Bird Walk Festival | కవ్వాల్‌లో కనువిందు చేసిన బర్డ్ వాక్ ఫెస్టివల్
x

Bird Walk Festival | కవ్వాల్‌లో కనువిందు చేసిన బర్డ్ వాక్ ఫెస్టివల్

పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలతో విలసిల్లుతున్న కవ్వాల్ అభయారణ్యంలో రెండు రోజుల పాటు జరిగిన బర్డ్ వాక్ ఫెస్టివల్ పక్షిప్రేమికులకు కనువిందు చేసింది.


పచ్చని ఎత్తైన చెట్లు,రంగురంగుల పక్షులు, పులులే కాకుండా వివిధ రకాల వన్యప్రాణులకు నిలయంగా గోదావరి, కడెం నదుల పరివాహక ప్రాంతం అయిన కవ్వాల్‌ పులుల అభయారణ్యం మారింది.నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో విస్తరించిన కవ్వాల్‌ అభయారణ్యంలో డిసెంబరు 14వతేదీ నుంచి ఆదివారం వరకు రెండు రోజుల పాటు బర్డ్ వాక్ ఫెస్టివల్ జరిగింది.

- కవ్వాల్‌ టైగర్ రిజర్వ్‌లోని జన్నారం డివిజన్‌లో బర్డ్ వాక్ ఈవెంట్ నిర్వహించారు.ఈ బర్డ్ వాక్ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి పక్షిప్రేమికులు తరలివచ్చారు. పెద్ద పెద్ద లెన్స్ కెమెరాలు, బైనాక్యులర్స్ మెడలో వేసుకొని వచ్చిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు, పక్షిప్రేమికులు ఎగురుతున్న రంగురంగుల పక్షుల ఫొటోలను క్లిక్ మనిపించారు.

ఎన్నెన్నో రకాల పక్షులు

ఈ బర్డ్ వాక్ ఈవెంట్‌లో గ్రే హెడ్డ్ ఫిష్ ఈగిల్ (grey-headed fish eagle), వూలీ నెక్డ్ స్టోర్క్ (woolly necked stork), ఎగ్రెట్స్, గర్వాల్ బాతులు(gadwall), నార్తర్న్ పిన్‌టెయిల్స్, స్పాట్ బిల్డ్ బాతులు, కింగ్‌ఫిషర్స్(king fishers), వైట్ బ్రెస్ట్ వాటర్ ఈటర్స్ వంటి పలు రకాల పక్షులను పక్షిప్రేమికులు చూశారు.కవ్వాల్ అభయారణ్యంలో 300కు పైగా పక్షిజాతులున్నాయి. రెడ్ కాలర్డ్ పావురాలు, బ్లాక్ డ్రాంగోలు పక్షిప్రేమికులను ఆకట్టుకున్నాయి.తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రియులు, పక్షుల పరిశీలకులు, వన్యప్రాణి ఫొటోగ్రాఫర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పక్షి ప్రేమికులు అటవీ శాఖ రూపొందించిన సీతాకోకచిలుక ఉద్యానవనాన్ని సందర్శించారు. పక్షుల వీక్షణ కోసం బైసన్‌కుంట,బిర్తాన్‌పేట, కల్పకుంట, మైసమ్మకుంట క్యాంపులను సందర్శించారు. చలికాలంలో ఖండాంతరాల నుంచి వివిధ రకాల పక్షులు కవ్వాల్ కు తరలివచ్చాయి. వలస పక్షుల రాకతో కవ్వాల్ అభయారణ్యం పక్షుల కిలకిలరావాలతో మార్మోగింది.




కోలాహలంగా బర్డ్ వాక్ ఈవెంట్

కవ్వాల్‌ పులుల అభయారణ్యం పరిధిలోని జన్నారం సమీపంలోని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో రెండు రోజుల పాటు ప్రారంభమైన మూడో విడత పక్షుల నడక పండుగ కోలాహలంగా సాగింది. రాష్ట్ర అటవీశాఖ 2022వ సంవత్సరంలో మొదటి సారి బర్డ్ వాక్ ఫెస్టివల్ ను ప్రారంభించింది.గతంలో రెండు సార్లు ఫిబ్రవరి నెలలో బర్డ్ వాక్ ఫెస్టివల్ ను నిర్వహించారు. ఈ ఏడాది డిసెంబరు 14,15 తేదీల్లో నిర్వహించిన బర్డ్ వాక్ ఫెస్టివల్ బర్డ్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంది.




పరవశించిన పక్షిప్రియులు

తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పలువురు ప్రకృతి ప్రేమికులు, పక్షుల పరిశీలకులు, వన్యప్రాణి ఫొటోగ్రాఫర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఇందన్ పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.తొలుత అటవీ శాఖ అభివృద్ధి చేసిన సీతాకోకచిలుకల పార్కును సందర్శించారు.అనంతరం పక్షుల పరిశీలన కోసం బైసన్‌కుంట, బీర్తంపేట క్యాంపులకు చేరుకున్నారు.కవ్వాల్ అభయారణ్యంలో సాగిన మూడో ఎడిషన్ బర్డ్ వాక్ ఫెస్టివల్ వేడుకగా సాగింది.రంగురంగుల పక్షులు, వాటి కిలకిలరావాల విన్న పక్షిప్రియులు పరవశించి పోయారు. పక్షిప్రియులు అటవీ అధికారులతో మాట్లాడారు. పక్షి ప్రేమికులు రాత్రిపూట వన్యప్రాణులు, అటవీ సంరక్షణ గురించి అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పక్షిప్రియులు తాత్కాలిక గదులు, మేక్-షిఫ్ట్ టెంట్లలో బస చేశారు.అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఎకో-కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాలకు చెందిన ప్రకృతి ప్రేమికులు మాట్లాడారు.

Read More
Next Story