హైడ్రా కూలుస్తున్నవన్నీ అక్రమ నిర్మాణాలు కావా..!
x

హైడ్రా కూలుస్తున్నవన్నీ అక్రమ నిర్మాణాలు కావా..!

గ్రేటర్ పరిధిలో చెరువులు, నాలాలు, కుంటలను ఆక్రమించి కట్టేసిన అక్రమ నిర్మాణాలే టార్గెట్‌గా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది.


గ్రేటర్ పరిధిలో చెరువులు, నాలాలు, కుంటలను ఆక్రమించి కట్టేసిన అక్రమ నిర్మాణాలే టార్గెట్‌గా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది. రంగంలోకి దిగిన తొలి రోజు నుంచే హైడ్రా.. అక్రమ నిర్మాణాలు చేసిన వారికి సింహస్వప్నంలా మారింది. బఫర్‌జోన్, ఎఫ్‌టీపీఎల్ పరిధుల్లో నిర్మితమైన కట్టడాలను కూలుస్తున్నామంటూ హైడ్రా అధికంగా పేదల ఇళ్లనే కూలుస్తోందని, బడాబాబుల బంగ్లా జోలికి కూడా వెళ్లడం లేదని ప్రతిపక్షాలు ఏకిపారేస్తున్నాయి. ఇంతలో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పేరిట కూడా నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలు చేపట్టడం మరింత దుమారం రేపింది. అయితే తాజాగా ఈ హైడ్రాపై బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చినవన్నీ అక్రమ నిర్మాణాలు కావని, అసలు హైడ్రా అనేది ఒక పెద్ద హైడ్రామా అంటూ విమర్శలు గుప్పించారు. హైడ్రాను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ వారికి నచ్చిన స్థలాలకు ఖాళీ చేయించుకుందని ఆరోపించారు. లేకుంటే గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను ఇప్పుడెలా కాదంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ లేదా ఒక వ్యవస్థ వైఫల్యానికి ప్రజలు ఎలా బాధ్యులు అవుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండేవన్నీ ప్రభుత్వ భూములు అయిపోవని కూడా ఈటల వివరించారు. కొన్ని పట్టాభూములు కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటాయని, వాటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు పేర్కొంటూ కూల్చివేతలకు పాల్పడుతోందని మండిపడ్డారు. గ్రేటర్ పరిధిలో హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం జరుగుతుందని విమర్శలు చేశారు. పెద్దలైతే కోర్టులు గట్రా అంటారని తెలిసే.. కోర్టంటే భయపడే పేదలే టార్గెట్‌గా ఈ దందా చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఈటల.

గతంలో కూడా ఇంతే..

‘‘గతంలో కూడా ఇదే విధంగా బుల్డోజర్లను తోలి కక్షపూరితంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. పేదలే టార్గెట్‌గా ప్రభుత్వం అత్యంత హీనంగా వ్యవహరిస్తోంది. సామాన్యులకు శని, ఆదివారాల్లో కోర్టులు అందుబాటులో ఉండవనే ఆ రోజుల్లోనే కూల్చివేతలు చేపడుతోంది. నిజంగానే చెరువులు, వాగులు, వంకలను కాపాడాలంటే ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు భూములను లెక్కించాలి. కూల్చివేతల వల్ల రోడ్డునపడ్డ ప్రజలకు వెంటనే పరిహారం చెల్లించాలి. ప్రత్యామ్నాయం చూపాలి’’ అని డిమాండ్ చేశారు.

వాటిని దాచడానికే హైడ్రా డైవర్షన్

‘‘కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అన్న ఒక్క మాట చాలు.. ఆ పార్టీ నేతలను కొట్టుకునేలా చేయడానికి. ప్రతి ఒక్కరూ పదవుల కోసం ఆరాట పడటం తప్ప.. ప్రజల గురించి ఆలోచించే వారు లేరు. వాటిని సర్దుమణిగించలేక, ఎవరికీ నచ్చజెప్పలేకే రేవంత్ రెడ్డి మాటకొస్తే ఢిల్లీ బాట పడుతున్నారు. ఆ కలహాలు చల్లారేవరకు ప్రజల దృష్టిని మల్లించడం కోసం హైడ్రాను డైవర్షన్‌గా వాడుకుంటున్నారు’’ అని విమర్శలు గుప్పించారు. చెరువులు, వాగులు, వంకల రక్షణ కోసం అవసరమైతే భూసేకరణ చేపట్టాలని కోరారు. ఇదిలా ఉంటే ఇటీవల మూసీ నిర్వాసితులు తమ గోడు వెలిబుచ్చుకోవడం కోసం ఈటల ఇంటిని ఆశ్రయించారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ఈటల వారికి భరోసా ఇచ్చారు. చివరి వరకు వారికి అండగా ఉంటానని అన్నారు.

ఈటల అభయం

‘‘పేదల ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం బాగుపడినట్లు చరిత్రలో లేదు. సంజయ్ గాంధీ కూడా ఢిల్లీలో మారుతి కంపెనీ కోసం పేదల ఇళ్లను కూలగొట్టారు. చరిత్రలో పేదలతో పెట్టుకున్నవారు, పేదల కన్నీటికి కారకులైన వారికి మంచి జరిగిన దాఖలాలు లేవు. పోయేకాలం వచ్చిన సమయంలోనే పేదల జోలికి వెళ్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వచ్చినట్లుంది. అందుకే పేదల గూడు తొలగిస్తూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. బాధితులు ఎవరూ కూడా కోర్టులకు కూడా వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే కూల్చివేతలను శని, ఆదివారాలు జరపడం దారుణం. నిజాం సర్కార్ కంటే అత్యంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. హైదరాబాద్‌లోని పేదలు కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తుందట.. ఈ ప్రభుత్వం. వీరి తీరు బట్టలు లేవు కానీ బంగారం కొనిస్తా అని అన్నట్లుంది. ఎన్నికల సమయంలో ఈ మేక వన్నె పులులు.. ఓట్ల కోసం నోటికొచ్చిన మాటలు చెప్పారు. ముసలి కన్నీరు కార్చి పేదలను మోసం చేశారు. మూసీ బాధితులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు.. మూసీ నిర్వాసితుల పక్షాన ఉంటాను’’ అని ఆయన అభయమిచ్చారు.

Read More
Next Story