తెలంగాణలో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువే, ఐఎండీ అధికారుల విశ్లేషణ
x

తెలంగాణలో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువే, ఐఎండీ అధికారుల విశ్లేషణ

లానినా ప్రభావం వల్ల ఈ ఏడాది తెలంగాణలో చలితీవ్రత తక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.చలిగాలుల ప్రభావం తక్కువగా ఉంటుందని చెప్పారు.


లా నినా ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చలిపులి ప్రభావం తక్కువగా ఉంటుందని భారతీయ వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఏ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సాధారణ ఉష్ణోగ్రతల్లో స్వల్ప తేడా వల్ల చలి తీవ్రత తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. దేశం మధ్యలో తెలంగాణ రాష్ట్రం ఉండటం వల్ల ఉత్తరాది చలిగాలుల ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని ఆయన చెప్పారు.

- వర్షాకాలం రుతుపవనాల కాలం అక్టోబరు 16వతేదీతో ముగిసింది. దీంతో చలికాలం ఆరంభమైంది. చలికాలం ఆరంభమైనా, ఈ ఏడాది అంతగా వణికించదని ఐఎండీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
- ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ధర్మరాజు చెప్పారు. ఖమ్మం, సూర్యాపేట,నల్గొండ జిల్లాల్లో చలి ప్రభావం తక్కువగా ఉంటుందని ఆయన అంచనా వేశారు.

శీతాకాలం ప్రారంభం
హైదరాబాద్‌లో అసాధారణ వాతావరణంతో ఆస్తమా రోగుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది.గత కొన్ని రోజులుగా రాత్రివేళ చల్లగా ఉంటుంది.నైరుతి రుతుపవనాల ఉపసంహరణ తర్వాత అక్టోబరు 16వతేదీ నుంచి చల్లటి వాతావరణ పరిస్థితులను తెచ్చిపెట్టింది.శీతాకాలం త్వరగా ప్రారంభంతో తెలంగాణలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.చల్లటి వాతావరణం కారణంగా కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు కురుస్తుంది.



హైదరాబాద్ నగరంలో నాలుగేళ్ల కంటే తగ్గిన చలి

హైదరాబాద్ నగరంలో 2020వ సంవత్సరం నవంబరు నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రత 17.75 డిగ్రీల సెల్షియస్ నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 30.22గా ఉంది. 2022లో హైదరాబాద్ లో కనిష్ఠ ఉష్ణోగ్రత 20.44, 2022లో 17.11,2023లో 21.30 డిగ్రీల సెల్షియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఈ ఏడాది నవంబరు నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్షియస్ గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి ధర్మరాజు చెప్పారు. అంటే గత నాలుగేళ్ల కంటే హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత తగ్గిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు (గరిష్ట,కనిష్ట రెండూ) ఉండే అవకాశం ఉందని ధర్మరాజు వివరించారు.


Read More
Next Story