మేధావులు ప్రభుత్వం కన్నా ముందు చూపుతో ఉండాలి
x

మేధావులు ప్రభుత్వం కన్నా ముందు చూపుతో ఉండాలి

మేధావులు ప్రభుత్వం కన్నా ముందు చూపుతో ఉండాలి. మేధావుల సూచనలు ప్రజల, ప్రభుత్వాల, రాజకీయ పార్టీల ఆలోచనా విధానాలను మలుపు తిప్పాలి.

మేధావులు ప్రభుత్వం కన్నా ముందు చూపుతో ఉండాలి. మేధావుల సూచనలు ప్రజల, ప్రభుత్వాల, రాజకీయ పార్టీల ఆలోచనా విధానాలను మలుపు తిప్పాలి. మేధావుల ముందు చూపు సూచనలు ప్రజలు ఉద్యమాలు చేయడం, పార్టీలు ఎన్నికల ప్రణాళికలో చేర్చుకోవడం, న్యాయమూర్తులు నూతన కోణాలతో తీర్పులివ్వడం, సైంటిస్టులు నూతన అన్వేషణలు సాధించడం, మానవీయ సంస్కృతిలో నూతన సంస్కృతిగా స్థిరపడడం వంటి వాటికి ఉపయోగపడాలి. అందుకు దారి తీయాలి. అదే అసలైన మౌలిక మేధావులు చేయాల్సిన పని.

ఏదో ఒక దానిని విమర్శించడం, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసించడం, విమర్శించడం అవసరమేగాని అవి మేధావులు ప్రభుత్వం కన్నా వెనకబడి పోయిన దశలో ఫాలోవర్లుగానే తప్ప లీడర్లుగా, గురువులుగా ఎదగలేక పోవడాన్ని సూచిస్తుంది. ముందే ఏర్పరుచుకున్న స్థిర అభిప్రాయాలు, దృక్పథాలననుసరించి భాష్యం చెప్పడం కూడా ఫాలోవర్లు గా, వాచ్ డాగ్ గా ఉండడమే.

మేధావులు ముందుచూపుతో ఆలోచించాలి. రాజకీయ నాయకులు వర్తమానం గురించి ఆలోచిస్తారు. మేధావులు వర్తమానంతో పాటు భవిష్యత్ గురించి ఆలోచించాలి. గురువులుగా సమాజాన్ని మలుపు తిప్పాలి. మేధావులకు అన్నీ సమకూర్చే ఉద్యోగాలు, సౌకర్యాలు, జీత భత్యాలు, ఉద్యోగాలు లభించాక చాలామంది సోమరులై కుటుంబానికి, తమ ప్రమోషన్లకు పరిమితమైపోతున్నారు. గొప్ప గొప్ప క్వాలిఫికేషన్లు, హోదాలు, స్థానాల్లో ఉన్నవారు ఇలా మిన్నకుండి పోతున్నారు. సమాజ గమనాన్ని నిర్దేశించే బదులు ప్రేక్షకులుగా మారుతున్నారు.

గొప్ప గొప్ప పదవులు, విద్యార్హతలు , హోదాలు లేని వారు మాట్లాడితే వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పేదరికం వల్ల వారు చదువుకోలేక పోయారు. అనుభవం అధ్యయనం అవసరం వారి మేధస్సును వికసింపచేస్తుంది. మేధావుల సమాజం దీన్ని గమనించడానికి సిద్దంగా లేరు. అందువల్ల ఎన్నికల ఫలితాల ముందస్తు అంచనాలన్నీ మారిపోయే తీర్పులు చూసి ఆశ్చర్యపోతుంటారు.

ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక యూనివర్సిటీ పెట్టాలని అనడమే తడవుగా వందకోట్ల మూలధనంతో పాటు ముచ్చర్ల కందుకూరి మండలం మీరే ఖాన్ పేటలో ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి, మంత్రులు భూమి పూజ చేశారు. 17 కోర్టులు ప్రకటించారు. మూడు నాలుగు నెలల కోర్సు తోపాటు డిగ్రీ కోర్సులుంటాయని ఏటా 20 వేల మందికి శిక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. ఈ సూచన ఎవరు చేశారోగాని వారు, దాన్నికార్య రూపంలోకి తెస్తున్న ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు అభినందనీయులు. ఇలాంటి ఆలోచనలు గత పదేళ్లలో మేధావులు ఎందుకు సూచించలేకపోయారు? 30 లక్షలమంది ఉద్యోగాలకోసం నిరీక్షిస్తున్నారని చెప్తుంటారు గానీ పలు పరిష్కారాలు చూసిందాకా లేక పోయారు. నా మట్టుకు నేను తమిళనాడు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాములను అధ్యయనం చేశాను. బీసీ ఎస్సీ డిపార్టుమెంట్ల ద్వారా 75 రకాల నూతన ఉపాధి కోర్సులకు శిక్షణ ఉంది. భూదానా పోచంపల్లిలో 22 రకాల కొత్త పాత స్కిల్సు శిక్షణ నడుస్తున్నది. తమిళనాడుల వలె మిగతా స్కిల్సు కూడా కలిపి 33 జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించాను. గురుకుల పాఠశాల విద్య పిజి వరకు పెంచి ఆయా డిపార్టుమెంటు పద్దులకిందనే యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని సూచించాను. ఇప్పటికీ ఇది అవసరమే. అపుడు రిజర్వేషన్ల కోసం ఓసీలు బతిమాలుతారు. ఇపుడీ రెండు కలిసి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రూపంలోకి వచ్చి చేరాయి. వీటిలో చేరిన వారికి వసతి , భోజన సౌకర్యాలు కలిపించడం అవసరం. లేని యెడల భూదానా పోచంపల్లి వలె రోజూ వచ్చి పోగలిగే సమీప ప్రాంతాలవారికే పరిమితమై శిక్షణలో చేరుతారు. పాత జిల్లాల స్థాయి లో కూడా ఐటీ యూనిట్లు ఏర్పాటు చేయడం అవసరం. చైనా నుండి ఎన్నో దిగుమతి చేసుకుంటున్నాము. వాటన్నిటిని ఇక్కడే ఉత్పత్తి చేసుకునే పరిశ్రమలు ప్రభుత్వ ప్రయివేటు కలయికతో ఏర్పాటు చేయడం అవసరం.

మన దేశ విదేశీమారక ద్రవ్యం ఐటి సెక్టార్ ద్వారా 45 శాతం సమకూరుతున్నాయి. కృత్రిమ మేధో సెక్టార్ తో ఉద్యోగాలు ఉపాధి కోత పడుతాయి. తద్వారా 80 శాతం మంది ఉపాధి కోల్పోతారు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంది. అందువల్ల నూతన ప్రణాళికలు ఆలోచించాలి. హైదరాబాద్ లో నాలుగవ మహా నగరంగా ముచ్చెర్ల ప్రణాళిక ఒక గొప్ప ఆలోచన. అలాగే ఔటర్ రింగు రోడ్ ఆనుకొని ఉన్న 33 ప్రాంతాల్లో 33 జిల్లాల నుండి హైదరాబాద్ నగర సౌకర్యాలు వసతులు పొందడానికి గృహ నిర్మాణ సంస్థ, ప్రయివేటు కలయికతో లక్షలాది మందికి టౌన్ షాపులు నిర్మించాలి. తద్వారా నగర విస్తరణ పెరిగి నగరం పై ఒత్తిడి తగ్గుతుంది. ఢిల్లీ వలె హైదరాబాద్ కాలుష్యం బారిన పడకుండా నల్లమల అటవీ ప్రాంతంలో, మహబూబ్ నగర్ జిల్లాలో అటవీ టూరిజం తో పాటు విద్యా సంస్థలు, వైద్య సంస్థలు ఏర్పాటు చేయడం అవసరం. బొల్లారం సికింద్రాబాద్ కంటే బీబీనగర్ వంటి రైల్వే సౌకర్యాలున్న ప్రాంతాలకు తరలిస్తే నగర విస్తరణలో 5 వ మహా నగరం రూపుదిద్దుకుంటుంది. చంచల్ గూడా జైలును తరలించి విద్యా వైద్య సంస్థలు ఏర్పాటు చేయడంతో పాటు ఉస్మానియా జనరల్ హాస్పటల్ ను పునర్ నిర్మాణం చేయాలి. పేద బడుగు వర్గాలకు నిలయమైన ఉస్మానియా, తెలుగు యయూన్ సిటీ, కాకతీయ, శాత వాహన, అంబేద్కర్ తదితర యూనివర్సిటీల్లో నూతన ఉపాధి గ్యారంటీ డిగ్రీ పిజీ కోర్సులు ప్రవేశ పెట్టడం అవసరం. ఇంత దాకా ఉపాధి కల్పనతో సంబంధం లేకుండా విద్యా వ్యవస్థ కొనసాగుతున్నందున లక్షలాది యువకులు నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారు. ఈ స్థితి మారడానికి మార్చడానికి తొలి అడుగు వేసిన ప్రభుత్వానికి అభినందనలు. ప్రాజెక్టుల్లో చేపల పెంపకం, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వరి తగ్గించి పప్పు ధాన్యాలు, పల్లి, నువ్వులు వంటి నూనె గింజల ఉత్పత్తిని ప్రవహించడం ద్వారా దిగుమతులు తగ్గి స్వయం పోషకంగా స్వావలంబన సాకారమవుతుంది.

Read More
Next Story