అమీన్‌పురా ఆక్రమణలపై హైడ్రా ఫోకస్
x

అమీన్‌పురా ఆక్రమణలపై హైడ్రా ఫోకస్

గ్రేటర్ పరిధిలో అన్యాక్రాంతమయిన భూములపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అమీన్‌పురాలో సమగ్ర సర్వే చేయడానికి హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు.


గ్రేటర్ పరిధిలో అన్యాక్రాంతమయిన భూములపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా అమీన్‌పురాలో జరిగిన ఆక్రమణలపై సమగ్ర సర్వే చేయడానికి హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. త‌మ కాల‌నీలోని పార్కులు, ర‌హ‌దారులతో పాటు కొన్ని ప్లాట్ల‌ను ప‌క్క‌నే ఉన్న గోల్డెన్ కీ వెంచ‌ర్స్ వాళ్లు ఆక్ర‌మించారంటూ వెంక‌ట‌ర‌మ‌ణ కాల‌నీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన హైడ్రా.. ఆక్రమణల నిగ్గు తేల్చాలని ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోనే సర్వే నెంబర్ 152, 153 లో ఉన్న వెంకటరమణ కాలనీలో హైడ్రా స‌ర్వే చేసింది. పార్కులు, రహదారులు కబ్జాకు గురి అయినట్టు నిర్ధారించింది. ఈ విష‌యంలో మ‌రింత లోతైన స‌ర్వే చేయించేందుకు హైడ్రా చ‌ర్య‌లు చేపట్టాలని ఫిక్స్ అయింది. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ స‌ర్వే ఆఫ్ ఇండియా , ఏడీ స‌ర్వే సంయుక్త ఆధ్వ‌ర్యంలో జాయింట్ స‌ర్వే చేసేందుకు హైడ్రా ప్ర‌య‌త్నం చేస్తోంది.

అంద‌రి స‌మ‌క్షంలో పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగే ఈ స‌ర్వేలో భాగ‌స్వామ్యం కావాలని హైడ్రా కోరింది. హైడ్రా సర్వే అంటూ చుట్టుపక్కల ఉన్న కాల‌నీ వాసులను తప్పుదోవ పట్టిస్తున్న గోల్డెన్ కీ వెంచ‌ర్స్ నిర్వాహ‌కుల‌తో పాటు.. ప‌లువురు ఆక్ర‌మ‌ణ‌దారులు వారి ఆక్ర‌మ‌ణ‌లు క‌ప్పి పుచ్చుకోడానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఎవ‌రూ బ‌లి కావ‌ద్దని హైడ్రా పేర్కొంది. ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో గోల్డెన్ కీ ఆస్తుల‌ను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) అటాచ్ చేసింది. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని ఆర్టీసీ కాల‌నీ, రంగారావు వెంచ‌ర్‌, చ‌క్ర‌పురి కాల‌నీ వాసులు కూడా ఏమైనా క‌బ్జాలుంటే ఫిర్యాదు చేయాల‌ని.. ఈ స‌మ‌గ్ర స‌ర్వేలో వారిని కూడా భాగ‌స్వామ్యం చేస్తామ‌ని హైడ్రా వెల్లడించింది. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని కాల‌నీ వాసులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని.. ఏమైనా ఫిర్యాదులుంటే హైడ్రా కార్యాల‌యానికి వ‌చ్చి నేరుగా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ప్రతి ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేపడతామని, కబ్జా జరిగినట్లు నిర్ధారిస్తే వెంటనే చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

Read More
Next Story