భూవివాదంలో హై కోర్టుకి జూనియర్ ఎన్టీఆర్
x

భూవివాదంలో హై కోర్టుకి జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హై కోర్టుని ఆశ్రయించారు. జూబ్లీహిల్స్‌లోని భూ వివాదంలో రిలీఫ్ కోసం ఆయన కోర్టు మెట్లెక్కారు.


టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హై కోర్టుని ఆశ్రయించారు. జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం రూ.24 కోట్ల విలువైన ఆస్తికి సంబంధించిన భూ వివాదంలో రిలీఫ్ కోసం ఆయన కోర్టు మెట్లెక్కారు. గత యజమాని భూమిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నారు. ఆ అమౌంట్ తిరిగి చెల్లించకపోవడంతో ఇప్పుడు బ్యాంకులు ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా ఎన్టీఆర్ అలర్ట్ అయ్యారు.

జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం. 75లో 681 చదరపు గజాల స్థలాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ 2003లో జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి చెందిన సుంకు గీతాలక్ష్మి నుంచి రూ.36 లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన అదే స్థలంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆ భూమి విలువ మార్కెట్ రేటుతో పోలిస్తే చదరపు గజం రూ. 3.5 లక్షలకి పెరిగింది. అంటే దాదాపు ఆ స్థలం విలువ రూ. 24 కోట్లకి చేరింది.

అయితే 1996 లోనే ఈ ల్యాండ్ మీద బ్యాంకుల నుంచి ప్రాపర్టీ మోర్ట్ గేజ్ ద్వారా గీతాలక్ష్మి ఫ్యామిలీ లోన్స్ తీసుకుంది. ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఐదు బ్యాంకుల నుంచి రుణాలు పొందింది. ల్యాండ్ అమ్మేటప్పుడు ఎన్టీఆర్ కి ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టింది. కేవలం చెన్నైలోని ఒక్క బ్యాంకులో లోన్ విషయం మాత్రమే చెప్పడంతో.. ఆ లోన్ క్లియర్ చేసి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకున్నారు తారక్.

మిగిలిన బ్యాంక్స్ లో లోన్ క్లియర్ చేయకపోవడంతో అసలు విషయం బయటపడింది. ఈ ల్యాండ్ పై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ డీఆర్‌టీ (డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టుకి వెళ్లారు.

బ్యాంకులకు ప్రాధాన్యత ఇస్తూ కోర్టు ఉత్తర్వులు..

డెబ్ట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (డీఆర్‌ఏటీ) ద్వారా అందుబాటులో ఉన్న అప్పీలేట్ రెమెడీని ఉపయోగించుకోకుండా డీఆర్‌టీ ఉత్తర్వులపై జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ జే.శ్రీనివాసరావులతో కూడిన వెకేషన్ బెంచ్ గురువారం ప్రశ్నించింది. దీనికి ఎన్టీఆర్ న్యాయవాది వివరణ ఇస్తూ DRT ఆర్డర్‌లో టెక్నికల్ ఇష్యూ ఉందని తెలిపారు. జూన్ 3లోగా డాకెట్ ఆర్డర్‌ను అందించాలని బెంచ్‌ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణ జూన్ 6 కి వాయిదా వేసింది.

ఎన్టీఆర్ స్పందిస్తూ... "బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన టైటిల్ పత్రాలు అలాగే నా దగ్గర ఉన్న టైటిల్ పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాము. నా డాక్యుమెంట్స్ ఒరిజినల్ అని నిర్ధారించబడ్డాయి. ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ పై లోన్స్ ఇచ్చి బ్యాంకులు నాకు నోటీసులు ఇవ్వడం సరైనది కాదు" అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.

Read More
Next Story