హైదరాబాద్ జూపార్కు ఘనత ఏమిటంటే...ఐదేళ్లుగా ఐఎస్ఓ గుర్తింపు
x

హైదరాబాద్ జూపార్కు ఘనత ఏమిటంటే...ఐదేళ్లుగా ఐఎస్ఓ గుర్తింపు

హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌ మరో మైలురాయిని సాధించింది.ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ)-9001:2015 నుంచి 5వసారి జూపార్కు గుర్తింపు పొందింది.


హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌ మరో మైలురాయిని సాధించింది. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ)-9001:2015 వరుసగా 5వ సంవత్సరం జూపార్కు గుర్తింపు పొందింది. జూపార్కు మెరుగైన నిర్వహణ, ప్రణాళిక బద్ధమైన జంతువుల పెంపకం,వన్యప్రాణుల సంరక్షణ, పరిశోధనలకు సంబంధించి ఐఎస్ఓ సంస్థ తనిఖీలు నిర్వహించి ఈ గుర్తింపు కల్పించింది.

- ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ శివయ్య 2024-25 సంవత్సరానికి గాను ఐఎస్ఓ -9001-2015 సర్టిఫికెట్ ను డాక్టర్ సునీల్ నేతృత్వంలోని జూపార్కు పరిపాలన బృందానికి అందించారు.

వన్యప్రాణుల సంరక్షణకు కృషి
అంతరించి పోతున్న వన్యప్రాణుల సంరక్షణ కోసం చేసిన కృషి, ప్రణాళిక బద్ధమైన వన్యప్రాణుల సంతానోత్పత్తి, పరిశోధనలు చేసినందుకు గుర్తింపుగా హైదరాబాద్ జూపార్కుకు ఐఎస్ఓ -9001-2015 సర్టిఫికెట్ దక్కిందని హైదరాబాద్ జూపార్కు క్యూరేటర్ జె వసంత ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఆకట్టుకుంటున్న జూపార్కు
1959వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలోని పబ్లిక్ గార్డెన్ లో ఉన్న నెహ్రూ జంతుప్రదర్శనశాల 1963 అక్టోబరు 6వతేదీన మీరాలం ట్యాంకుబండ్ డ్యామ్ వద్దకు మార్చారు. ప్రకృతి సిద్ధంగా పచ్చని ఎతైన చెట్లు, పక్షుల కిలకిలరావాలు, వివిధ వన్యప్రాణులతో కూడిన జూపార్కు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వలస వచ్చిన పలు విదేశీ పక్షులు ఈ జూపార్కులో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వన్యప్రాణుల కోసం అడవుల్లో ఉండేలా ప్రత్యేకంగా 159 ఎన్ క్లోజర్లు నిర్మించారు. ఆసియా సింహం, రాయల్ బెంగాల్ టైగర్ ఈ జూలో పెంచుతున్నారు.

మొసళ్ల బ్రీడింగ్ స్టేషన్
నెహ్రూ జంతుప్రదర్శన శాలలో మొసళ్ల సంఖ్యను పెంచడానికి దీని బ్రీడింగ్ స్టేషన్ ను 1980వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ జూపార్కులో మచ్చల జింకలు, కృష్ణ జింకలు, నీలై, సాంబార్ జింకలున్నాయి. ఖడ్గమృగం, ఏనుగులు, నీలగిరి లంగూర్, లయన్ టెయిల్డ్ మకాక్, సారస్ క్రేన్, గ్రే పెలికాన్, పెయింటెడ్ కొంగలు లాంటి అరుదైన జాతులున్నాయి. విదేశాలకు చెందిన ఒరంగుటాన్, హిప్పోపొటామస్, ఆఫ్రికన్ సింహం, జాగ్వార్, ఉష్ట్రపక్షి, మకావ్స్,గ్రీన్ ఇగ్వానా జాతులున్నాయి.



జంతువుల దత్తత పథకం

వన్యప్రాణి ప్రేమికులు ముందుకు వచ్చి జూపార్కులోని జంతువులను దత్తత తీసువడం విశేషం. వన్యప్రాణుల దత్తత కార్యక్రమం ద్వారా వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు, పాఠశాలలు, కుటుంబాలు సమూహాలు ముందుకు వచ్చాయి. జంతువుల సంరక్షణ కోసం పలువురు సహకారం అందిస్తున్నారు. జన్మదినం సందర్భంగా పలువురు వన్యప్రాణి ప్రేమికులు జూపార్కులోని జంతువులను దత్తత తీసుకొని వాటికి సంవత్సరం పాటు వాటి ఆహారం, సంరక్షణ కోసం అయ్యే డబ్బును విరాళంగా అందిస్తున్నారు.


Read More
Next Story