మన్మోహన్ సింగ్ మరణంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాల వల్ల ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్.. ప్రధానిగా ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణ కల సాకారమైందని గుర్తు చేసుకున్నారు. దేశ అభివృద్ధి కోసం మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారని అన్నారు. అటువంటి గొప్ప నేత ఇకలేరన్న వార్త తనను ఎంతగానో కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి కష్ట సమయంలో ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థికరంగ నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు.
పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డగా కొనియాడారు. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో రాష్ట్ర సాధనకోసం ఎత్తుగడలో భాగంగా నాటి టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న పొత్తు నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వారి క్యాబినెట్ సహచరుడిగా పనిచేసిన గతాన్ని, డాక్టర్ మన్మోహన్ సింగ్ తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.
మిత భాషిగా, అత్యంత సౌమ్యుడుగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా వారందించిన మద్దతును, చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని కేసీఆర్ అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మన్మోహన్ సింగ్ ప్రస్థానం..
మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 1932న ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పశ్చిమ పంజాబ్ చక్వాల్‌లో జన్మించారు. 1952లో పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఆయన ఆర్ధిక శాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. 1954లో ఎంచే పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జ్ నుంచి ఆర్ధిక శాస్త్రంలో ట్రైపోస్ చేశారు. ఆక్స్‌ఫర్డ్ నుంచి ఎంఏ, డీఫిల్‌ను 1962లో పూర్తి చేశారు. హోనరిస్ కాసా నుంచి డీలిట్ కంప్లీట్ చేశారు. 1970వ దశకంలో భారత ప్రభుత్వంలో ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. 1982 నుంచి 1985 మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. తొలుత ఆర్థిక వేత్త ఆ తర్వాత రాజకీయవేత్తగా మారారు. 1991 నుంచి 1996లో పీవీ నరహింహరావు క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004 నుండి 2014 వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్ధిక సంస్కరణకు పురుడు పోశారు. ఆయనో సిక్కు. మైనారిటీ వర్గానికి చెందిన తొలి ప్రధానిగా చెబుతారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో భారతదేశ జీడీపీ అత్యధికంగా 10.2 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఆయన పాలన సమయంలో వెనకవడిన వర్గాలకు 27 శాతం సీట్లు కేటాయించారు.