పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలు,ప్రజాధనం వ్యర్థం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయి.ఈ ప్రాజెక్టుపై రూ.31,850 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పేరిట ప్రజాధనం దుర్వినియోగం అయింది.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి కోట్లాది రూపాయలు వెచ్చించినా ప్రయోజనం మాత్రం లేకుండా పోయింది.
- దక్షిణ తెలంగాణ జిల్లాలకు సాగు,తాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది నుంచి నీటిని తీసుకువచ్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2014 సంవత్సరం ఆగస్టులో శ్రీకారం చుట్టారు.ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డి.పి.ఆర్. తయారుచేసేలా ఒప్పందం కుదిరింది. ఇ.ఎస్.సి.ఐ. వారు సమగ్ర సర్వే జరిపి తమ డి.పి.ఆర్.ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
జూరాల నుంచి కాకుండా...
జూరాల బ్యాక్ వాటర్స్ నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకోవాలని దీనికి రూ.32,200 కోట్లు ఖర్చవుతుందని డి.పి.ఆర్.లో తెలిపారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో చర్చ జరిగింది. జూరాల నుంచి కాక శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీటిని తీసుకోవాలని సూచిస్తూ త్వరలో డి.పి.ఆర్. సవరించి తీసుకురావాలని అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశించారు.సీఎం ఆదేశంతో ఇ.ఎస్.సి.ఐ. రెండు వారాల్లో సవరించిన డి.పి.ఆర్. తయారుచేశారు. అందులో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా రెండు పద్ధతులు సూచించగా తేది 21-5-2015 నాడు జరిగిన సమావేశంలో రెండవ పద్ధతి (ఆల్టర్‌నేట్)కి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు.
నిపుణుల సూచనను కాదని అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయం
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో నిపుణుల సూచనను కాదని సీఎం నిర్ణయం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ లిఫ్ట్‌ల ఎత్తుని తగ్గించమని, అలాగే కరివేన వద్ద ఒక రిజర్వాయర్ నిర్మించాలని ఆదేశించారు.సాక్షాత్తూ సీఎంనే ముఖ్యమైన సాంకేతిక సూచనలు చేశారు.ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక పరమైన నిర్ణయాలు రాజకీయనాయకులు కాక నిష్ణాతులైన ఇంజనీర్లు నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’తో చెప్పారు.
అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణ పనులు
కృష్ణానది అంతర్ రాష్ట్ర నది. కృష్ణా నది అయిదు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.ఇలాంటి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, ఇతర శాఖల అనుమతులు అవసరం. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణపనులు ప్రారంభించారు.
గ్రీన్ ట్రిబ్యునల్ ఘాటు వ్యాఖ్యలు
కొందరు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేయడం, ట్రిబ్యునల్ వారు 22-10-2002 నాడు తీర్పు వెలవరిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి అనుమతులు లేకుండా పని మొదలుపెట్టడం ఒక అలవాటుగా మారిందని, ప్రతిదానికి ప్రజల బాగోగుల కోసం పనిచేస్తున్నామని చెపుతున్నారని ట్రిబ్యునల్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేవలం తాగునీటి కోసం అని తప్పుడు మాటలు చెపుతుందని గ్రీన్ ట్రిబ్యునల్ ఆరోపించింది.
గ్రీన్ ట్రిబ్యునల్ రూ.920 కోట్ల జరిమానా
ఉద్దేశ్యపూర్వకంగా ట్రిబ్యునల్ ఆదేశాలు ధిక్కరించినందుకు గాను తెలంగాణ రాష్ట్రానికి గ్రీన్ ట్రిబ్యునల్ రూ.920 కోట్లు జరిమానా విధించింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో అప్పీలు వేయగా కోర్టువారు ట్రిబ్యునల్ ఆర్డర్ కొట్టివేయలేదు. కాని జరిమాన చెల్లింపుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
కుంటుపడిన ప్రాజెక్టు పనులు
వట్టెం వద్ద సరిగా పంపులు అమర్చకపోవడంతో మొన్నటి సెప్టెంబరు వర్షాలకు పంపులు పూర్తిగా మునిగిపోయి దెబ్బతిన్నాయి. నిష్ణాతులైన ఇంజనీర్లు తీసుకోవాల్సిన నిర్ణయాలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవడం వల్ల, దీంతో పాటు తరచూ ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు చేర్పులు చేయడంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయి.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అవకతవకలు...ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యాఖ్యలు
1. 2015లో మొదలై 3 సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 9 సంవత్సరాలు అయినా ఇంకా మధ్యలోనే ఆగి ఉంది. ఇది పూర్తి కావడానికి ఇంకా 4 లేక 5 సంవత్సరాలు పట్టవచ్చు.
2. ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం,తరచూ మార్పులు, చేర్పులతో రూ.32,200 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అంచనా భారీగా పెరిగి ఇప్పుడు రూ.50 వేల కోట్లకు చేరింది.
3. ఎటువంటి సాంకేతిక విశ్లేషణ లేకుండా కేవలం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చారు.
4. కేంద్రం నుంచి తగిన అనుమతులు లేకుండా ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా పని మొదలు పెట్టి ట్రిబ్యునల్ లో పరువు పోగొట్టుకొని రూ.920 కోట్ల జరిమానా కూడా విధించింది.
5. సెప్టెంబరు 2024 నాటికి ఈ ప్రాజెక్టుపై రూ.31,850 కోట్లు ఖర్చు చేసినా, ఇంతవరకు ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు.
6. వివిధ బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు. చేసిన అప్పులకు సాలీనా పెద్ద ఎత్తున వడ్డీ చెల్లిస్తున్నారు.
7. ప్రస్థుత పరిస్థితిలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజక్టు రాష్ట్రానికి ఒక గుదిబండగా తయారైంది.ఇంతలో ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యే సూచనలు లేవు. హైకోర్టులో భూసేకరణ కేసులు ట్రిబ్యునల్‌లో కేసులు, సుప్రీమ్ కోర్టులో కేసులు తేలేదెప్పుడో పాలకులకే తెలియాలి.
విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోండి
పాలమూరు - రంగారెడ్డి ప్రాజక్టు పనులలో రాజకీయ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నతాధికారులు ముఖ్యంగా ఇంజినీర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వక అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలే శిరోధార్యంగా పనిచేశారు.పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు మంచి ఉద్ధేశ్యంతో చేసినవి కావు. కేవలం లాభాపేక్షతో తీసుకున్న నిర్ణయాలు మాత్రమేనని, దీనివల్ల పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైనందున దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
Next Story