‘బీఆర్ఎస్ నేత జాతకాలు మా చేతుల్లో’.. అసదుద్దీన్ విమర్శలు
x

‘బీఆర్ఎస్ నేత జాతకాలు మా చేతుల్లో’.. అసదుద్దీన్ విమర్శలు

బీఆర్ఎస్ నేతలకు అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ఎక్కువగా ఉండేదని ఒవైసీ విమర్శించారు. బీఆర్ఎస్ నేతల గురించి తనకంతా తెలుసని విమర్శించారు.


రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. అలాగే శాశ్వత శత్రవులు కూడా ఉండరు. ఇవాళ మిత్రుత్వానికి మారు రూపంగా ఉన్న నేతలు కూడా రేపు పొద్దునకు బద్దశత్రువులుగా మారే ప్రమాదం, అవకాశం రాజకీయాల్లో భేషూగ్గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితే నెలకొంది. నిన్నమొన్నటి వరకు బీఆర్ఎస్‌తో భుజాలు రాసుకు తిరిగిన ఏఐఎంఐఎం పార్టీ.. ఈరోజు ఒక్కసారిగా గేర్ మార్చి బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించింది. బీఆర్ఎస్ నేతలందరి జాతకాలు తమ దగ్గర ఉన్నాయని, వాటిని బయటపెడితే ఒక్కొక్కరు వెక్కివెక్కి ఏడుస్తారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్‌పై ఎంటువంటి విమర్శలు చేయని ఎంఐఎం నేతలు ఒక్కసారిగా విమర్శలు గుప్పించడం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. బీఆర్ఎస్ నేతల గురించి తమకు అన్నీ తెలుసని, అవి చెప్తే వాళ్లు తట్టుకోలేరంటూ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మూసీ ప్రక్షాళనకు కసరత్తులు జరగలేదా అని ఒవైసీ ప్రశ్నించారు. ఆ విషయాలన్నీ బయటపెట్టాలా అని అడిగారు ఒవైసీ.

నోరు విప్పితే ఇబ్బందే గతి..

‘‘బీఆర్ఎస్ నేతల గురించి నాకెన్నో విషయాలు తెలుసు. నేను నోరు విప్పితే వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడతారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రచించలేదా? ఆ ప్రణాళికలు వద్దని నేను చెప్పలేదా? అన్నీ బయట పెట్టాలా? నేను నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడతారు. ఇళ్లు కదలకుండా మూసీ ప్రాజెక్ట్ చేస్తామంటే దాన్ని మేమూ స్వాగతిస్తాం. బీఆర్ఎస్ విధానాలు పరిస్థితులను బట్టి వాళ్లకు అనుగుణంగా మారడం కాదు. అవి స్థిరంగా ఉండాలి’’ అని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళకు కసరత్తులు చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఎందుకు ప్రశ్నిస్తుందో స్పష్టత ఇవ్వాలని, పేదల సంక్షేమం కోసమే ప్రశ్నిస్తుంటే.. అధికారంలో ఉన్నప్పుడు పేదలను పట్టించుకోకుండా ప్రణాళికలు ఎలా రచించారు? అని ప్రశ్నించారు ఒవైసీ.

మా వల్లే బీఆర్ఎస్‌కి అన్ని సీట్లు

అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ వల్లే బీఆర్ఎస్‌కు అన్ని సీట్లు వచ్చాయని ఒవైసీ చెప్పారు. ఎంఐఎం మద్దతుతోనే బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు సాధించిందని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 24 మంది అభ్యర్థులను మార్చి ఉంటే బీఆర్ఎస్‌నే అధికారం వరించి ఉండేదని తెలిపారు. అప్పట్లో అధికార బలం వల్లనో మరేమో కానీ బీఆర్ఎస్ నేతలకు అహంకారం అధికంగా ఉండేదని, వాళ్ల తలపొగరు ఓటమితో దిగిందంటూ కీలక విమర్శలు చేశారు.

Read More
Next Story