జూబ్లీహిల్స్ ఓటరు ఏమీ మారలేదా ?
x

జూబ్లీహిల్స్ ఓటరు ఏమీ మారలేదా ?

అప్పటి పోలింగ్ శాతంతో పోల్చితే ఇపుడు ఎక్కువ పోలింగ్ నమోదైనట్లు అనుకోవాలంతే


జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ చాలా ఆశ్చర్యంగా ఉంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. కడపటి సమాచారం అందేసమయానికి అంటే 5 గంటలవరకు నమోదైన పోలింగ్ 47.16 శాతం. మహాయితే మరో 4 లేదా 5 శాతం కన్నా అయ్యే అవకాశాలు దాదాపు లేవని అర్ధమవుతోంది. 2023 ఎన్నికల్లో 47.58శాతం పోలింగ్ నమోదైంది. అప్పటి పోలింగ్ శాతంతో పోల్చితే ఇపుడు ఎక్కువ పోలింగ్ నమోదైనట్లు అనుకోవాలంతే. హోలుమొత్తంమీద గమనిస్తే ఇపుడు నమోదైన పోలింగ్ శాతం చాలా తక్కువనే అనుకోవాలి. ఎందుకంటే సాధారణ ఎన్నికలతో పోల్చితే ఉపఎన్నికలో ఎక్కువ ఓటింగ్ నమోదవుతుంది. అలాంటిది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు తమకు సాధారణ ఎన్నికలైనా, ఉపఎన్నికైనా పెద్ద తేడాలేదు అని చాటిచెప్పారు.

మొదటినుండి ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఎందుకో ఎన్నికలంటే చాలా ఉదాసీనంగానే కనబడుతున్నారు. 2014 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ 50.18 శాతం. 2018 ఎన్నికలో 45.59శాతం, 2023లో 47.58శాతం ఓటింగ్ నమోదైంది. చివరి మూడు ఎన్నికలను గమనించినా కూడా బ్రహ్మాండంగా పోలింగ్ జరిగింది అని చెప్పుకునేందుకు ఏమీలేదు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైన గంట తర్వాత 9శాతం పోలింగ్ జరిగినట్లు నమోదైంది. మొదటి గంటలోనే 9 శాతం పోలింగ్ నమోదైతే సాయంత్రం 6 గంటలకు సుమారు 65శాతం ఓటింగ్ నమోదవుతుందని కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే నవీన్ అంచనాకు నమోదైన పోలింగ్ శాతం చాలా దూరంలోనే ఆగిపోయింది.

ఓటర్లలో ఎందుకింత నిరసక్తత అన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇపుడు జరిగిన ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారంచేశాయి. బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ప్రచారం దాదాపు మూడు వారాలు ఉధృతంగా జరిగింది. నియోజకవర్గంలోని ఏడుడివిజన్లలో రేవంత్ స్వయంగా నాలుగు రోడ్డుషోలు, ఒక బహిరంగసభలో పాల్గొన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ ఛైర్మన్లతో పాటు సీనియర్ నేతలు దాదాపు మూడువారాలు వీధి వీధి, ఇల్లిల్లు తిరిగి ప్రచారంచేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమపథకాలు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పథకం, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు రు. 500 సబ్సిడీకే గ్యాస్ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్, డ్రైనేజి లాంటి అభివృద్ధి పనులను ఏకరువుపెట్టారు.

నాలుగు పథకాలపైనే ఎక్కువ ప్రచారం

నగరంలోని నియోజకవర్గం ఉపఎన్నిక కాబట్టే రేవంత్ ముఖ్యంగా పైనచెప్పిన నాలుగు పథకాల గురించే ఎక్కువగా ప్రచారం చేయించారు. ఎందుకు ఈ నాలుగు పథకాలపైనే రేవంత్ ఎక్కువ ప్రచారం చేయించారంటే లబ్దిదారులు ఎక్కువగా ఉన్నారు కాబట్టే. ప్రభుత్వ లెక్కల ప్రకారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్దిదారుల కుటుంబాలు 25,925 ఉన్నాయి. రు. 500 సబ్సిడీ గ్యాస్ అందుకుంటున్న కుటుంబాలు 19,658 ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలకు జరిగిన లబ్ది సుమారుగా రు. 120 కోట్లు. 14,197 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అందించింది. సంక్షేమ పథకాల్లో ఇన్ని వేల కుటుంబాలు లబ్దిని పొందుతున్నాయి కాబట్టే వీరంతా పోలింగులో పాల్గొని కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపిస్తాయని రేవంత్, మంత్రులతో పాటు కాంగ్రెస్ నేతలు ఆశలుపెట్టుకున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నియోజకవర్గంలో 4.01 లక్షల ఓటర్లున్నారు. వీరిలో బీసీలు 1.34 లక్షలు. ముస్లిం మైనారిటీలు 1.20 లక్షలున్నారు. బీసీల్లో కూడా యాదవులే 35 వేలమంది ఉన్నారు. ఇక కమ్మ సామాజికవర్గం ఓట్లు 22,746, ఎస్సీలు 28,370, రెడ్డి 17,641, క్రైస్తవులు 19,396 తో పాటు మిగిలిన ఓట్లు ఇతర సామాజికవర్గాలవి. నియోజకవర్గంలో 30 కాలనీలు, 70 బస్తీలున్నాయి. నియోజకవర్గంలో అత్యధిక జనాభా మధ్య, దిగువ తరగితో పాటు పేదలే. ముస్లింల్లో ఎక్కువగా బస్తీల్లోనే ఉన్నారు. అందుకనే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో పాటు మజ్లిస్ పార్టీ ఎంఎల్ఏలు, నేతలు కూడా కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్, నేతలతో కలిసి విస్తృతంగా ప్రచారంచేశారు. జనాలు కూడా రేవంత్ రోడ్డుషోలు, సభకు విశేషంగా స్పందించారు.

బీసీ, ముస్లింలే కీలకమా ?

ముస్లింలు, బీసీల ఓట్లతోనే మంచి మెజారిటి నవీన్ గెలవటం ఖాయమని కాంగ్రెస్ నేతలు చాలా నమ్మకంతో ఉన్నారు. ఉపఎన్నిక కాబట్టి, ప్రచారం చాలా ఉధృతంగా జరిగింది కాబట్టి ఓటర్లు కూడా అంతేరీతిలో స్పందించి రికార్డుస్ధాయిలో పోలింగులో పాల్గొంటారని అందరు అనుకున్నారు. పైగా వృద్ధులు, మహిళలు, గర్భిణిలు, వికలాంగులను ఇళ్ళ నుండి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళేందుకు జూబ్లీహిల్స్ ఆటో యూనియన్ 400 ఆటోలను ఉచితంగా నడిపింది.

కేటీఆర్ ప్రచారం ఏమైంది ?

ఇక బీఆర్ఎస్ విషయం చూస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికలో గెలుపును సవాలుగా తీసుకున్నారు. దాదాపు మూడువారాలు అభ్యర్ధి మాగంటి సునీతతో పాటు వీధి, వీధి, ఇల్లిల్లు తిరిగారు. రాష్ట్రంలోని తమ ప్రజాప్రతినిధులను, సీనియర్ నేతలను నియోజకవర్గంలో మోహరించారు. పగలనకా, రాత్రనకా ప్రచారంచేశారు. కారుగుర్తుకు ఓట్లేసి గెలిపించటం ద్వారా రేవంత్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని ఓటర్లను విజ్ఞప్తిచేశారు. 14వ తేదీ కౌంటింగ్ తర్వాత రేవంత్ ప్రభుత్వంలో భూకంపం వస్తుందన్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమని జోస్యాలు కూడా చెప్పారు. రోడ్డుషోలు, బహిరంగసభలో రేవంత్ ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా కేటీఆర్ తన కసినంతా తీర్చుకున్నారు. జనాలు కూడా రోడ్డుషోలకు, సభలకు బ్రహ్మరథం పట్టారు.

ఇక బీజేపీ వ్యవహారం చూస్తే మిగిలిన రెండుపార్టీలతో పోల్చుకుంటే ప్రచారంలో తేలిపోయింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు కూడా ప్రచారంచేసినా ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అందుకనే చివరిలో మరో కేంద్రమంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. బండి మూడు, నాలుగు రోడ్డుషోలు, సభలు నిర్వహించారు. ఈయన సభలకు జనాలు బాగానే హాజరయ్యారు. కాంగ్రెస్, ముస్లింలు ఏకమయ్యారు కాబట్టి హిందువులంతా ఏకమై బీజేపీకి ఓట్లేయాలనే మతం కలరింగు కార్డును కూడా ఉపయోగించారు. అయినా ఓటర్లలో పెద్దగా కదలిక రాలేదు.

పోటెత్తిన జనాలు ఏమయ్యారు ?

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రేవంత్ సభలకైనా, కేటీఆర్ ప్రచారానికైనా జనాలు పోటెత్తారు. ఇద్దరి ప్రచారంలో జనాలు విశేషంగా పాల్గొన్నారు కాబట్టి కచ్చితంగా పోలింగులో పెద్దసంఖ్యలోనే పాల్గొంటారని అందరు అంచనావేశారు. తీరాచూస్తే పోలింగ్ సుమారుగా 50 శాతం మాత్రమే టచ్ అయ్యేట్లుంది. అంటే రేవంత్, కేటీఆర్ రోడ్డుషోలు, సమావేశాలు, ఇచ్చిన హామీలు, అమలవుతున్న సంక్షేమపథకాలు ఏవికూడా జనాలను పెద్దగా ఆకట్టుకున్నట్లు కనిపించటంలేదు. మరో విషయం ఏమిటంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ చాలా డివిజన్లలో పోటీలుపడి డబ్బులు పంచినట్లు బాగా ప్రచారంజరిగింది. ఓటుకు 4 వేల రూపాయలు కూడా పంపిణీ జరిగిందని సమాచారం. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన అన్నీరకాల ప్రయత్నాల్లో ఏదీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినట్లు అర్ధమవుతోంది. పై రెండుపార్టీలు చేసిన ప్రయత్నాల వల్లే ఓటింగ్ శాతం సుమారుగా 50 లేదా 51శాతానికి చేరకుంటున్నదని అనుకోవాలంతే. పార్టీలు, అధినేతల ఈప్రచారం, ప్రయత్నాలు కూడా లేకపోతే పోలింగ్ శాతం మరింత దారుణంగా ఉండేదేమో అనిపిస్తోంది. ఏదేమైనా పోలింగ్ విషయంలో ఓటర్లు ఎందుకింత నిరాసక్తంగా ఉన్నారన్నదే అర్ధంకావటంలేదు.

Read More
Next Story