తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన కవిత
తీవ్ర అనారోగ్యానికి గురవ్వగానే జైలు అధికారులు ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసి వెంటనే ఎయిమ్స్ లో జాయిన్ చేశారు.
ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకపాత్ర పోషించిందనే ఆరోపణలపై ఈడీ, సీబీఐ కవిత మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో అరెస్టుచేసి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంచిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె గైనిక్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు కూడా కవిత ఇదే సమస్యపై ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ఇపుడు గైనిక్ సమస్యకు తోడు వైరల్ ఫీవర్ తో కూడా కవిత ఇబ్బంది పడుతున్నారట. దాంతో తీవ్ర అనారోగ్యానికి గురవ్వగానే జైలు అధికారులు ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసి వెంటనే ఎయిమ్స్ లో జాయిన్ చేశారు.
ఆసుపత్రిలో చేరిన కవితకు వైద్యులు అన్నీరకాల పరీక్షలు చేస్తున్నారు. తాను గైనిక్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న కారణంగా బెయిల్ ఇవ్వాలని గతంలోనే కవిత రౌజ్ ఎవిన్యు కోర్టులో పిటీషన్ వేశారు. అయితే అందుకు నిరాకరించిన కోర్టు బెయిల్ పిటీషన్ను కొట్టేసింది. నిజంగానే అంత అనారోగ్యముంటే జైలులో ఉండే చికిత్స చేయించుకోవాలని కవితకు కోర్టు సూచించింది. ఒకసారి బీపీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వాలని, మరోసారి గైనిక్ సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని, ఇంకోసారి తాను మహిళను కాబట్టి బెయిల్ ఇవ్వాలని, కొడుకును చదివించుకోవాలని, ఎన్నికల్లో పార్టీకి ప్రచారం చేయాలనే కారణాలతో కవిత చాలాసార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే కవిత చెప్పిన ఏ కారణాన్ని కూడా బెయిల్ ఇవ్వటానికి సరైన కారణంగా అంగీకరించని కోర్టు పిటీషన్లను కొట్టేసింది. జైలు జీవితం బహుశా కవితను మానసికంగా కుంగదీసినట్లుంది. అందుకనే బీపీ కంట్రోలులో ఉండటంలేదని కుటుంబసభ్యులు కూడా చెబుతున్నారు. ఈమధ్యనే జైలులో కవితను పరామర్శించిన సోదరుడు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు తన చెల్లెలు హైబీపీతో బాధపడుతున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. బయటనుండి ఆహారం తెచ్చుకునేందుకు కవితకు కోర్టు అనుమతిచ్చినా జైలు వాతావరణం పడలేదని సమాచారం.
అందుకనే రకరకాల కారణాలను చూపించి బెయిల్ కోసం కవిత శతవిధాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే కవిత చూపించిన ఏ కారణాన్ని కూడా కోర్టు అంగీకరించటంలేదు. ఎందుకంటే బెయిల్ కావాలన్న కవిత వాదనకన్నా బెయిల్ ఇవ్వకూడదన్న సీబీఐ, ఈడీ వాదనలే బలంగా ఉన్నాయని కోర్టు నమ్ముతోంది. కవితకు బెయిల్ ఇస్తే స్కామ్ లో భాగస్తులైన, సాక్ష్యులను కవిత బెరిస్తారు, తారుమారు చేస్తారని దర్యాప్తు సంస్ధలు చాలా బలంగా వాదిస్తున్నాయి. తమ వాదనకు మద్దతుగా కవిత నేపధ్యాన్ని చూపిస్తున్నాయి. ఎంపీగా పనిచేసిన కవిత ఇపుడు ఎంఎల్సీగా ఉన్నారని, మాజీముఖ్యమంత్రికి కూతురనే నేపధ్యాన్ని దర్యాప్తు సంస్ధలు చూపిస్తున్నాయి. ఈ కారణాలతో కోర్టు కూడా ఏకీభవైస్తోంది. అందుకనే కవితకు బెయిల్ ఇవ్వటానికి కోర్టు ఏమాత్రం అంగీకరించటంలేదు. ఈ నేపధ్యంలో హై బీపీతో బాధపడుతున్న కవిత ఇపుడు గైనిక్ సమస్యతో ఎయిమ్స్ లో చేరారు. మరి వైద్య పరీక్షల తర్వాత డాక్టర్లు ఏమి తేలుస్తారో చూడాలి.