ఫిరాయింపులపై, ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గని పాల్
x

ఫిరాయింపులపై, ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గని పాల్

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి పోటీ చేసి మరో పార్టీలోకి మారడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా పైనా ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు కేఏ పాల్.

ఫిరాయింపులపై పిటిషన్...

కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై పిటిషన్ వేశారు. ఒక పార్టీ నుంచి పోటీ చేసి మరో పార్టీలోకి మారడం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిటిషన్ లో కోరారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్.. ఆరు నెలల తిరగకముందే మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారని అందులో మెన్షన్ చేశారు. రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరి అధికారాలను అనుభవించడం తప్పని ప్రస్తావించారు. ఇది చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ప్రత్యేక హోదా ఏది?

ఏపీలో అందరూ మర్చిపోయిన ప్రత్యేక హోదా అంశాన్ని కేఏ పాల్ మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అంతేకాదు లోక్ సభ ఎన్నికల సందర్భంగా కేంద్రం రాష్ట్రానికి హామీ ఇచ్చిందని, ఆ ప్రకటనలన్నీ క్లిప్పింగులుగా పెట్టి, ఇప్పటికే కేంద్రం హామీ ఇచ్చిన మేరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని హైకోర్టులో వేసిన పిటిషన్ లో కోరారు. ప్రత్యేక హోదా హామీని స్వయంగా ప్రధాని హోదాలో ఉన్న మోదీనే ఇచ్చారని, ఏదో సాదాసీదా వ్యక్తి ఇచ్చింది కాదని న్యాయమూర్తికి తెలిపారు.

Read More
Next Story