కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభం... రాత్రికి బస అక్కడే!
x

కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభం... రాత్రికి బస అక్కడే!

ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ పాదయాత్ర, సైకిల్ యాత్ర, బస్సుయాత్రలు చేశారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత తొలి సారిగా బస్సుయాత్ర చేపట్టారు.


బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం అయింది. అందులో భాగంగా చేపట్టిన 17 రోజుల బస్సు యాత్ర బుధవారం మధ్యాహ్నం షురూ అయింది. మధ్యాహ్నం ఇంటి నుంచి తెలంగాణ భవన్ చేరుకున్న కేసీఆర్.. అక్కడ ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం బస్సు యాత్ర స్టార్ట్ చేశారు.

బస్సు యాత్ర మొదటి రోజు తెలంగాణ భవన్ నుంచి మొదలై ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్, నార్కట్ పల్లి, నల్గొండ, మాడ్గులపల్లి మీదుగా మిర్యాలగూడకి చేరుకోనుంది. సాయంత్రం 5:30 గంటలకు మిర్యాలగూడ లోని రాజీవ్ చౌక్ వద్ద రోడ్ షో లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత వేములపల్లి, మాడ్గులపల్లి, తిప్పర్తి, నార్కట్ పల్లి బైపాస్, కేతేపల్లి మీదుగా సూర్యాపేటకి చేరుకుంటారు. రాత్రి ఏడు గంటలకు సూర్యాపేటలోని రోడ్ షోలో ప్రసంగిస్తారు. రాత్రికి సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే కేసీఆర్ బస చేస్తారు.

బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బస్సు యాత్ర లో భాగంగా... సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాలతోపాటు రామగుండం, కొత్తగూడెం, వీణవంక ప్రాంతాల్లోనూ కేసీఆర్ బస చేయనున్నారు. కేసీఆర్ పాల్గొనే ఒక రోడ్ షోకి మరో రోడ్ షోకి మధ్య దాదాపు 10 నుంచి 12 గంటల సమయం ఉంటుంది.

కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు, కరువు, కరెంటు కోత, రైతు సమస్యలపైనా అధికార పార్టీని టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. రూ.500 బోనస్ అమలు, ఆసరా పింఛన్ దారులకు రూ.4 వేలు ఇవ్వడం, మహిళలకు ప్రతి నెలా రూ.2,500 హామీ అమలుపై హస్తం పార్టీని నిలదీస్తూ ప్రచారం కొనసాగించనున్నారు.

ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ పాదయాత్ర, సైకిల్ యాత్ర, బస్సుయాత్రలు చేశారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత తొలి సారిగా బస్సుయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు బస్సు యాత్రను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇక, కేసీఆర్ ప్రయాణించే బస్సుకి మంగళవారమే అలంకరణలు చేసి, తెలంగాణ భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాత్రలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు దాదాపు వంద మందికి పైగా వలంటీర్లను ఏర్పాటు చేశారు.

Read More
Next Story