గండిపేట తర్వాత కేటీఆర్ టార్గెట్ గా హైడ్రా ఆపరేషన్?
హైదరాబాద్ శివార్లలో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని ఖానాపూర్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ద్రుష్టి సారించారు.
హైదరాబాద్ శివార్లలో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని ఖానాపూర్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ద్రుష్టి సారించారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించిన వ్యాపార సముదాయాలపై చర్యలు తీసుకుంటున్నారు. అక్రమంగా నిర్మించిన భవనాలను తెల్లవారుజామునుంచే నేలమట్టం చేస్తున్నారు. ఈ కట్టడాలన్నీ గండిపేట చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా... భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టింది. కూల్చివేతల్ని అడ్డుకునేందుకు యజమానులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
నెక్స్ట్ టార్గెట్ జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్?
GHMC పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ కల్పించడమే హైడ్రా ఏర్పాటు వెనక ఉన్న ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. ఈ సంస్థను ఏర్పాటు చేసిన నాటి నుంచి అధికారులు యుద్ధ ప్రాతిపదికన అక్రమ నిర్మాణాలను గుర్తించి నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో జన్వాడ లో నిర్మించిన కేటీఆర్ ఫార్మ్ హౌస్ పైన కూడా అధికారులు ఫోకస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు జన్వాడ ఫామ్ హౌస్ కూల్చబోతున్న హైడ్రా అంటూ ఒక ఫొటోని వైరల్ చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు కూడా స్పందిస్తున్నారు. మీరు ఫామ్ హౌస్ కూల్చేస్తే రూ.ఒకటి లేదా రెండు కోట్లు ఖర్చు అవుతుంది. మేము రూ.రెండు వందల కోట్లు లాస్ చేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.
గతంలో 'జన్వాడ ఫామ్ హౌస్' పై రేవంత్ ఫైట్...
2020 మార్చిలో అప్పటి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి, కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా జీవో 111 పరిధిలో ఉన్న భూమిలో అక్రమంగా ఫార్మ్ హౌస్ నిర్మించారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాకి చెందిన అప్పటి కాంగ్రెస్ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు, అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ వద్దకి చేరుకొని ఇది అక్రమ కట్టడమని ఆరోపణలు చేశారు. లోపలికి దూసుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఫామ్‌హౌస్ 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. భూయజమానులను బెదిరించి కొనుగోలు చేసిన భూమిపై నిర్మించినందున ఈ నిర్మాణం చట్టవిరుద్ధం. అంతేకాదు, ఈ ఫామ్‌హౌస్ GO 111 పరిధిలో ఉంది. ఫామ్‌హౌస్ నిర్మాణంలోలో భాగంగా ఫిరంగి నాలాలోని కొంత భాగం ఆక్రమణకు గురైంది. 301,302,312, 313 సర్వే నంబర్లలో బినామీ పేర్లతో ఫామ్‌హౌస్‌ను కేటీఆర్ నిర్మించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు 10 కి.మీ దూరంలో నిర్మాణ కార్యకలాపాలను జిఓ 111 నిషేధించింది. రెండు సరస్సుల పరివాహక ప్రాంతంగా ఉన్న ఆరు మండలాల్లోని 84 లిస్టెడ్ గ్రామాల్లో ఎక్కడా హోటళ్లు, నివాస గృహాలు నిర్మించరాదని జీవో 111 ఆదేశిస్తోంది" అని రేవంత్ తెలిపారు.
నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను రేవంత్ ఆశ్రయించగా, కేటీఆర్ తో పాటు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరేశారని రేవంత్ పై పోలీసులు కేసు నమోదు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే ఈ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఆ ఫామ్ హౌజ్ తనది కాదని ఆయన అప్పీల్ చేయగా, హైకోర్టు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.