
తెలంగాణ సీఎం.. రేవంతా? రాహుల్ గాంధీనా..?
ప్రతి విషయంలో కూడా రాహుల్ గాంధీ చెప్పిందే చేసే ఈ ప్రభుత్వం.. ఒక్కటైనా సొంత నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందా? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.
‘షాడో సీఎం, సీటులో ఉంది కీలు బొమ్మ సీఎం’ అంటూ సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటాయి. సీఎం కూర్చిలో ఉన్న వ్యక్తి కాకుండా వేరే వారు రాష్ట్రానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పడానికి చేసే ప్రయత్నంలో విపక్షాలు ఈ విమర్శలు చేస్తాయి. కానీ ప్రస్తుతం తెలంగాణలో మాత్రం నేరుగా అధికార పార్టీనే తాము ప్రాక్సీ ప్రభుత్వం అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. ప్రతి పథకం, చట్టం ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా అది తమది కాదని, పార్టీ పెద్దల సూచనల మేరకే తాము ఇలా చేస్తున్నమంటూ బాహాటంగానే చెప్తోంది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా విద్యార్థులకు వివక్ష నుంచి రక్షణ కల్పించడం కోసం రాష్ట్రంలో ‘రోహిత్ వేముల’ చట్టం తీసుకురావాలని సూచిస్తూ రాహుల్ గాంధీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అందుకు రేవంత్ ఇచ్చిన సమాధానం కూడా తెలంగాణకు రాహుల్ గాంధీనే సూపర్ సీఎం అనే అనుమానాలు కలిగించేలా ఉన్నాయి. జపాన్ పర్యటనలో ఉన్న రేవంత్.. రాహుల్ గాంధీ లేఖపై స్పందిస్తూ.. ‘‘మీ స్ఫూర్తిదాయకమైన పిలుపు నాకు బలంగా తాకింది. గర్వించదగిన భవిష్యత్తును రూపొందించడంలో మీ ఆలోచనలు, భావాల స్ఫూర్తితో ముందుకు వెళ్తాము’’ అని చెప్పారు.
ఒక్క విషయంలో మీ స్ఫూర్తితో ముందుకు వెళ్తాం అంటే ప్రాక్సీ సీఎం అయిపోతారా అన్న అనుమానాలు కలగొచ్చు. కానీ రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే తామ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఇప్పటికే పలుసార్లు సీఎం రేవంత్ సహా మంత్రులు కూడా చెప్పారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహపడిన సూపర్ సిక్స్ పథకాలు మొదులుకుని.. బీసీ డిక్లరేషన్, కుల గణన, ఎస్సీ వర్గీకరణ ఇలా ప్రతీ అంశంలో కూడా రాహుల్ గాంధీ.. సూచనలు, ఆలోచనల మేరకే తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
బీసీలకు రిజర్వేషన్లను పెంచాలని, ముఖ్యంగా తెలంగాణలో 42శాతం కల్పించాలన్న ఆలోచనకు బీజం వేసిందే రాహుల్ గాంధీ అని, భారత్ జోడో యాత్ర సమయంలో ప్రజల కష్టాలను తెలుసుకున్న ఆయన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిశ్చయింకున్నారని, ఆయన ఆలోచనా స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసిందని రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతూనే కుల గణన చేస్తామని రాహుల్ ప్రకటించారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తీర్మానం చేసి బీసీ కులగణన చేపట్టాం’’ అని ఏప్రిల్ 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ కూడలిలో బీసీ సంఘాలు చేపట్టిన మహాధర్నా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆఖరికి పేదలకు సన్నబియ్యం అందించడం, రైతు రుణమాఫీ, రైతుభరోసా, మహిళలకు ఫ్రీబస్సు ఇలా అనేక స్కీమ్‌లకు కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీనే ప్రేరణ అని ప్రభుత్వం చెప్పింది.
సూపర్ సిక్స్‌కు కూడా రాహుల్ గాంధీనే ప్రేరణ అని పలు సందర్భాల్లో చెప్పారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తెలంగాణ అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన చేయడం లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు అవసరం ఉందా లేదా అని చూడకుండా రాహుల్ గాంధీ ఏం చెప్తే దానిని గుడ్డిగా ఫాలో కావడమే ఈ ప్రభుత్వం పనా? ప్రజల అవసరాలు, వారికి కావాల్సిన సదుపాయాలు, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఇక్కడ పదవుల్లో ఉన్న వారికి పట్టదా? అవగాహన లేదా? లేదంటే మాకెందుకులే? అనుకుంటున్నారా అన్న అనుమానాలు పలువురు విశ్లేషకులు కూడా లేవనెత్తుతున్నారు. ప్రతి విషయంలో కూడా రాహుల్ గాంధీ చెప్పిందే చేసే ఈ ప్రభుత్వం.. ఒక్కటైనా సొంత నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందా? అని నిలదీస్తున్నారు.