పార్టీలో కేటీఆర్ కి మద్దతు తగ్గిపోయిందా? ఇది సాక్ష్యమా?
x

పార్టీలో కేటీఆర్ కి మద్దతు తగ్గిపోయిందా? ఇది సాక్ష్యమా?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి స్పీకర్ ని కలవడానికి వెళ్లాలని ఆదేశాలిచ్చినా... 13 మంది డుమ్మా కొట్టడం చర్చనీయంశంగా మారింది.


బీఆర్ఎస్ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు జంప్ అవడం ఆ పార్టీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది. ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి స్పీకర్ ని కలవడానికి వెళ్లాలని ఆదేశాలిచ్చినా... 13 మంది డుమ్మా కొట్టడం చర్చనీయంశంగా మారింది. ప్రోటోకాల్ వివాదం, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మంగళవారం అసెంబ్లీ స్పీకర్ ని కలిసి ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ హై కమాండ్ నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ ని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ స్పీకర్ ని కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

నిర్ణయించినట్టుగానే ఈరోజు (మంగళవారం) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ కి వినతిపత్రం కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలివ్వాలని స్పీకర్ ని కోరారు. అంతేకాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ పిటిషన్ కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ తో భేటీ వేళ ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం మరింత ఆసక్తికరంగా మారింది.

13 మంది ఎమ్మెల్యేలు డుమ్మా...

స్పీకర్ తో భేటీకి 13 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వీరిలో కేసీఆర్ తో సహా తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, విజేయుడు, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ 38 నుంచి బలం 28కి పడిపోయింది. ఇవాళ్టి కార్యక్రమానికి 15 మంది హాజరు కాగా, కేసీఆర్ సహా 13 మంది డుమ్మా కొట్టారు. మరింతమంది కాంగ్రెస్ లో చేరతారని ఆ పార్టీ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్న వేళ కేసీఆర్ ని మినహాయిస్తే మిగిలిన 12 మంది డుమ్మా కొట్టడం శ్రేణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వీరిలో ఎవరు ఉంటారు? ఎవరు జంప్ అవుతారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అలాగని భేటీకి హాజరైన వారంతా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారనే నమ్మకమూ లేదు. ఎందుకంటే ఫిరాయింపుల అనుమానాలు బలంగా వినిపించిన సమయంలో కేసీఆర్ తన ఫార్మ్ హౌస్ లో నేతలతో భేటీ అయ్యారు. ప్రలోభాలకు లొంగవద్దని, అందరికీ అండగా ఉంటానని, మండలస్థాయి నేతలతో సహా అందరికీ అందుబాటులో ఉంటానని, అండగా ఉంటానని, పార్టీ మారొద్దని ధైర్యం నూరిపోశారు. ఈ భేటీలలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ కూడా పాల్గొన్నారు. కానీ వీరంతా కనీసం నెల కూడా తిరక్కుండానే కాంగ్రెస్ లో చేరిపోయారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని తేల్చేశారు.

కేటీఆర్ కి తగ్గుతున్న మద్దతు..?

పార్టీ మారతారా? మారరా... అనే విషయం పక్కనపెడితే... ఈరోజు జరిగిన కార్యక్రమం కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. అందరూ హాజరవ్వాలని ఆయన కోరారు. కానీ కేసీఆర్ మినహాయించి 12 మంది డుమ్మా కొట్టారు. కేసీఆర్ వారసుడు, కేసీఆర్ తర్వాత పార్టీలో సెకండ్ బాస్, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన నాయకుడు కేటీఆర్. మరి ఆయన ఆదేశాల్ని వీరంతా బేఖాతరు చేయడం పార్టీలో ఆయనకి మద్దతు తగ్గిపోయిందా? అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. ఇటీవల దానం నాగేందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేటీఆర్ సీనియర్లకి గౌరవం ఇవ్వలేదు అనే ఆరోపణ కూడా చేశారు. ఆయన మాట వినే పరిస్థితిలో ఎవరూ లేరని వ్యాఖ్యానించడం గమనార్హం.

"పార్టీ పూర్తిగా బ్రష్టు పట్టడానికి కేసీఆర్ కాదు.. పూర్తిస్థాయి బాద్యుడు కేటీఆర్ మాత్రమే. బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు విశ్వనీయత కోల్పోయారు. ఎమ్మెల్యే లకు బీఆర్ఎస్ లో గౌరవం లేకుండా కేటీఆర్ అవమానించేవారు. కేటీఆర్ గుట్టు త్వరలో బయటపెడతా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని కలవనియకుండా గంటలు గంటలు నిరీక్షణ కు గురిచేసేవారు. కేటీఆర్ ఓన్లీ తన నియోజకవర్గం సిరిసిల్లలో వేల కోట్లతో డెవలప్ చేశారు తప్ప.. ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో అభివృద్ధి కి నిధులు ఇవ్వలేదు" అని దానం అన్నారు.

ఈ నేపథ్యంలో దానం నాగేందర్ చెప్పినట్టు కేటీఆర్ పై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కోపం ఉందా.. అనే అనుమానం వ్యక్తం అవుతోంది. అందుకే ఆయనకి మద్దతుగా నిలబడట్లేదా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ వివాదం..

ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కే పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే సంబితా ఇంద్రారెడ్డి ఉండగా ఓడిపోయిన కాంగ్రెస్ నేత కిచ్చన్నగిరి లక్ష్మారెడ్డి చెక్కులు పంపిణీ చేయడం వివాదాస్పదం అయింది. ప్రోటోకాల్ పాటించలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యక్రమంలోనే ఆందోళన చేశారు. స్టేజ్ కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

Read More
Next Story