ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచండి : మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణలో ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. ప్లాట్ల విక్రయంతో ఆదాయం పెంచాలన్నారు.
ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాల పై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.సోమవారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో పాటు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దుదిళ్ల శ్రీధర్ బాబులు పాల్గొన్నారు.
- ‘‘జాయింట్ వెంచర్స్ లో విలువైన ఆస్తులు ఉన్నాయి..ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్లి వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ అంశంపై నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చండి’’అని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
- స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు అధ్యక్షతన మున్సిపల్,హౌసింగ్,లా సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయాలని భట్టి సూచించారు.ఈ కమిటీ సమావేశమై వారంలోగా సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు రూపొందించాలని భట్టి కోరారు.
కాలుష్యకారక పరిశ్రమల తరలింపు
కాలుష్యం సమస్య ఉన్న పరిశ్రమల నిర్వాహకులు నగరం విడిచి ఔటర్ రింగ్ రోడ్డు బయటకు వెళతామని సబ్ కమిటీకి విజ్ఞప్తులు చేశారు.పరిశ్రమల యజమానుల విజ్ఞప్తులు పరిశీలించి వారు ఓ ఆర్ ఆర్ బయట పరిశ్రమలు స్థాపించి ముందుకు వెళ్లేలా సహకరించండి, పరిశ్రమలను ప్రోత్సహించాలని హైదరాబాద్ నగరంలో జీరో కాలుష్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను సబ్ కమిటీ సభ్యులు కోరారు.
ప్లాట్లను వేలం వేయండి
మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెగ్యులర్ గా జరుగుతున్న ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియ పై సబ్ కమిటీ సభ్యులు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. ముందుగా కొంత బాగాన్ని వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు గరిష్ఠ ఆదాయం సమకూరేలా ముందుకు వెళ్లాలని గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు.రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పెండింగులో ఉన్న ప్లాట్ల స్థితిగతులను సబ్ కమిటీ సమీక్షించింది.
ప్రతీ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 5 ఎకరాల విస్తీర్ణంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇండస్ట్రియల్ పార్కు నిర్మించాలని పరిశ్రమల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్థిక చేయూత లభిస్తుందని అధికారులకు వివరించారు. సబ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలు మినిట్స్ రూపంలో నమోదు చేయాలని కోరారు.మరో వారంలో జరిగే సమావేశానికి అధికారులు యాక్షన్ టేకెన్ రిపోర్టుతో సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, సీసీఎల్ఏ చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హౌసింగ్ సెక్రటరీ బుద్ధ ప్రకాష్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ ,రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
Next Story