పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ, ఖర్గేకు జీవన్ రెడ్డి లేఖ..
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం వేరే పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రస్ ముసుగు కోవడాన్ని తాను ఏమాత్రం జీర్ణించుకోలేకున్నానని అన్నారు.
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్(Congress) కీలక నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం వేరే పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రస్ ముసుగు కోవడాన్ని తాను ఏమాత్రం జీర్ణించుకోలేకున్నానని అన్నారు. తాను నమ్ముకున్న కాంగ్రెస్‌లో ఫిరాయింపులకు పెద్దపీట వేయడాన్ని తీవ్ర అవమానంగా, అగౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇటీవల తన ముఖ్య అనుచరుడు గంగారెడ్డి మరణంతో జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పార్టీ కోసం ఇంతకాలం కష్టపడిన వారికే భద్రత లేకుంటే ఎలా అంటూ పార్టీపై, పార్టీ తీరుపై మండిపడ్డారు. తాజాగా ఈరోజు మరోసారి పార్టీలో పెరుగుతున్న ఫిరాయింపులు, పార్టీ ఫిరాయించిన వారికి పార్టీ దక్కుతున్న ఉన్నత స్థానాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి లేఖ రాశారు. అందులో ఈ ఫిరాయింపుల అంశాన్ని ప్రధానంగా చర్చించారు. ఎన్నికల్లో గెలిచి పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి డిమాండ్‌కు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మద్దతు ప్రకటించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు.
నాది మానసిక వేదన: జీవన్
‘‘నేను మానసిక వేదనలో ఉన్నాను. ఈ లేఖను కూడా తీవ్ర మానసిక వేదనతోనే రాస్తున్నాను. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన వారికి ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. నేతలు పార్టీ ఫిరాయింపులు జరగకుండా నైతిక విలువను పాటించాలి. రాష్ట్ర కాంగ్రెస్ ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నారు. సంఖ్యాబలంతో ఆధిక్యంలో ఉన్నా ఇంకా ఫిరాయింపులను కాంగ్రెస్ ఎందుకు ప్రోత్సహిస్తుందో అర్థం కావట్లేదు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏర్పడుతున్న ప్రస్తుత పరిణామాలను ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నాను. నా మానసిక వేదనకు కూడా అదే కారణం. పార్టీ ఫిరాయించిన వారికి ప్రత్యేక స్థానాలకు కల్పిస్తున్నారు. అసలు ఈ ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి. పోచారం ఇంట్లో మీటింగ్ పెట్టి మరీ ఫిరాయింపు దారులదే పూర్తి బాధ్యత అని తీర్మానం చేశారు’’ అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
గంగారెడ్డి హత్యకు ఫిరాయింపులే కారణం..
‘‘పోచారం అధ్యక్షతన ఆయన ఇంట్లో ఫిరాయింపు దారులతో సమావేశం నిర్వహించడం. దానికి సీఎం, ఇన్‌చార్జ్ హాజరవడం సరికాదు. ప్రభుత్వం బాధ్యతలను కూడా ఫిరాయింపు దారులకే కట్టబెట్టడం ఏమాత్రం సబబు. పదేళ్లు బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా పని చేశాను. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న జగిత్యాల ఎమ్మెల్యే.. నా ప్రధాన అనుచరుడు గంగారెడ్డిని అతి కిరాతకంగా హత్య చేయించారు. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ ఉన్న ఫిరాయింపులు దేనికి. రాహుల్ గాంధీ ఆలోచనలకు భిన్నంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రవర్తన ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ఏకాడికీ కేసీఆర్‌నే అనుసరిస్తోంది. ఫిరాయింపులను ప్రోత్సహించడం ఇందుకు ఒక ఉదాహరణ. నా భవిష్యత్ కార్యాచారణపై మీరే మార్గదర్శకం చేయండి. రాహుల్ ఏం చెప్పారు? మనం ఏం చేస్తున్నాం? నా అనుచరుణ్ణి హతమార్చిన వ్యక్తి కాంగ్రెస్ వ్యతిరేకి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలపై దాడి చేశారు. ఇప్పుడు పార్టీ మారి.. కాంగ్రెస్ ముసుగు వేసుకుంటే ఎలా? ఫిరాయింపు దారులపై అనర్హత వేటు వేయాలి’’ అని కోరారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
సీఎం రేవంత్ ఆలోచించాలి: ప్రశాంత్ రెడ్డి
పార్టీ ఫిరాయింపుల విషయంలో జీవన్ రెడ్డి చేసిన ప్రతి డిమాండ్‌తో తాను కూడా ఏకీభవిస్తానని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ ఒకసారి ఆలోచించాలన్నారు. ‘‘ఫిరాయింపు దారులపై అనర్హత వేటు వేయాలి. రాష్ట్రం ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగితే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకం ఏంటో తేటతెల్లం అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కొనసాగిస్తోంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఈ విషయాలను సీఎం రేవంత్ పట్టించుకోవాలి. వీటి పరిష్కారం కోసం కాస్తంత సమయం వెచ్చించాలి’’ అని కోరారు.