ఈ ఊరు ఊరంతా శ్రీనివాసులే.. తొందర్లో శ్రీనివాసుల రాష్ట్ర సమ్మేళనం
x

ఈ ఊరు ఊరంతా శ్రీనివాసులే.. తొందర్లో 'శ్రీనివాసుల రాష్ట్ర సమ్మేళనం'

తెలుగు రాష్ట్రాలలో పేర్లకో ప్రత్యేకత ఉంది. కొన్ని పేర్లు చాలా గమ్మత్తుగా, చిత్ర విచిత్రంగా ఉంటాయి. కొన్ని చాలా కామన్ గా ఉంటాయి. అటువంటి వాటిలో శ్రీనివాస్ ఒకటి..


తెలుగు రాష్ట్రాలలో పేర్లకో ప్రత్యేకత ఉంది. కొన్ని పేర్లు చాలా గమ్మత్తుగా, చిత్ర విచిత్రంగా ఉంటాయి. మరికొన్ని చాలా కామన్ గా ఉంటాయి. పాత రోజుల్లోనైతే పిల్లలు పుట్టి చనిపోతుంటే దిష్టిపోతుందేమోనన్నట్టుగా పెంటయ్య, మూలయ్య, మాలయ్య, పెద్దయ్య, పిచ్చయ్య లాంటి పేర్లను పెట్టేవారు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ల కులదైవాల పేర్లు పెట్టేవారు. ఆ ప్రాంతంలో ఏ దేవుడు బాగా పాపులర్ అయితే ఆ పేరు పెట్టడం ఆనవాయితీ.


.ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు చాలా ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఇది చాలా మామూలు విషయం. మగవాళ్ల పేర్ల చివర యాకి యావత్తు ఇస్తే ఆడవాళ్ల పేర్లకు మా కి మా వత్తు ఇస్తే సరిపోయేది. అలా వచ్చినవే చాలా పేర్లు. కొన్ని ప్రాంతాలలో యాదయ్య, యాదమ్మ, కిట్టయ్య, కిట్టమ్మ, కొండయ్య, కొండమ్మ లాంటి పేర్లు బాగా ఫేమస్. మరికొన్ని ప్రాంతాలలో మాలకొండయ్య, చంద్రయ్య, చంద్రమ్మ, లక్ష్మయ్య, లక్ష్మీ, సుబ్బారావు, సుబ్బమ్మ, వెంకట్రావు, వెంకాయమ్మ, సీతయ్య, సీతమ్మ, పెద్దయ్య, పద్మ ఉంటే అన్ని చోట్లా బాగా ఎక్కువగా వినబడే పేరు శ్రీనివాస్.

తెలుగు రాష్ట్రాలలో శ్రీనివాసుడికి ఉండే ప్రత్యేకత అది. చాలా కుటుంబాలకు కులదైవం, ఇష్టదైవం. తిరుమల ఏడుకొండల వాడికి ఉండే పేరు ప్రతిష్టతలకు అంతటి విశిష్టత ఉంది.
తిరుపతి తిరుమల లడ్డూ ప్రసాదం వివాదాస్పదమైన నేపథ్యంలో శ్రీవారి పేరు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఉండే దైవజ్ఞ శ్రీనివాస్ కి ఓ గమ్మత్తు ఆలోచన వచ్చింది. కాళేశ్వరంలో శ్రీనివాస్ పేరిట ఎంతమంది ఉన్నారో వాళ్లందర్నీ ఒక చోట జతచేస్తే ఎలా ఉంటుందో అనుకున్నారు. అనుకున్నదే తడవుగా కార్యాచరణకు పూనుకున్నారు. మనమంతా శ్రీనివాసులమే అనే పేరిట ఓ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఇక చూస్కో.. వందల మంది అందులో చేరిపోయారు. అందరూ కుశలప్రశ్నలు, ఈతి బాధలు, కష్టసుఖాలు వంటి అనేక విషయాలపై పోస్టులు పెట్టుకుంటున్నారు. లడ్డూ వివాదం నేపథ్యంలో శ్రీనివాసులందరూ ఓచోట కలవాలన్న ఊటుకూరి శ్రీనివాసరెడ్డి ఆలోచన మేరకు కరీంనగర్ విద్యానగర్ లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంచుకున్నారు. దాదాపు 150 నుంచి 200 మంది శ్రీనివాసులు సెప్టెంబర్ 28న అక్కడ కలిసి సందడి చేశారు. 'చిన్న శ్రీనివాసు, పెద్ద శ్రీనివాసు, ఆ ఇంటి శ్రీనివాసు, ఈ ఇంటి శ్రీనివాసు' అని పలకరింపులు, ఏరా శ్రీనివాసు ఎలా ఉన్నావంటూ కుశల ప్రశ్నల అనంతరం ఏడుకొండల వాణ్ణి వేడుకున్నారు. భక్తి ప్రపత్తులతో భజనలు చేశారు. గోవిందనామాలు పాడారు. సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీనివాసుల గ్రూపు ఏర్పాటు చేసి అందర్నీ ఒక చోట చేర్చి ప్రపంచ రికార్డు సృష్టించాలనుకున్నారు. అదే విషయాన్ని ఊట్కూరి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఎక్కువ మంది శ్రీనివాసులు మద్దతివ్వడంతో ఆయన ఇప్పుడు ఆ పనిలో పడ్డారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఊర్లో ఉన్న శ్రీనివాసుల్న ఏకం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
Read More
Next Story