నిర్మాతలకు భారీ బడ్జెట్‌లు తెచ్చిన తంట.. సుకుమార్ ఇంట ఐటీ రైడ్స్..
x

నిర్మాతలకు భారీ బడ్జెట్‌లు తెచ్చిన తంట.. సుకుమార్ ఇంట ఐటీ రైడ్స్..

సినిమాల బడ్జెట్‌లు, చెల్లింపులు, కలెక్షన్లపైనే ఐటీ అధికారులు ఫోకస్.


తెలంగాణలోని సినీ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దిల్ రాజు నివాసం, కార్యాలయ నుంచి ప్రారంభమైన ఈ సోదాలు.. ఈరోజు సుకుమార్ ఇంటికి చేరుకున్నాయి. పుష్ప-2 సినిమా నిర్మాణంలో సుకుమార్ వాటా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దాదాపు 50 బృందాలు తెలంగాణ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నాయి. దిల్‌రాజు ఇళ్లు, కార్యాలయాలను తనిఖీ చేసిన ఐటీ అధికారులు.. బ్యాంక్ లాకర్లను కూడా పరిశీలించినట్లు దిల్ రాజు సతీమణి వెల్లడించారు. కాగా ఈ క్రమంలోనే తాజాగా ఐటీ సోదాల సెగ సుకుమార్‌కు గట్టిగా తగులుతోంది. భారీ బడ్జెట్‌లు పెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్న నిర్మాతలు అదేస్థాయిలో రిటర్న్స్ పొందుతున్నారని, ఈక్రమంలో వారు కడుతున్న ఆదాయపన్ను వారి ఆదాయంతో సరితూగుతోందా అన్న అనుమానాలతోనే ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం నుంచి తెంగాణలోని సినీ నిర్మాతలపై ఐటీ చేస్తున్న దాడులతో చిన్నా చితక నిర్మాతల్లో కూడా సోదాలు ఆందోళన మొదలైందని ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తోంది.

సుకుమార్‌ను తీసుకొచ్చిన అధికారులు

బుధవారం ఉదయం నుంచి సుకుమార్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడో వెళ్లడం కోసం సుకుమార్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఉండగా.. అధికారులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని సుక్కును తిరిగి ఇంటికి తీసుకొచ్చారని సమాచారం. ఆయనను ఇంటికి తీసుకొచ్చి ఆయన సమక్షంలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పుష్ప నిర్మాణంలో సుకుమార్ వాటా తీసుకున్నట్లు అధికారులు గుర్తించినట్లు సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. ఇంకా అధికారులు ఏం గుర్తించారు అనేది తెలియదు.

అయితే పుష్ప-2 నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సీఈఓ చెర్రీ ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరిగాయి. మంగళవారం ఉదయం నుంచే వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ ఇల్లు, కార్యాలయంలో సోదాలను కొనసాగిస్తున్నారు. పుష్ప-2 సినిమా రూ.1800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీమ్ ఇటీవల వెల్లడించింది. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. సినిమా బడ్జెట్, చెల్లింపులు, లావాదేవాలు, కలెక్షన్ల లెక్కలు వంటి అన్ని వివరాలను అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

దిల్ రాజు‌ ఇంట కొనసాగుతున్న సోదాలు..

టాలీవుడ్‌లోని బడా నిర్మాత, టీజీఎఫ్‌డీసీ అధ్యక్షుడు దిల్‌రాజు ఇంట ఐటీ అధికారులు మంగళవారం ఉదయం ప్రారంభించిన సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయనకు సంబంధించి అన్ని ప్రదేశాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. దిల్‌రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు సంక్రాంతి బరిలో నిలబడి మంచిగా పర్ఫార్మ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే బడ్జెట్, కలెక్షన్లకు సంబంధించిన వివారాలను అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య వ్యత్సాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారని, పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. కాగా వీటికి సంబంధించి అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఒకసారి అందరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తయిన తర్వాత.. సేకరించిన మొత్తం ఫైళ్లు, వివరాలను పరిశీలించి అధికారులు లెక్కలకు బయట పెడతారన్న వాదన వినిపిస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ వివరాలు బయటకు రావొచ్చని తెలుస్తోంది.

Read More
Next Story