శివార్లకు దూసుకొచ్చిన హైదరాబాద్ రియల్, భూములకు రికార్డు ధర
x
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్లాట్లకు పెరిగిన డిమాండ్

శివార్లకు దూసుకొచ్చిన హైదరాబాద్ రియల్, భూములకు రికార్డు ధర

హైదరాబాద్ శివార్లలో భూమి బంగారమౌతూ ఉంది....


గ్లోబల్ సిటీగా ఎదిగిన హైదరాబాద్ నగరంలోనే కాదు నగర శివారు ప్రాంతాల్లోనూ భూముల ధరలకు రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న తొర్రూర్ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తాజాగా ఓపెన్ ప్లాట్లకు నిర్వహించిన వేలంలో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. తొర్రూరులో చదరపు గజం ధర రూ.67,500 పలికింది.


ప్లాట్ల కొనుగోలుకు పోటీ
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కనీస బేస్ ధర చదరపు గజం 25వేల రూపాయలుగా నిర్ణయించినా, ఖాళీ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల మధ్య పోటీ ఏర్పడటంతో అనూహ్యంగా భూమి ధర చదరపు గజం 67,500కు చేరింది. తొర్రూరులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వేసిన లేఅవుట్ లో కార్నర్ ప్లాట్ల కోసం కొనుగోలుదారులు పోటీ పడ్డారు. 24 కార్నిర్ ప్లాట్లు ఉండగా ఓ ప్లాటు 62వేల రూపాయలకు విక్రయించారు. సృగృహ కార్పొరేషన్ వంద ప్లాట్లకు సగటున చదరపు గజం ధర 33వేల రూపాయలకు హౌసింగ్ బోర్డు విక్రయించింది.

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు రూ.105కోట్ల ఆదాయం
తొర్రూరు ప్లాట్ల విక్రయాల వల్ల రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు 105 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింబది. తెలంగాణ రెవెన్యూ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హెచ్ఎండీఏ అధికారుల సమక్షంలో జరిగిన ప్లాట్ల వేలంపాటలో కొనుగోలు దారులు తీవ్రంగా పోటీ పడ్డారు. 240 మంది బిడ్డర్లు ఈ వేలంపాటలో పాల్గొన్నారు. 300చదరపు గజాల నుంచి 450 గజాల ప్లాట్ల దాకా వేలం వేశారు.

కూకట్ పల్లిలో ఎకరం ధర రూ.65.34 కోట్లు
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు ఫేజ్ 4లోని ప్లాట్ నంబరు 1కు చెందిన ఎకరం భూమిని 65.34కోట్ల రూపాయలకు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా సంస్థ వేలంపాటలో కొనుగోలు చేసింది. కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ కు రికార్డు స్థాయి ధర పలికింది. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో నగరంలోనే కాకుండా నగర శివారు ప్రాంతాల్లోనూ భూముల ధరలు పెరిగాయని తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారి వీపీ గౌతం చెప్పారు.

బిల్డ్ నౌతో వేగంగా భవన నిర్మాణ అనుమతులు
హైదరాబాద్ నగరంలో భవనాలు, లేఅవుట్ లకు అనుమతులను వేగంగా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. బిల్డ్ నౌ ఆన్ లైన్ అప్లికేషన్ సహాయంతో కేవలం 37 నిమిషాల్లోనే 13,665 దరఖాస్తులను పరిశీలించి భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. మరో విశేషమేమిటంటే కేవలం 69 అంతస్తుల భవన నిర్మాణానికి 64 సెకన్లలోనే అధికారులు బిల్డ్ నౌ అప్లికేషన్ సాయంతో అనుమతి ఇచ్చేశారు. భవనాల నిర్మాణానికి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల నుంచి వేగంగా అనుమతులు వస్తున్నాయని వినూత్న రియల్ ఎస్టేట్ అధిపతి మాటూరి సురేందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Read More
Next Story