం పోవడంతో ప్రతిపక్ష నేతగా నిలిచారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవలేదు. బడ్జెట్ సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారు. అది కూడా ఒకే ఒక్కరోజు ఆయన సమావేశాలకు హాజరయ్యారు.

Read More
Next Story