వర్షాల్లోనూ కంగనాని తాకిన హైదరాబాద్ సెగ
సినీనటి, బీజేపీకి ఎంపీ కంగనా రనౌత్ దేశవ్యాప్తంగా నిరసన సెగలు తగులుతున్నాయి.
సినీనటి, బీజేపీకి ఎంపీ కంగనా రనౌత్ దేశవ్యాప్తంగా నిరసన సెగలు తగులుతున్నాయి. దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో ఆమె నటించిన ఎమర్జెన్సీ సినిమా సెన్సార్ బోర్డు వద్ద నిలిచిపోయింది. విడుదలకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో ఇందిరా గాంధీని తప్పుగా చూపించారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడుదల చేయడానికి వీలు లేదంటూ హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆమె సిక్కులను బంగ్లాదేశ్ ఆందోళనకారులతో పోల్చారని సిక్కు సమాజం మండిపడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోనూ కంగనా కి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఆదివారం కంగనా రనౌత్ కి వ్యతిరేకంగా హైదరాబాద్ లోని సిక్కు సమాజ్ ఆందోళనకు దిగింది. ఆమె దిష్టిబొమ్మ దగ్ధం చేసింది. కంగనా రనౌత్ రైతులను బంగ్లాదేశ్ ఆందోళనకారులతో పోల్చారంటూ హైదరాబాద్ లో సిక్కు సమాజ్ ఆందోళనకు దిగింది. గౌలిగూడా గురు ద్వార్ వద్ద కంగనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆమె దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎమర్జెన్సీ సినిమా లో కంగనా రనౌత్ సిక్కులను తీవ్రవాదులతో పోల్చారని సిక్కు సంఘం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే కంగనా వ్యాఖ్యలను వెనెక్కి తీసుకొని... క్షమాపణ చెప్పాలని సిక్కు మతపెద్దలు డిమాండ్ చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా విడుదలను నిలిపివేయాలని లేని పక్షంలో సినిమా థియేటర్ల వద్ద జరిగే హింసకు ప్రభుత్వాలదే బాధ్యత అని హెచ్చరించారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకొని కంగనా ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి... ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అసలు వివాదం ఇదే...
ఇటీవల కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... దేశ రాజధానిలో కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. బంగ్లాదేశ్ వంటి పరిస్థితులను తీసుకొచ్చే ప్రయత్నం జరిగి ఉండొచ్చని, కానీ మన దేశ బలమైన మోదీ నాయకత్వం కారణంగా అది జరగలేదని చెప్పుకొచ్చారు. రైతుల ఉద్యమం పేరుతో హింస చెలరేగిందని అన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు ఆమెపై మండిపడుతున్నారు.