గంటల వ్యవధిలో వరంగల్ అభ్యర్థిని మార్చేసిన కేసీఆర్
వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎంపికలో భారీ ట్విస్ట్ నెలకొంది. తాటికొండ రాజును అభ్యర్థిగా ప్రకటించిన గంటల్లోనే కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎంపికలో భారీ ట్విస్ట్. తాటికొండ రాజును అభ్యర్థిగా ప్రకటించిన గంటల్లోనే కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడుగా, అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనల మేరకు కేసీఆర్ సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించినట్లు పార్టీ ప్రకటనలో పేర్కొంది.
కాగా, వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా ఏరికోరి కడియం కావ్యని ఖరారు చేశారు కేసీఆర్. అయితే తాను పోటీలో ఉండలేనని చెప్పి, తండ్రి కడియం శ్రీహరి తో కలిసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కడియం కావ్య. అనంతరం కాంగ్రెస్ ఆమెకి వరంగల్ లోక్ సభ టికెట్ ని కేటాయించింది. కావ్య పార్టీ మారినప్పటి నుంచి వరంగల్ లోక్ సభ సెగ్మెంట్ ని బీ ఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా కావ్యాన్ని ఓడించాలని, కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలని గులాబీ శ్రేణులు కంకణం కట్టుకున్నారు.
బలమైన అభ్యర్థి కోసం కసరత్తు ప్రారంభించారు. తండ్రీకూతుళ్లు పార్టీ మారిన రెండు వారాల తర్వాత శుక్రవారం మధ్యాహ్నం పార్టీకి రాజీనామా చేసిన తాటికొండ రాజయ్యని అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించినట్లు పార్టీ అధికారికంగా పేర్కొంది. కానీ ఈ ప్రకటన వచ్చిన గంటల్లోనే అభ్యర్థిని మారుస్తూ హన్మకొండ జడ్పి చైర్మన్ మారేపల్లి సుధాకర్ కి టికెట్ కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది.
తాటికొండ రాజయ్య తొలుత స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే రాజయ్యపై వచ్చిన వేధింపుల ఆరోపణలు పార్టీకి నష్టం చేకూరుస్తాయేమోనని ఆ టికెట్ ని కడియం శ్రీహరికి ఇచ్చారు కేసీఆర్. కనీసం పార్లమెంట్ సీట్ అయినా దక్కుతుందేమో అని రాజయ్య ఆశించారు. అయితే అది కూడా కుదరదని తేలాక పార్టీకి రాజీనామా చేసి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నాలు చేశారు. కానీ కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో స్తబ్దుగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి కడియంపై పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు కేసీఆర్ కూడా రాజయ్యనే ఖరారు చేశారు. కానీ ఇంతలో ఏమైందో నిర్ణయం మారిపోయింది. రాజయ్యకి మళ్ళీ నిరాశే మిగిలింది.