Mahesh Kumar | ‘తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ తప్పక రావాలి’
తెలంగాణలో పదేళ్ల తర్వాత ప్రజాస్వామ్య పాలన వచ్చిందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
తెలంగాణలో పదేళ్ల తర్వాత ప్రజాస్వామ్య పాలన వచ్చిందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్.. కేవలం 50వేల ఉద్యోగాలే ఇచ్చిందని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే 55వేల ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి వైపు ప్రయాణం ప్రారంభించిందని, ప్రతి రంగంలోని కాంగ్రెస్ తన మార్క్ పాలన కనబరుస్తోందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్‌దే అని అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి ఏడైదన సందర్భంగా నిర్వహిస్తునస్న ప్రజాపాలన పండుగలో ప్రజలంతా కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు కూడా సంధించారు. అసలు తెలంగాణ కోసం కేటీఆర్ ఏం త్యాగం చేశారని నిలదీశారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం పదే పదే చెప్పే కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
‘‘ఈనెల తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ పుట్టిన రోజు. మండల, నియోజక కేంద్రంలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు కాంగ్రెస్ నిర్వహిస్తుంది. సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల పండగ జరుపుతున్నాం. ప్రతిపక్ష నేత కేసీఆర్.. ప్రజా పండుగకు,తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కోరుతున్నాం. పది ఎడ్లలో బీఆర్ఎస్ ఇవ్వలేని ఉద్యోగాలను.. ఏడాది లోనే 50 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అన్ని రంగాలలో కాంగ్రెస్ మార్క్ పాలన కనిపిస్తుంది. అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లిని తీసివేస్తాం అంటుండు. మీ తెలంగాణ తల్లి విగ్రహం దొరలు, దొరసానులను తలపించే విధంగా ఉంది. మేము పెట్టె విగ్రహం తెలంగాణ సంసృతులను ప్రతిబింబిస్తుంది. మీరు ఏమి త్యాగం చేశారని ఇప్పుడొచ్చి రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం. దేశాన్ని దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కడ నిర్బంధం చేయలేదు, కేసీఆర్.. కౌశిక్ రెడ్డిని ఎందుకు మందలించట్లేదు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన భాష సరిగా లేదు. కేటీఆర్, హరీష్ రావు చౌకబారు మాటలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పది ఏండ్లుగా మీరు లూటీలు, దోపిడీ చేశారు కాబట్టే హరీష్ రావు మీద కేసులు బుక్ అవుతున్నవి కేటీఆర్. తండ్రి కొడుకులు తప్ప బీఆర్ఎస్ పార్టీ లో ఎవ్వరు మిగలరు’’ అని అన్నారు.
అయితే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కొన్ని రోజులుగా మహేష్ కుమార్ గౌడ్ చెప్తూనే ఉన్నారు. ఫిరాయింపు నేతలు విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమని, తాము జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పిన రోజే మహేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ ఎంపీ సోయం వాపురావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో కూడా మహేష్ కుమార్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘గతంలో అధికారంలో ఉన్నామన్న అహంకారంతో కాంగ్రెస్ నేతలను బెదిరించి మరీ బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది. కాంగ్రెస్.. ఫిరాయింపులకు ఎప్పుడూ వ్యతిరేకమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి ముందుకొస్తున్నారు. కొన్ని రోజుల్లోనే పది మందికి పైగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు’’ అని వ్యాఖ్యానించారు.