
సిగాచీ కంపెనీలో సహాయ చర్యలు
హైదరాబాద్ ఫార్మా పేలుడుకు కారణం ధూళీ, భద్రతా లోపాలే...
సిగాచీ ఫ్యాక్టరీలో పేలుడుకు ధూళీ, భద్రతా లోపాలే కారణమని ఐఐసీటీ శాస్త్రవేత్తలు సమర్పించిన ప్రాథమిక నివేదికలో తేల్చి చెప్పారు.
సిగాచీ ఫార్మా ఫ్యాక్టరీలో ధూళీ, భద్రతా లోపాలే (Dust, Safety Lapses) పేలుడుకు కారణమని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తల బృందం (IICT Scientists) తేల్చిచెప్పింది. సిగాచీ పేలుడు ఘటనపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన శాస్త్రవేత్తల కమిటీ ప్రాథమిక నివేదకను (Preliminary Report) సమర్పించింది. ధూళి వల్ల ప్రమాదాలు వాటిల్లకుండా పరిశ్రమల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని శాస్త్రవేత్తలు సూచించారు. ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనలు పాటించడం లేదని నివేదిక ఇచ్చినా యాజమాన్యం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తప్పు పట్టారు.
పాత యంత్రపరికరాలు కూడా ప్రమాదానికి కారణం
పాత యంత్రపరికరాలను వినియోగించడం, భద్రతా ప్రమాణాలు పాటించక పోవడం ఈ పేలుడుకు కారణమని శాస్త్రవేత్తలు చెప్పారు.పరిశ్రమల్లో అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు పాటించాలని, ఫ్యాక్టరీల చట్టంలోని లోపాలను సరిదిద్దాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఫార్మా పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదం హెచ్చరిక అని కమిటీ పేర్కొంది.
ఫ్యాక్టరీలో నిర్వహణ లోపాలు
ఫ్యాక్టరీలో నిర్వహణ లోపాలు కూడా ఉన్నాయని కమిటీ తేల్చి చెప్పింది. సిగాచీ పేలుడు ఘటనపై (Hyderabad pharma blast) ఐఐసీటీ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు డాక్టర్ టి ప్రదీప్ కుమార్, డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సంతోష్ గూగిలతో కూడిన బృందం సిగాచీలో పరిశీలన జరిపిన తర్వాత ప్రాథమిక నివేదికను అందజేశారు. ఈ శాస్త్రవేత్తల కమిటీ నెలరోజుల లోపల సమగ్ర నివేదిక సమర్పించనుంది.
సిగాచీ శిథిలాల్లో ఛిద్రమైన శరీర భాగాలు
సిగాచీ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి వారం రోజులైనా మరో 8 మంది కార్మికుల జాడ లేదు.ఫ్యాక్టరీ శిథిలాల్లో వందకు పైగా ఛిద్రమైన కార్మికుల శరీర భాగాలు, రక్తపు మరకలను డీఎన్ఏ పరీక్ష కోసం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు.సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఫార్మా పరిశ్రమలో పేలుడు ఘటన జరిగి వారం రోజులు గడచినా ఇంకా 8 మంది కార్మికుల ఆనవాళ్లు లభించలేదు. దీంతో రెస్క్యూ సిబ్బంది పేలుడు జరిగిన ప్రాంతంలో వందకు పైగా ఛిద్రమైన కార్మికుల శరీర భాగాలు, రక్తపు మరకలను సేకరించి డీఎన్ఏ విశ్లేషణ కోసం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపారు.తప్పిపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది.జాడ తెలియని వారి 8 మంది కుటుంబ సభ్యుల నుంచి రెండవ సారి రక్త నమూనాలను సేకరించారు. వాటితో శిథిలాల్లో లభించిన రక్తపు మరకలతో సరిపోలుస్తున్నారు.
ఆనవాళ్ల కోసం ఎదురుచూపులు
సిగాచీలో జాడ లేకుండా పోయిన 8 మంది కార్మికుల కుటుంబసభ్యులు పునరావాస కేంద్రంలోనే ఉన్నారు. తమ వారి జాడ కోసం వారు హెల్ప్ డెస్క్, ఆసుపత్రులు, పేలుడు జరిగిన ప్రదేశాల చుట్టూ తిరుగుతున్నారు. తమ వారు సజీవంగా ఉండాలని కోరుతూ ఆశగా ఎదురు చూస్తున్నారు.పేలుడులో 33 మంది గాయపడగా, వారిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ దుర్ఘటనలో మరో 18 మందిప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో పది మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ ప్రమాద సమయంలో పరిశ్రమ లోపల 143 మంది ఉండగా వారిలో 61 మంది సురక్షితంగా బయటపడ్డారు.
42కు పెరిగిన మృతుల సంఖ్య
సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రమాదంలో (Sigachi Accident) గాయపడిన మరో కార్మికుడు చికిత్స పొందుతూ మరణించడంతో ఆదివారం మృతుల సంఖ్య 42కి పెరిగింది.ఉత్తరప్రదేశ్‌కు చెందిన జితేందర్ పటాన్‌చెరులోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. శవపరీక్ష తర్వాత అతని మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగించనున్నారు.అధికారులు మృతదేహాన్నిి ఉత్తరప్రదేశ్‌కు తరలించనున్నారు.శిథిలాల నుంచి వెలికితీసిన ఛిన్నాభిన్నమైన శరీర భాగాలు మధ్యప్రదేశ్‌కు చెందిన చిక్కన్ సింగ్ కుటుంబ సభ్యుల డీఎన్ ఏ తో సరిపోలాయి.
హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలి : కార్మిక సంఘాలు
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పేలుడు ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సిగాచి ఫ్యాక్టరీలో దుర్ఘటన స్థలాన్ని సందర్శించిన వివిధ కార్మిక సంఘాల సభ్యులు ఈ సంఘటనకు కంపెనీ యాజమాన్యాన్ని ప్రత్యక్షంగా బాధ్యులుగా పేర్కొంటూ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఈ సంఘటనపై పారదర్శక దర్యాప్తును ఆదేశించాలని, సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు.ప్రతి బాధితుడి కుటుంబాలకు హామీ ఇచ్చిన రూ. 1 కోటి ఎక్స్ గ్రేషియాను మరింత ఆలస్యం చేయకుండా త్వరగా విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, బీఆర్ టీయూ, టీఎన్ టీయూసీ, టీయూసీఐ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Next Story