
యాదగిరిగుట్ట ఆలయంలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిష్కోవా సందడి
Miss World :అందాల పోటీలకు హైదరాబాద్ ముస్తాబు
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ప్రపంచ అందాల భామలు కనువిందు చేస్తున్నారు.మే 7వ తేదీ నుంచి జరగనున్న 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌కు హైదరాబాద్ ముస్తాబైంది.
హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ పోటీల తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ముద్దుగుమ్మల సందడి ప్రారంభమైంది. గత నెలలో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిష్కోవా తెలంగాణను సందర్శించారు. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో (Miss World pageant)పాల్గొననున్న ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 నందినీ గుప్తా బుధవారం హైదరాబాద్ నగరాన్ని సందర్శించారు. చార్మినార్ చెంత ఉన్న లాడ్ బజార్ లో గాజులు కొన్న ఈ అందాల భామ సందడి చేశారు.
యాదాద్రి ఆలయంలో ప్రపంచ సుందరి పూజలు
చెక్ రిపబ్లిక్ నుండి మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిష్కోవా గత నెలలో తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. సాంప్రదాయ ఎర్రరంగు చీర ధరించి ఆలయంలో ప్రార్థనలు చేసి ఆలయ నిర్మాణ శైలిని మెచ్చుకున్నారు.
పోటీలకు శిక్షణ పొందుతున్నా : ఫెమినా మిస్ ఇండియా నందినీ గుప్తా
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో తాను పాల్గొనేందుకు సిద్ధమవుతున్నానని ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 నందినీ గుప్తా చెప్పారు. ‘‘ప్రపంచ వేదికపై మెరిసేందుకు నేను కఠినంగా శిక్షణ పొందుతున్నాను.ప్రతిరోజూ తెలంగాణ, హైదరాబాద్ గురించి నేను చాలా నేర్చుకుంటున్నాను..భారతదేశంలో వరుసగా రెండవసారి మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి, ఇది గర్వకారణం,తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని, పర్యాటక రంగం పెరగాలని నేను ఎదురు చూస్తున్నాను’’ అని నందినీగుప్తా పేర్కొన్నారు.
చౌమహల్లా ప్యాలెస్‌లో గాలా డిన్నర్
ప్రతిష్ఠాత్మక 72వ మిస్ వరల్డ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ నగరాన్ని(Hyderabad Gears Up) ముస్తాబు చేస్తున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చెప్పారు.తెలంగాణను ప్రపంచ పటంలో ఉంచే గొప్ప సాంస్కృతిక వేడుక అని ఆమె పేర్కొన్నారు. అందాల చౌమహల్లా ప్యాలెస్ దీనిలోని గొప్ప షాండ్లియర్‌ల కింద నిజాంల గొప్ప వారసత్వం మధ్య మే నెలలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ కోసం గాలా డిన్నర్ వేడుకను నిర్వహిస్తామని ఆమె తెలిపారు.
మిస్ వరల్డ్ కు 140 దేశాల సుందరాంగులు
హైదరాబాద్ మిస్ వరల్డ్ ఈవెంటుకు 140 దేశాల నుంచి అందాల భామలు పాల్గొననున్నారు. ప్రతి దేశం తమ జాతీయ అందాల పోటీ విజేతను 72వ మిస్ వరల్డ్‌లో పోటీ పడటానికి పంపనుంది. మిస్ ఇండియా కూడా ఈ ప్రపంచ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.సుందరాంగులే కాకుండా 3,500 మంది జర్నలిస్టులు మిస్ వరల్డ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
రామప్ప ఆలయం హైలెట్
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప ఆలయాన్ని ఈ వేడుక సందర్భంగా హైలైట్ చేయనున్నారు. యాదగిరిగుట్ట ఆలయం ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిష్కోవా సందర్శించిన తర్వాత ప్రజాదరణ పెరిగింది.తెలంగాణ ప్రపంచ ప్రఖ్యాత పోచంపల్లి గ్రామానికి అందాల భామలను తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యవేక్షణలో ఈ వేడుకలను సన్నాహాలు చేస్తున్నారు.
యూపీలో మహాకుంభ్, తెలంగాణలో మిస్ వరల్డ్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మహా కుంభ్‌ను అట్టహాసంగా నిర్వహించింది. తెలంగాణలో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుపనున్నారు. ఈ పోటీలు తెలంగాణ రాష్ట్రానికి ఒక మలుపు అని స్మతా సబర్వాల్ చెప్పారు.
పర్యాటకులను ఆకర్షిస్తాం : మంత్రి జూపల్లి
ఇటీవల పర్యాటకరంగ ప్రచారం కోసం తాను యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లగా, తెలంగాణ ఎక్కడ ఉందని అడిగారని తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీలో చెప్పారు.‘‘చాలా దేశాలకు తెలంగాణ గురించి తెలియదు.తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి ప్రదర్శించడానికి, పర్యాటకులను ఆకర్షించడానికి మిస్ వరల్డ్ ఈవెంట్‌ను సద్వినియోగం చేసుకోవడమే మా ప్రభుత్వ ప్రణాళిక’’అని మంత్రి కృష్ణారావు ప్రకటించారు.
పోచంపల్లిలో గ్రాండ్ ఫ్యాషన్ షో
మే 15వతేదీన జరగనున్న రాబోయే మిస్ వరల్డ్ ఫెస్టివల్ కోసం పోచంపల్లిలో సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ చేనేత వస్త్రాలు ధరించి తెలంగాణ ఐకానిక్ చేనేతలను ప్రదర్శించే గ్రాండ్ ఫ్యాషన్ షో నిర్వహించనున్నట్లు స్మితా సబర్వాల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకర్షణీయమైన తెలంగాణ జానపద సాంస్కృతిక ప్రదర్శనలు చిందు యక్షగానం, మనోహరమైన మెటల్ కెన్నెరా, లయబద్ధమైన రింజా సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
త్రిలింగ దేశం...తెలంగాణ
మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహిస్తామని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ చెప్పారు. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మధ్య భూభాగాన్ని కాకతీయులు పాలించిన ప్రాంతం త్రిలింగ దేశం, తెలుగు మాట్లాడే కాకతీయుల రాజ్యం, తెలుగు దేశం + ఆణెం అంటే దేశం, కాలగమనంలో "తెలంగాణ" అనే పదంగా మారింది. పురాతన రాతియుగం నుంచే తెలంగాణ ప్రాంతం ఉనికిఉందని స్మితా సబర్వాల్ ప్రపంచ అందాల భామ క్రిస్టినా పిష్కోవాకు వివరించి చెప్పారు.
Next Story